పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం

ABN , First Publish Date - 2021-02-23T05:08:07+05:30 IST

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు.

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నివాస్‌, ఎస్పీ అమిత్‌బర్దర్‌

దాడులకు పాల్పడిన వారిపై కరిన చర్యలు తప్పవు

కలెక్టర్‌ జె.నివాస్‌

(కలెక్టరేట్‌, ఫిబ్రవరి 22)

జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని కలెక్టర్‌ జె.నివాస్‌ తెలిపారు. సోమవారం కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఎస్పీ అమిత్‌బర్దర్‌తో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘జిల్లాలో నాలుగు దశల్లో 1024 పంచాయతీల సర్పంచ్‌లకు, 6,708 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహించాం. జిల్లాలో మొత్తంగా 78.02 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండు, మూడు చోట్ల మినహా మిగిలిన పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగింది. ఎన్నికల్లో నిబంధనలు ఉల్లంఘిస్తూ దాడులు, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయి. బ్యాలెట్‌ బాక్సుల అపహరణ, దహనం చేసిన వ్యక్తులకు కనీసం ఐదేళ్లు జైలు శిక్ష పడుతుంది. అభ్యర్థులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడితే.. ఆరేళ్ల వరకూ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం విధిస్తాం. కొన్ని పంచాయతీల్లో ఓట్ల లెక్కింపు సమయంలో అవగాహన లేని వ్యక్తులు దుష్ప్రచారం చేశారు. అటువంటి వారిపై చర్యలు తీసుకుంటాం. మునిసిపల్‌ ఎన్నికల్లోనూ ఇదే తరహాలో పటిష్ట చర్యలు చేపడతా’మని పేర్కొన్నారు. ఎస్పీ అమిత్‌బర్దర్‌ మాట్లాడుతూ.. అధికారుల సమన్వయం సమష్టి కృషితో ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించామని తెలిపారు. రాజ్యాంగ బద్ధంగా ప్రతి అంశాన్ని అమలు చేశామన్నారు. గత(2013-14) ఎన్నికల్లో జిల్లాలో 221 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, ఈ ఏడాది కేవలం 140కే పరిమితమయ్యాయని తెలిపారు. బలవంతంగా ఎన్నికల ప్రక్రియ ఉపసంహరణపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదన్నారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. 


ప్రవర్తనా నియమావళి అమలు


మునిసిపల్‌ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కలెక్టర్‌ నివాస్‌ కోరారు. ‘మునిసిపల్‌ ఎన్నికలకు సంబంధించి ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంది. మునిసిపల్‌ షెడ్యూల్‌పై అధికారులు రాజకీయ నేతలతో సమావేశమై వివరాలు వెల్లడిస్తారు. ఈ ఎన్నికలకు సంబంధించి గతంలో నామినేషన్‌ వేసిన వ్యక్తులు మరణించి ఉంటే... వారిస్థానంలో మరొకరు నామినేషన్‌ వేసేందుకు ఈసీ అవకాశం కల్పించింది. 4న సర్వీస్‌ ఓటర్ల బ్యాలెట్‌ పంపిస్తాం. మార్చి 14వ తేదీలోగా సర్వీసు ఓటర్లు తమ బ్యాలెట్‌ ఓటు పత్రాన్ని పంపించాలి’ అని కలెక్టర్‌ సూచించారు. 

Updated Date - 2021-02-23T05:08:07+05:30 IST