సర్పంచులు, గ్రామ కార్యదర్శుల మధ్య కోల్డ్‌ వార్‌

ABN , First Publish Date - 2021-11-24T17:09:00+05:30 IST

పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అలసత్వం వహించడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు, నర్సరీలు, పల్లెప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గండీడ్‌, మహమ్మదా బాద్‌ మండలాల పరిధిలో మొత్తం 49 గ్రామ

సర్పంచులు, గ్రామ కార్యదర్శుల మధ్య కోల్డ్‌ వార్‌

మారని పంచాయతీ కార్యదర్శుల తీరు 

పట్టనట్లు వ్యవహరిస్తున్న సర్పంచులు

ఎవరికి వారు పట్టువదలని వ్యవహారం

అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం


మహబూబ్‎నగర్/మహమ్మదాబాద్: పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల అలసత్వం వహించడంతో గ్రామాల్లో పారిశుధ్య పనులు, నర్సరీలు, పల్లెప్రగతి పనులు నత్తనడకన సాగుతున్నాయి. గండీడ్‌, మహమ్మదా బాద్‌ మండలాల పరిధిలో మొత్తం 49 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఇందులో మేజర్‌ పంచాయతీలు గండీడ్‌, వెన్నచెడ్‌,  మహమ్మదాబాద్‌, నంచర్ల ఉన్నాయి. మిగతా 22 పంచాయతీలు ఉన్నాయి. చౌదర్‌పల్లి గ్రామ కార్యదర్శి సర్పంచ్‌ కుమారుడి దగ్గర సీసీ రోడ్డుపనుల్లో డబ్బులు డిమాండ్‌ చేస్తూ ఏసీబీకి పట్టుపడ్డ విషయం తెలిసిందే. మరికొన్ని గ్రామాల్లో కూడా పలువురు గ్రామ కార్యదర్శులు ప్రతీపనికి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నట్లు  అరోపణలు వినిపిస్తున్నాయి. చేయితడపనిదే గ్రా మాల్లో పనులు కావడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని గ్రామ పంచాయతీ లలో సర్పంచులకు, గ్రామ కార్యదర్శుల మధ్య పొసగడం లేదు. కొందరు గ్రామ కార్యదర్శులు సర్పంచులకు మధ్య కోల్డ్‌వార్‌ నలకొంది. 


దీంతో పనులు కూడా సాగడంలేదు. గ్రామ సర్పంచ్‌లకు గ్రామ పంచాయతీ కార్యదర్శుల గొడవల వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు కుంటుపడుతున్నాయి. గండీడ్‌ మండల పరిధిలోని రెడ్డిపల్లి నర్సరీ తరలించే సమయంలో అక్కడ ఉన్న మొక్కలను గ్రామపంచాయతీ ట్రాక్టర్‌తో తొక్కించి పాత నర్సరీని ఖాళీచేసి కొత్త ప్రదేశానికి తరలించారు. ఈ ఘటన పలు విమర్శలకు తావిచ్చింది. దీనిపై విచారణ కూడా చేపట్టారు. చర్యలకు కూడా సిద్ధమవుతున్నారు. అదేవిధంగా మహమ్మదాబాద్‌ మండల పరిధిలోని ఓ మేజర్‌ గ్రామ పంచాయతీకి చెందిన ఉపసర్పంచ్‌ భర్త వైకుంఠధామం పనులు 90 శాతం చేశారు. మిగతా పదిశాతం పనులు చేయకపోవడంతో గ్రామ కార్యదర్శి కలుగ చేసుకొని అక్కడకు గ్రామ పంచాయతీ కార్మికులను ఉపయోగించి పనులు చేయించినట్లు ఆరోపణలు వచ్చాయి. గతేడాది నర్సరీకి సంబంధించి మొక్కల పెంచడానికి కావాల్సిన మట్టి సరఫరా విషయంలో కూడా తనే ఖర్చుపెట్టి తర్వాత డబ్బులు తీసుకున్నట్లు ఇటీవల మండల పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్‌, ఎంపీడీవో ముందే చెప్పడంతో వారు ఒకింత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యదర్శి గ్రామంలో గడ్డి మందు, ట్రాక్టర్‌ డీజిల్‌, దోమల నివారణకు మందు కొనుగోలు విషయంలో కూడా ఇతనిపై ఆరోపణలు ఉన్నాయి. సర్పంచ్‌ కూడా పూర్తి సమాచారం ఇవ్వడని, దీంతో కార్యదర్శి సర్పంచ్‌ మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. కార్యదర్శులు సర్పంచులకు సహకరించకుంటే గ్రామాభివృద్ధి కుంటుపడుతుందని సర్పంచులు అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించాలని కోరుతున్నారు.


ఆ కార్యదర్శిపై చర్యలు ఏమైనట్లు ?

గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల అనుమతి లేకుండా 2018-19 ఏడాదికి సంబంధించి తాగునీటి సరఫరా బిల్లులు రూ. 19 లక్షలు మంజూరు కాగా అందులో రూ .6.50 లక్షలు వార్డు సభ్యుడు, స్పెస్‌మాన్‌ సిగ్నిచర్‌ సభ్యుడు అశోక్‌ కుమార్‌ సంతకం లేకుండానే గత సెప్టెంబరులో నిధులు డ్రా చేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వార్డు సభ్యలు, ఎంపీటీసీ సభ్యుడు అక్టోబరు 17న గ్రామ పంచాయతీ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. దీనిపై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడంపై పలు అనుమానులకు తావిస్తున్నది. తూతూ మంత్రంగా విచారణ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మండల పర్యటనకు వచ్చిన అదనపు కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవార్‌ దృష్టికి తీసుకెళ్లగా విచరణ చేయించి చర్యలు తీసుకుంటామన్నారు.

Updated Date - 2021-11-24T17:09:00+05:30 IST