పంచాయతీ ఎన్నికలు జరిగేనా?

ABN , First Publish Date - 2021-01-25T05:46:44+05:30 IST

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే అధికారుల్లో హడావుడి మొదలవుతుంది. ఎన్నికలకు సంబంధించిన పనులతో బిజీ బీజీగా గడుపుతారు.

పంచాయతీ ఎన్నికలు జరిగేనా?

  1. నేటి నుంచే నామినేషన్ల ప్రక్రియ
  2. యంత్రాంగంలో కనిపించని కదలిక
  3. ఈసీ, ప్రభుత్వ విభేదాలతో ఉద్యోగుల్లో ఆందోళన
  4. సుప్రీం తీర్పు వరకు వేచిచూసే ధోరణిలో అధికారులు


కర్నూలు(ఆంధ్రజ్యోతి): ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే అధికారుల్లో హడావుడి మొదలవుతుంది. ఎన్నికలకు సంబంధించిన పనులతో బిజీ బీజీగా గడుపుతారు. అయితే ప్రస్తుత పంచాయతీ ఎన్నికల పరిస్థితి  అందుకు భిన్నంగా ఉంది. నోటిఫికేషన్‌ విడుదలై, నామినేషన్ల రోజు వచ్చినా అధికారుల్లో ఎలాంటి కదలికా లేదు. రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను విడుదల చేసినా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ కూడా ఇవ్వలేదు. పంచాయతీ ఎన్నికలపై ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య నెలకొన్న విభేదాల వల్ల అధికారులు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. సుప్రీం కోర్టు నేడు ఇచ్చే తీర్పునుబట్టి ముందుకు సాగుదామన్నట్లుగా అధికారులు వేచి చూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వచ్చి, ఎన్నికలు నిర్వహించాలని కోర్టు ఆదేశిస్తే పరిస్థితి ఏమిటన్న చర్చ జరుగుతోంది. ఉద్యోగ సంఘాలు ‘ఎన్నికల బహిష్కరణ’ ప్రకటన చేసినందున ఎన్నికల ప్రక్రియ ముందుకు సాగుతుందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


కనిపించని కోడ్‌

ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కాగానే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వస్తుంది. పంచాయతీ ఎన్నికలు కాబట్టి గ్రామ పంచాయతీల పరిధిలో ప్రభుత్వ ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఉంచకూడదు. విగ్రహాలకు ముసుగు వేయాలి. కొత్త పథకాలు ప్రవేశపెట్టడం, ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజా ప్రతినిధులు పాల్గొనడం నిషిద్ధం. కానీ గ్రామాల్లో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చిన ఆనవాళ్లు కనిపించడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్‌ మీడియాలో చిన్న చిన్న పోస్టులు పెడితే తీవ్ర సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్న అధికారులు, ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాకపోవడంతో అధికారులు ముందడుగు వేసేందుకు సంకోచిస్తున్నారు.


ఎన్నికల ఏర్పాట్లేవీ?

జిల్లాలో మొదటి దశలో 290 పంచా యతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. నామినేషన్ల ప్రక్రియ సోమవారం మొదలవుతుంది. కానీ అందుకు ఏర్పాట్లు కనిపించడం లేదు. ఎన్నికల కోసం స్టేజ్‌-1, స్టేజ్‌-2 అధికారులను నియమించి, వారికి శిక్షణ ఇవ్వాలి. అయితే ఎన్నికల విధులకు అవసరమైన అధికారులను ఇప్పటికే నియమించామని పంచాయతీ అధికారులు చెబుతున్నారు. ఇంతకు ముందే ఆర్వోల, ఏఆర్వోల జాబితా సిద్ధం చేశామని, వారికి ఇంతకు ముందు ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చినపుడే శిక్షణ ఇచ్చామని అధికారులు చెబుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ శనివారం విడుదలైన నేపథ్యంలో స్టేజ్‌-1, స్టేజ్‌-2 అధికారుల జాబితా తాజాగా తయారు చేసి కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కానీ కలెక్టర్‌ అదే రోజు సెలవుపై వెళ్లారు.


ఎటూ తేల్చుకోలేని ఉద్యోగులు

కరవమంటే కప్పకు కోపం, విడవ మంటే పాముకు కోపం అన్నట్లుగా ఉంది జిల్లాలోని ఉద్యోగుల పరిస్థితి. పంచాయతీ ఎన్నికల నోటఫికేషన్‌ విడుదల కావడం, అనంతర పరిణామాలతో ఉద్యోగుల్లో టెన్షన్‌ మొదలయింది. అటు ఎన్నికల కమిషన్‌, ఇటు ప్రభుత్వం మధ్యన నలిగిపోతున్నారు. నోటిఫికేషన్‌ విడుదలయ్యాక అధికారాలు మొత్తం ఎస్‌ఈసీ పరిధిలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి ఎన్నికల ప్రక్రియ మొదలు పెడదామనుకున్నా, ప్రభుత్వం తమ పట్ల ఎలా వ్యవహరిస్తుందో అనే భయం అధికార వర్గాల్లో ఉంది. ఇప్పటికే ప్రభుత్వం తానా అంటే తందానా అంటున్నారంటూ అధికారుల పట్ల కింది స్థాయి ఉద్యోగుల్లో అసహనం పెరుగుతోంది. ప్రజలు కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తున్నారు. పెద్ద చదువులు చదువుకుని, పోటీ పరీక్షలు రాసి ఉన్నతోద్యోగాల్లో ఉన్నవారు ఇంత నిస్తేజంగా ఉండడం గతంలో ఎన్నడూ చూడలేదనే విమర్శలు వినవస్తున్నాయి. చాలామంది ఉద్యోగులు అభద్రతా భావానికి లోనవుతున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఈసీకి అనుకూలంగా వచ్చి, ఉద్యోగ సంఘాలు విధులను బహిష్కరిస్తే, ఎన్నికల సంఘం తీసుకునే చర్యలకు బలికావాల్సి వస్తుందని చాలామంది ఉద్యోగులు అందోళన చెందుతున్నారు. గతంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులు పలువురు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పలువురు గుర్తు చేస్తున్నారు. 


ప్రాణ భద్రత ముఖ్యం..

ఎన్నికల కమిషన్‌ ఇష్టం వచ్చినట్లు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేస్తే విధులు నిర్వహించడానికి మేము సిద్ధంగా లేము. ఎన్నికల విధులు నిర్వహించకుంటే మాపై చర్యలు తీసుకుంటామంటే దానికి కూడా మేము సిద్ధమే. ఉద్యోగ భద్రత కంటే మాకు ప్రాణాలే ఎక్కువ. మేము ఈసీకి వ్యతిరేకం ఏమీ కాదు. ప్రస్తుతం కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ఉన్నందున రెండు నెలలు వాయిదా వేయమని అడుగుతున్నాం. మరి కొన్ని రోజుల పాటు ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు.  - రఘు బాబు, జిల్లా చైర్మన్‌, ఏపీజీఈఎఫ్‌, కర్నూలు.


ఈసీకి సహకరించాలి..

ఎన్నికల కమిషన్‌ రాజ్యాంగబద్ధ సంస్థ. ఒక రాజ్యాంగ వ్యవస్థ విధుల్లో మరొక రాజ్యాంగ వ్యవస్థ అయిన సుప్రీం కోర్టు కలగజేసుకోదు. పంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పే అందుకు నిదర్శనం. హై కోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీం కోర్టు కూడా ఇస్తుందని ఆశిస్తున్నాం. కోర్టు తీర్పు ఎన్నికల కమిషన్‌కు అనుకూలంగా వస్తే సహకరించబోమని చెప్పడం ఉద్యోగ సంఘాలకు తగదు. ఐదేళ్ళకొకసారి మారే ప్రభుత్వం మాటలు విని రాజ్యాంగ వ్యవస్థల విధులకు అడ్డు పడకూడదు. - బీటీ నాయుడు, ఎమ్మెల్సీ

Updated Date - 2021-01-25T05:46:44+05:30 IST