అమరావతి: ఆర్థిక సంవత్సరం తొలి రోజునే... పంచాయతీలకు జగన్ సర్కారు గట్టి ఝలక్ ఇచ్చింది. తన ఆర్థిక కష్టాల నుంచి కొంతైనా బయటపడేందుకు... పంచాయతీలు పన్నుల రూపంలో వసూలు చేసుకున్న మొత్తాలను కూడా ప్రభుత్వం తీసేసుకుంది. అయితే పంచాయతీల్లో నిధులు ప్రభుత్వం లాగేసుకోవడంపై పంచాయతీరాజ్ ఛాంబర్ అత్యవసర సమావేశమైంది. ఛాంబర్ అధ్యక్షులు వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో హై లెవల్ కమిటీ వర్చువల్ సమావేశమైంది. ఏపీ ప్రభుత్వ చర్యను సమావేశం తీవ్రంగా ఖండించింది. గ్రామం నుంచి జిల్లా స్థాయి వరకు అధికారులకు వినతి పత్రాలు, భిక్షాటన, ధర్నాలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే కోర్టును ఆశ్రయించాలని సమావేశంలో తీర్మానం చేశారు.
గత ఏడాది డిసెంబరులో రూ.7660 కోట్ల ఆర్థిక సంఘం నిధులను సొంత ఖాతాకు మళ్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పంచాయతీలకు చెందిన ‘జనరల్ ఫండ్స్’ను గుట్టుచప్పుడు కాకుండా లాక్కుంది. రాష్ట్రంలోని మొత్తం 12,918 పంచాయతీల ఖాతాలనూ ఖాళీ చేసినట్లు తెలుస్తోంది. గురువారం వరకు ఖాతాల్లో ఉన్న నిధులు శుక్రవారానికి పూర్తిగా మాయం కావడంతో సర్పంచులు హతాశులయ్యారు. ఖాతాలు ‘జీరో’ బ్యాలెన్స్ చూపుతున్నాయని వాపోయారు.