పైసల్లేని పంచాయతీలు!

ABN , First Publish Date - 2022-05-17T10:34:54+05:30 IST

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, పాలనాపరమైన వ్యవహారాలను నిర్వహించలేక పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి.

పైసల్లేని పంచాయతీలు!

  • ఆర్థిక సంక్షోభంతో పరేషాన్‌లో పాలకవర్గాలు 
  • నిధుల్లేక... నిర్వహణకు అష్ట కష్టాలు
  • నిల్చిపోతున్న వివిధ అభివృద్ధి పనులు


హైదరాబాద్‌, మే 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలన్నీ ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్నాయి. అభివృద్ధి పనులు, పాలనాపరమైన వ్యవహారాలను నిర్వహించలేక పాలకవర్గాలు చేతులెత్తేస్తున్నాయి. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా పంచాయతీలకు ని ధులు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటిస్తున్నా.. నగదు చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. బ్యాంకు ఖాతాల ప్రీజింగ్‌ కారణంగా మంజూరైన నిధులు చేతికి వచ్చేందుకు మూడు, నాలుగు నెలలు పడుతుండటంతో అభివృద్ధి పనులు, పారిశుధ్య నిర్వహణ బిల్లులు, మల్టీపర్పస్‌ వర్కర్ల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐలు చెల్లించలేక పాలకవర్గాలు అవస్థలు పడాల్సి వస్తోంది. వివిధ పద్దుల ద్వారా గ్రామపంచాయతీకి వచ్చిన ఆదాయాన్ని పంచాయతీ అకౌంట్‌లో డిపాజిట్‌ చేసి మళ్లీ బిల్లులు చెల్లించేందుకు ఆ డబ్బులు వినియోగించుకునే అవకాశం ఉంటుంది. కానీ, పంచాయతీ అకౌంట్లను ప్రభుత్వం ఫ్రీజ్‌ చేయడంతో బిల్లుల చెల్లింపునకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అకౌంట్‌లో డబ్బులున్నా వినియోగించుకునేందుకు అవకాశం లేకుండా పోయిందని, గతంలో వివిధ పనుల నిమిత్తం ఇచ్చిన చెక్కులు సైతం చెల్లకుండా పోయాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, మూడు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామ పంచాయతీల పరిధిలో రాష్ట్రం నుంచి రావాల్సిన ఎస్‌ఎ్‌ఫసీ నిధులు మంజూరు కాలేదు. కేవలం కేంద్ర నిధులు వస్తున్నా.. వాటిని దారి మళ్లించడంతో పంచాయతీల నిర్వహణ తలనొప్పిగా మారిందని పాలకవర్గాలు చెబుతున్నాయి. 


సిబ్బంది జీతాల కోసం..

మేజర్‌ గ్రామ పంచాయతీల పరిధిలో ఆదాయ వనరులు ఉండటంతో కొంత ఇబ్బంది లేనప్పటికీ.. ఆదాయ వనరుల్లేని పంచాయతీల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. చాలా గ్రామపంచాయతీలు పారిశుధ్య కార్మికులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉన్నాయి.  ఈ పరిస్థితిని అఽధిగమించేందుకు పలు గ్రామాల్లో ఉప సర్పంచు, వార్డు మెంబర్ల సహకారంతో చందాలు వేసుకుని జీతాలు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.. ఇదిలా ఉంటే ఇప్పటికే పూర్తయిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడంతో ఇప్పుడు చేస్తున్న పనుల కోసం తీసుకున్న అప్పులకు కనీసం వడ్డీ కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నామని సర్పంచులు వాపోతున్నారు. అప్పులు తీర్చలేక కూలి పనులకు వెళ్తున్నామని మరికొందరు ఆవేదన చెందుతున్నారు. ఆదాయ వనరులు అంతంతమాత్రంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలు నిధులు ఏమాత్రం సరిపోవడం లేదని సర్పంచులు చెబుతున్నారు. అధికారులు తమకు టార్గెట్లు విధిస్తూ నిధులు ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని, ఉన్నతాధికారులు నేరుగా ఫోన్‌ చేసి పనులు పూర్తి చేయకపోతే.. సస్పెం డ్‌ చేస్తామంటూ హెచ్చరిస్తున్నారని సర్పంచుల సంఘం నా యకులు చెబుతున్నారు. టార్గెట్లు పెట్టిన అధికారులు బిల్లులు చెల్లించడంలో ఎందుకు ఉత్సాహం చూపడం లేదో తెలపాలని పంచాయతీ పాలకవర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి. 


గ్రామ పంచాయతీలకు వచ్చే సాధారణ నిధులు.. ఖర్చు ఇలా..!

ప్రతినెలా కేంద్రం నిధులు రూ.80 వేలు, ఎస్‌ఎ్‌ఫసీ నుంచి రాష్ట్ర నిధులు రూ.70వేలు కలిపి మొత్తం రావాల్సింది రూ.1,50,000.

మంచినీటి సరఫరా, వీధిదీపాలు, తదితర కరెంటు బిల్లు రూ.50 వేలను రాష్ట్ర ప్రభుత్వానికే చెల్లించాలి. 

సిబ్బంది వేతనాలకు రూ.45వేలు

గ్రామానికి చెందిన ట్రాక్టర్‌ ఈఎంఐకి రూ.10వేలు

స్టేషనరీ, కార్యాలయ నిర్వహణకు రూ.10వేలు

మిగిలిన రూ.35వేలతో నర్సరీల నిర్వహణ, డ్రైనేజీలు మరమ్మతు, వీధి దీపాల ఏర్పాటు.


బిచ్చమెత్తుకోవాల్సిన పరిస్థితి 

మాది మేజర్‌ గ్రామ పంచాయతీ అయినప్పటికీ.. వివిధ అభివృద్ధి పనుల కోసం రూ.70 లక్షల వరకు అప్పు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ నిర్వాకం వల్ల మా పరిస్థితి ఘోరంగా మారింది. గతేడాది బిచ్చమెత్తుకుని నిరసన తెలిపాక.. అధికారులు స్పందించి నిధులు మంజూరు చేశారు. ఇది కేవలం మునుగోడు పరిస్థితి మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లోని సర్పంచులు ఎదుర్కొంటున్న అవస్థలు ఇవి. 

- ఎం.వెంకన్న, సర్పంచు, మునుగోడు, నల్గొండ జిల్లా.


ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు  

ఈ ప్రభుత్వం వచ్చాక ఉప సర్పంచులకు చెక్‌పవర్‌ ఇవ్వడం ఇబ్బందిగా మారింది. మంజూరైన నిధులను గ్రామ సర్పంచులు అభివృద్ధి పనులకు వాడుకోలేని పరిస్థితి. రాష్ట్రంలోని 12,769 గ్రామాల సర్పంచులు ఈ అధ్వాన్న పరిస్థితిని ఎవరికీ చెప్పుకోలేకపోతున్నారు. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు ఇచ్చే నిధులను 2011 ప్రకారం కాకుండా 2021 జనాభా లెక్కల ప్రకారం విడుదల చేయాలి.  

- చక్కటి వెంకటేశ్‌ యాదవ్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు, 

తెలంగాణ సర్పంచుల సంఘం


Updated Date - 2022-05-17T10:34:54+05:30 IST