ఒత్తిడిలో కార్యదర్శులు

ABN , First Publish Date - 2021-02-25T04:21:43+05:30 IST

గ్రామాలను ప్రగతి పథకంలోకి తీసుకువెళ్లేం దుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది.

ఒత్తిడిలో కార్యదర్శులు
కొత్తపల్లి సర్పంచ్‌పై చర్యలు తీసుకోవాలని మంచిర్యాల డీపీవోకు వినతి పత్రం అందజేస్తున్న కార్యదర్శులు(ఫైల్‌)

--ప్రభుత్వ లక్ష్యాలతో పనిభారం

- సర్పంచ్‌ల వైఖరితో నలిగిపోతున్న వైనం 

-పల్లె ప్రగతికి తోడైన ఉపాధిహామీ పనులు 

-మెమోలు, సస్పెన్షన్‌లతో ఆందోళన 

బెల్లంపల్లి, ఫిబ్రవరి 24: గ్రామాలను ప్రగతి పథకంలోకి తీసుకువెళ్లేం దుకు రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులను కేటాయి స్తున్నాయి. ఆయా పథకాల అమలు బాధ్యత పంచాయతీ కార్యదర్శులపై మోపడంతో రోజు రోజుకు పని భారం పెరుగుతోందని వాపోతున్నారు. పల్లె ప్రగతి పనులతో సతమతమవుతున్న కార్యదర్శులపై కొత్తగా ఉపాధిహామీ పనుల భారం వేయడంతో ఒత్తిడికి గురవుతూ పలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా ఇటీవల గ్రామపంచాయతీ నిధుల విషయంలో సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. పనిచేసిన దానికంటే ఎక్కువగా బిల్లులు చేయాలని సర్పంచ్‌లు కార్యదర్శులపై ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఎక్కువ బిల్లులు చేయని పక్షంలో కార్యదర్శులతో సర్పంచ్‌లు వాగ్వాదానికి దిగుతున్న సంఘటనలు తరుచూ జిల్లాలో చోటు చేసుకుంటున్నాయి. ఓ వైపు కార్యద ర్శులపై ప్రభుత్వం ఎన్నో అదనపు బాధ్యతలను పెట్టడంతో సతమతమవు తున్న నేపథ్యంలో మరో వైపు సర్పంచ్‌లు రాజకీయ ఒత్తిడి తీసుకువస్తుం డ డంతో కార్యదర్శులు ఆవేదన చెందుతున్నారు. తాజాగా తాండూర్‌ మండ లంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ కార్యదర్శిని చేసిన పనుల కంటే అదనంగా బిల్లులు చేయాలని ఒత్తిడి తెచ్చినా అంగీకరించ లేదు. దీంతో సర్పంచ్‌తో పాటు ఆమె భర్త కార్యదర్శిపై దాడి చేయడంతో పోలీసులు సర్పంచ్‌తో పాటు ఆమె భర్తను అరెస్టు చేశారు. ఈ ఘటన జిల్లాలో కలకలం రేపింది. 

ఫ జిల్లాలోని 18 మండలాల్లో..

జిల్లాలోని 18 మండలాల్లో 311 గ్రామపంచాయతీల్లో కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. రోజు గ్రామపంచాయతీ పనులను పల్లె ప్రగతి యాప్‌లో  ఎప్పటికప్పుడు పొందుపర్చాలి. పల్లె ప్రగతిలో భాగంగా వివిధ పనులు చేపడుతున్నారు. ప్రభుత్వం ఉపాధిహామీ పథకంలో ఫీల్డ్‌ అసిస్టెంట్‌లను తొలగించి వారి బాధ్యతలను సైతం కార్యదర్శులకు అప్పగించారు. దీంతో రెగ్యులర్‌ పనులకు తోడుగా ఈజీఎస్‌ పనులను కూడా చూడాల్సి వస్తోంది. జనన, మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు పంచాయతీ కార్యాలయం నిర్వ హణ సైతం కార్యదర్శులే చూసుకుంటారు. పల్లె ప్రగతి పనులతో సతమతమ వుతుండగా ఉపాధిహామీ పనులు చూడాల్సి రావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా పనిభారం అధికంగా ఉందని, యాప్‌లు, ఉపాధిహామీ పనుల బాధ్యతల నుంచి తప్పించాలని పంచాయతీ కార్యదర్శులు ఆందోళనలు చేపట్టి ఉన్నతా ధికారులకు వినతి పత్రాలు సైతం అందజేశారు. పనుల్లో ఏ మాత్రం అలసత్వం వహించినా అధికారులు కార్యద ర్శులకు మెమోలు జారీ చేస్తూ సస్పెండ్‌ సైతం చేస్తున్నారు. ఉపాధిహామీ పనులపై నిర్లక్ష్యం వహించినందుకుగాను ఏకంగా 284 మంది కార్యదర్శులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశమైంది. 

- గతంలో రికార్డులు రాసి..

గ్రామపంచాయతీలో చేపట్టిన పనులకు బిల్లులు పొందాలంటే గతంలో రికార్డులు రాసి తీసుకునేవారు. కొందరు సర్పంచులు అక్రమాలకు పాల్పడి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ప్రభుత్వం ఆన్‌లైన్‌ వ్యవ స్థను తీసుకువచ్చింది. ఆన్‌లైన్‌లో పంచాయతీకి సంబంధించిన నిర్వహణ, పనుల ఖర్చులు, బిల్లుల చెల్లింపు పొందుపర్చే బాధ్యతలను కార్యదర్శులకు అప్పగించింది. చెక్కులపై కార్యదర్శి సంతకం చేస్తేనే బిల్లులు మంజూ ర య్యేలా రూపకల్పన చేసింది. అయితే ఇక్కడే సర్పంచ్‌లకు మింగుడుపడడం లేదు. జిల్లాలోని చాలా గ్రామాల్లో సర్పంచ్‌లు, కార్యదర్శుల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటుండడంతో కలెక్టర్‌తో పాటు జిల్లా పంచాయతీ అధికారికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్తున్నాయి. గ్రామాల్లో సర్పంచ్‌, ఉపసర్పంచ్‌ల మధ్య నిధులు, బిల్లుల విషయంలో ముదురుతున్న విభేదాలతో కార్యద ర్శులు నలిగిపోతున్నారు. మహిళా సర్పంచ్‌లు ఉన్న చోట వారి భర్తలు, కుటుం బీకులు పెత్తనం చెలాయిస్తున్నారని, చేసిన పనుల కంటే అదనంగా బిల్లులు  చేయాలని ఒత్తిడి తెస్తున్నారని కలెక్టర్‌కు, జిల్లా పంచాయతీ అధికారికి కార్యదర్శులు సర్పంచ్‌లపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని పలు గ్రామపంచాయతీల్లో ఉన్నతాధికారులు విచారణ సైతం చేపడుతున్నారు.

సమన్వయంతో విధులు నిర్వహించాలి.. 

- నారాయణరావు, జిల్లా పంచాయతీ అధికారి

పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు సమన్వయంతో విధులు నిర్వహించుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి.  సర్పం చ్‌లపై కార్యదర్శులు, కార్యదర్శులపై సర్పంచ్‌లు ఫిర్యాదులు చేస్తున్నారు.  విధుల నిర్వహణలో విషయంలో ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నాం. అయినా కొందరిలో మార్పు రావడం లేదు. అదనపు బిల్లులు చేయాలని సర్పంచ్‌లు కార్యదర్శులపై ఒత్తిడి తీసుకురావడం సరైంది కాదు. మహిళా సర్పంచ్‌లు ఉన్న గ్రామాల్లో వారి భర్తలు, కుటుంబీకులు మేమే సర్పంచ్‌లంటూ అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఇలాంటి వారిని ఇప్పటికే హెచ్చరించాం. కొత్త పంచాయతీరాజ్‌ చట్టం ప్రకారం ప్రతి ఒక్కరూ నడుచుకోవాలి. 

కార్యదర్శిపై దాడి చేసిన ఇద్దరి అరెస్టు

తాండూర్‌(బెల్లంపల్లి):  తాండూర్‌ మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కార్యదర్శి కీర్తిపై  దాడిచేసిన కొత్తపల్లి సర్పంచ్‌ ఏల్పుల రజిత, సర్పంచు భర్త రాజన్నను బుధవారం అరెస్టు చేసినట్లు తాండూర్‌ ఎస్సై శేఖర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 20వ తేదీన  గ్రామపంచాయతీ కార్యాలయంలో విధులు నిర్వహిసు ్తన్న పంచాయతీ కార్యదర్శి కీర్తిపై అకారణంగా సర్పంచ్‌తో పాటు ఆమె భర్త దాడి చేశారని ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Updated Date - 2021-02-25T04:21:43+05:30 IST