పంచాయతనం

ABN , First Publish Date - 2022-01-21T05:30:00+05:30 IST

నిత్యం స్మరించి, పూజిస్తే పాపాలను నాశనం చేసే అయిదుగురు దేవతలకు నిర్వర్తించే విశిష్టమైన పూజా విధానాన్ని ‘పంచాయతనం’ అంటారు. ..

పంచాయతనం

అదిత్యం అంబికామ్‌ విష్ణుం గణనాథం మహేశ్వరం

పంచదేవాన్‌ స్మరేన్నిత్యం పూజయేత్‌ పాపనాశనం

నిత్యం స్మరించి, పూజిస్తే పాపాలను నాశనం చేసే అయిదుగురు దేవతలకు నిర్వర్తించే విశిష్టమైన పూజా విధానాన్ని ‘పంచాయతనం’ అంటారు. కర్మసాక్షి అయిన సూర్యుడు, శక్తి స్వరూపిణి అయిన అమ్మవారు, స్థితికారకుడైన మహా విష్ణువు, ఆదిపూజ్యుడైన గణపతి, లయకారకుడైన శివుడు... ఈ అయిదుగురినీ కలిపి పూజించే ఈ విధానాన్ని ఆదిశంకరులు ఏర్పాటు చేశారంటారు. ఆ కాలంలో వైష్ణవులు, శైవులతో పాటు గాణపత్యులు, సూర్యుణ్ణి ఉపాసించేవారు, శాక్తేయులు, కుమారస్వామిని ఆరాధించేవారు. వీరి మధ్య తీవ్రమైన ఘర్షణలు చోటు చేసుకొనేవి. ఆ పూజా విధానాలన్నిటినీ ఒకటిగా చేసి... పంచాయతన విధానానికి శంకరులు రూపకల్పన చేశారు. ఏ దేవతను ప్రధానంగా... మధ్యలో నిలిపి పూజిస్తే... ఆ దేవత పేరిట పంచాయతనాన్ని వ్యవహరిస్తారు. షణ్మతాలుగా పిలిచే పై ఆరు పద్ధతుల్లో... అయిదుగురు అర్చామూర్తులు కాగా... కుమారస్వామి తేజో రూపంలో... అంటే అర్చన వినియోగించే అగ్ని రూపంలో ఉంటాడన్నది పండితుల మాట.

Updated Date - 2022-01-21T05:30:00+05:30 IST