వేతన యాతన..!

ABN , First Publish Date - 2022-06-18T03:53:45+05:30 IST

మేజర్‌ పంచాయతీ అయిన ఉదయగిరిలో పారిశుధ్య కార్మికులకు ఆకలి కేకలు తప్పడంలేదు.

వేతన యాతన..!
పట్టణంలో పేరుకుపోయిన చెత్తచెదారం

8 నెలలుగా అందని జీతాలు

పారిశుధ్య కార్మికుల ఆకలి కేకలు

విధులు బహిష్కరణ

ఆపరిశుభ్రంగా ఉదయగిరి పట్టణం

ఉదయగిరి రూరల్‌, జూన్‌ 17: మేజర్‌ పంచాయతీ అయిన ఉదయగిరిలో పారిశుధ్య కార్మికులకు ఆకలి కేకలు తప్పడంలేదు. పంచాయతీలో విధులు నిర్వహిస్తున్న 23 మంది పారిశుధ్య కార్మికులకు ఎనిమిది నెలలుగా వేతనాలు చెల్లించకపోవడంతో అష్టకష్టాలు పడుతున్నారు. నెలకు రూ.7,100 చొప్పున వారికి వేతనం అందజేస్తారు. నెలల తరబడి వేతనం అందకపోవడంతో కుటుంబ పోషణ, పిల్లల చదువు, ఇంటి అద్దె, కరెంటు, పాల బిల్లు తదితర వాటికి డబ్బు సమకూర్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేతనాలు చెల్లించాలని ఈనెల 1వ తేదీన స్థానిక తహసీల్దారు కార్యాలయం ఎదుట కార్మికులు నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. అనంతరం అధికారులు చర్చలు జరిపి వేతనాలు చెల్లిస్తామని హామీ ఇవ్వడంతో విధులకు హాజరయ్యారు.  అయితే ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే తప్ప వేతనాలు వచ్చే పరిస్థితి లేదని అధికారులే చెపుతున్నారని వాపోతున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో వచ్చే వేతనం కూడా చేతికందక ఏం తినాలి.. ఎలా బతకాలని కార్మికులు ప్రశ్నిస్తున్నారు. తమ సమస్యను అధికారులు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకపోవడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేతనాలు చెల్లించకపోతే విధులకు హాజరు కాలేమంటూ మూడు రోజుల నుంచి విధులు బహిష్కరించారు. అలాగే వేతనాలు చెల్లించకపోతే సమ్మె బాట పడతామని హెచ్చరిస్తున్నారు. కార్మికులు విధులకు ఎగనామం పెట్టడంతో పట్టణంలో పలు వీధుల్లో చెత్తచెదారం పేరుకుపోవడంతోపాటు మురికి కాలువలు పొంగి రోడ్లపై ప్రవహిస్తుండడంతో పట్టణ ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా వేతనాలు అందించి తమను ఆదుకోవాలని వారు కోరుతున్నారు. 


Updated Date - 2022-06-18T03:53:45+05:30 IST