పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు బేఖాతార్‌

ABN , First Publish Date - 2022-06-30T05:59:07+05:30 IST

జిల్లా పంచాయతీరాజ్‌లో ఆ శాఖ కమిషనర్‌ కోనా శశిధర్‌ ఉత్తర్వులను బేఖాతార్‌ చేశారు. జిల్లాలోని పంచాయతీల్లో సిబ్బంది డెప్యుటేషన్లు రద్దు చేసి వారిని పూర్వపు స్థానాలకు పంపాలని ఈ నెల 13న కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పంచాయతీరాజ్‌ కమిషనర్‌ ఉత్తర్వులు బేఖాతార్‌
డీపీఓ కార్యాలయం

 జిల్లాలో పంచాయతీ సిబ్బంది డెప్యుటేషన్లు రద్దు అంతంతే..

ఉత్తర్వులు అందలేదంటున్న కొందరు ఉద్యోగులు 

అనంతపురం న్యూటౌన, జూన25: జిల్లా పంచాయతీరాజ్‌లో ఆ శాఖ  కమిషనర్‌ కోనా శశిధర్‌ ఉత్తర్వులను బేఖాతార్‌ చేశారు. జిల్లాలోని పంచాయతీల్లో సిబ్బంది డెప్యుటేషన్లు రద్దు చేసి వారిని పూర్వపు స్థానాలకు పంపాలని ఈ నెల 13న కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్స్‌కు అనుగుణంగానే బదిలీలు చేయాలని ఉత్తర్వులు పంపారు. బదిలీలకు సంబంధించి గడువు పొడిగించడంతో జాబితాను బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. అయితే గ్రేడ్స్‌ విషయంలో ఎంతవరకు కమిషనర్‌ ఉత్తర్వులను అమలు చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. డీపీఓ కార్యాలయ సిబ్బంది రెండు రోజులు నానాతంటాలు పడి డెప్యుటేషన్లపై ఉన్న వారి జాబితా తయారు చేసి, రద్దు ఉత్తర్వులు తయారు చేశారు. అయితే సంబంధిత సిబ్బందికి చేరవేయడం మాత్రం మరిచారు. ఎందుకిలా జరిగిందన్నది అధికారులకే తెలియాలి.


పాత స్థానాలకు పలువురు

 పలు పంచాయతీల్లో పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, అక్కడి పాలకులకు మధ్య ఒద్దిక కుదరకపోవడంతో అక్కడ తట్టుకోలేక మరో ప్రాంతానికి డెప్యుటేషనపై వెళ్లారు. ఇలాంటి వారందరికి తిరిగి అక్కడే అవకాశం కల్పించేలా ఉత్తర్వులు వెలువడటంతో  కొందరు డీపీఓ కార్యాలయంలోనే ఉత్తర్వులు తీసుకొని వారి పాత స్థానాలకు వెళ్లారు. అయితే ఆసక్తి లేని వారు మాత్రం ఉత్తర్వులు తీసుకోవడానికి కూడా ముందుకు రాలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాకు ఉత్తర్వులే అందలేదని అదే స్థానాల్లో మకాం వేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మరి కొన్ని మండలాలకు డెప్యుటేషన ఉత్తర్వులే అందలేదన్న చర్చ జరుగుతోంది. 


డీపీఓగారూ.. ఇదేంటీ.. పంచాయితీరాజ్‌ కమిషనర్‌ కోనా శశిధర్‌ ఉత్తర్వుల మేరకు డిప్యూటేషన్లు అన్ని రద్దు చేసినట్లు డీపీఓ కార్యాలయం నుండి కమిషనర్‌ కార్యాలయానికి నివేధిక పంపినట్లు తెలిసింది. అయితే వీటి పరిస్థితి ఏమిటన్నది డీపీఓకే తెలియాలి. మచ్చుకు కొన్ని పరిశీలించినట్లు అయితే కొడికొండ పంచాయతీ కార్యదర్శి సుధాకర్‌ డెప్యుటేషనపై పామిడిలో ఉన్నారు. ఆయన ఇప్పటికీ రిలీవ్‌ కాలేదు. పెనుకొండ మండలం నుండి మల్లికార్జున వజ్రకరూరుకు డెప్యుటేషనపై వెళ్లారు. ఈయన ఇప్పటి వరకు రిలీవ్‌ కాలేదు. అయితే ఈయనకు డెప్యుటేషన రద్దు ఉత్తర్వులే పంపనట్లు సమాచారం.  మరికొన్ని ప్రాంతాల్లో డెప్యుటేషనపై ఉన్న సిబ్బంది అక్కడ నుండి రిలీవ్‌ అయ్యారు. పాత స్థానాల్లో జాయిన అయ్యి సెలవులో వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితి ఏమిటన్నది అధికారులకే తెలియాలి. ఆత్మకూరులో పని చేసే జూనియర్‌ అసిస్టెంట్‌ సుబహాన డెప్యుటేషనపై పామిడిలో ఉన్నారు. ఇయన కూడా రిలీవ్‌ కానట్లు సమాచారం.  తనకల్లు నుంచి జూనియర్‌ అసిస్టెంట్‌ వాణీ డెప్యుటేషనపై ఆత్మకూరులో ఉంది. ఇప్పటికీ రిలీవ్‌కాలేదు. తనకల్లు నుంచి  అంజి అనే ఉద్యోగి పామిడిలో డెప్యుటేషనపై ఉన్నారు. రిలీవ్‌ కాలేదు.  ఉరవకొండ నుండి పామిడికి డెప్యుటేషనపై వెళ్లిన సిబ్బంది కూడ రిలీవ్‌ కాలేదు. ఈ వివరాలు డీపీఓ దృష్టికి రాకపోతే కనీసం డీఎల్‌పీఓలు, ఈఓఆర్డీలు అయిన ఆయన దృష్టికి తీసుకురావాల్సి ఉంది. ముదిగుబ్బలో ఉండాల్సిన ఈఓఆర్డీ సిద్దారెడ్డి డెప్యుటేషనపై కొత్తచెరువుకు వెళ్లారు. ధర్మవరం ఈఓఆర్డీ అశోక్‌రెడ్డి డెప్యుటేషనపై పుట్టపర్తి మండలానికి వెళ్లారు. వీరికి కూడా డెప్యుటేషన ఉత్తర్వులు అమలు కానట్లు తెలిసింది. అలాంటప్పుడు కమిషనర్‌కు ఏ విధంగా నివేదిక పంపుతారన్నది డీపీఓ సిబ్బందికి తెలియాలి.


పంచాయతీ రాజ్‌ కమిషనర్‌ పంపిన ఉత్తర్వుల మేరకు డెప్యుటేషన్లు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు డీపీఓ ప్రభాకర్‌రావు తెలిపారు. అందుకనుగుణంగా అమలు చేయాల్సిందేనన్నారు. అమలు కాని వాటికి సంబంధించి ఆయన మౌనం పాటించారు. వాటిని కూడా అమలు చేస్తారా..? లేదా ఒత్తిళ్ల వల్ల వదిలేస్తారా? అన్నది తెలియాల్సి ఉంది.


Updated Date - 2022-06-30T05:59:07+05:30 IST