పనస రుచులు వేరయా!

ABN , First Publish Date - 2021-07-25T20:49:03+05:30 IST

ఆ చెట్టు అందం దేనికీ రాదు. ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది..

పనస రుచులు వేరయా!

ఆ చెట్టు అందం దేనికీ రాదు. ఆకాశాన్ని తాకుతున్నట్లుంటుంది. చెట్టు మొదలుకు గుత్తులుగా వేలాడుతున్న పెద్ద పెద్ద కాయలతో చూపు తిప్పుకోనీయదు పనస. కాయలోపలున్న పసుపుపచ్చ తొనల రుచికి మరేదీ సాటిరాదు. కట్‌హల్‌, ఫనస్‌, జాకా, నంగ్కా, చక్కా, కనూన్‌.. ఇలా పనసను ఏ పేరుతో పిలిచినా మాధుర్యమే! ఇన్నాళ్లూ మనకు తెలిసింది పనస బిర్యానీ మాత్రమే కదూ... ఇప్పుడు స్టార్‌బక్స్‌లో జాక్‌ఫ్రూట్‌ రాప్స్‌, పిజ్జాహట్‌లో పనస టాపింగ్స్‌ దొరుకుతున్నాయి. పనస వంటలు మాంసాహారాన్ని తలపిస్తున్నందున ‘వేగాన్‌ సెన్సేషన్‌’ అంటూ కీర్తిస్తున్నాయి విదేశీ పత్రికలు.... 


పనసను డబుల్‌ బొనాంజాగా పేర్కొంటారు. కాయగానే కాదు పండుగానూ ఉపయోగపడుతుంది కాబట్టి.. పొట్టు నుంచి విత్తనాల వరకు అన్నీ పనికొచ్చే అరుదైన ఫలం. ప్రపంచంలో అతి పెద్ద పండు. ఒక్కోటీ మూడు నుంచి ఐదు కిలోల బరువు ఉంటుంది. గత అయిదు వేల ఏళ్లుగా భారత ద్వీపఖండంలో పనసను పండిస్తున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. అయితే శ్రీలంక, వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్‌ వంటి దేశాలు పనసను ఎక్కువగా వినియోగిస్తున్నాయి. విరివిగా వాడని కారణంగా మన దేశంలో ఏటా రెండు వేల కోట్ల రూపాయల విలువైన పనస వృథా అవుతోందన్నది ఒక అంచనా. పోషక విలువల ఆధారంగా చూస్తే సంపూర్ణమైనది పనస. భవిష్యత్తులో వాతావరణ మార్పుల వల్ల గడ్డుకాలం వస్తే వరి, గోధుమ, మొక్కజొన్న తదితర ధాన్యాలకు ప్రత్యామ్నాయంగా పనసను అందుబాటులోకి తేవచ్చని భావిస్తున్నారు పరిశోధకులు. 


పండ్ల రసంగా...

ఉత్తర భారతంతో పోలిస్తే దక్షిణాన పనసను ఎక్కువగా పండిస్తున్నారు. అందుకే ఇక్కడ వినియోగమూ ఎక్కువే. ఒక్క కేరళలోనే వంద రకాల పనస చెట్లు పెరుగుతున్నాయి. పనసతో కూరలు, వేపుళ్లు, చిప్స్‌, అప్పడాలు, స్వీట్లు మామూలే. అయితే బెంగుళూరుకు చెందిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ రీసర్చ్‌ ఇటీవల జాక్‌ఫ్రూట్‌ జ్యూస్‌, చాక్లెట్లు, బిస్కెట్లను తయారుచేసింది. మూడేళ్ల పరిశోధనల తరవాత పనస గుజ్జుతో జ్యూస్‌ను ఉత్పత్తి చేస్తోందీ సంస్థ. ఇందులో చక్కెర, నిల్వ పదార్థాలు వాడలేదు. అయినా కూడా ఆరు నెలల వరకూ చెడిపోకుండా ఉంటుందని, శీతల పానీయాలకు బదులుగా ఈ జ్యూస్‌ తాగడం ఆరోగ్యానికి మేలని సంస్థ ప్రకటించడం విశేషం. గోధుమ పిండి, పనస గింజల పిండి, కొకోవాతో చాకొలెట్‌లు, బిస్కెట్లను కూడా తయారుచేస్తున్నారు.


బిర్యానీకి డిమాండ్‌

కరోనా కారణంగా మన జీవన విధానం పూర్తిగా మారింది. ఈ గడ్డు కాలంలో పనసకు డిమాండ్‌ అమాంతం పెరిగింది. ఇన్‌ఫెక్షన్ల కారణంగా మాంసాన్ని తినడానికి చాలా మంది భయపడతారు. వాళ్లందరికీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది పనస. దీంతో చికెన్‌, మటన్‌ కన్నా కూడా పనస బిర్యానీ అధిక ధరకు అమ్ముడవుతోంది. బెంగాల్‌లో పనసను ‘గాచ్‌ పతా’ గా పిలుస్తారు. అంటే గొర్రె చెట్టు అని అర్థం. కాయపనస ముక్కలు, తొనలు మటన్‌లా ఉండడం వల్ల ఆ పేరు స్థిరపడిందేమో. అందుకే ప్రత్యేక రోజుల్లో పనన వంటల్ని వండుతుంటారు. ఉల్లిగడ్డ, అల్లం వెల్లుల్లి కలిపి వండిన పనస కూర అందించే రుచిని వర్ణించలేం అంటారు బెంగాలీలు. ఇక బిహార్‌లో ‘కాలా మటన్‌ కర్రీ’ తరహాలో పనసకు సుగంధ ద్రవ్యాల్ని కలిపి తక్కువ మంటమీద ఉడికించి చేస్తారు. బిహార్‌లో జాక్‌ఫ్రూట్‌ కట్లెట్స్‌ చాలా ఫేమస్‌. ఇక ఆంధ్రా స్టెయిల్‌ పనస పొట్టు ఆవ కూర ప్రపంచమంతా ప్రాచుర్యం పొందింది. దాంతో పాటు పనస కూర, గింజల వేపుడు, పనస పొట్టు బిర్యానీ, పనస కాయ బిర్యానీ కూడా ఇక్కడి ప్రత్యేక రుచులుగా చెప్పాలి. గోవాలో కొన్ని వంటకాల్లో చేపకు బదులుగా పనసను వాడడం విశేషం.


వరి, గోధుమల కంటే మేలు..

పనస ఎక్కువగా పండే కేరళ, గోవా, కర్నాటక, ఆంధ్ర లాంటి రాష్ట్రాల్లో కొంతమంది ఔత్సాహికులు సంప్రదాయ వంటలకు మారుగా పనసతో అనేక ప్రయోగాలు చేస్తున్నారు., జాక్‌ఫ్రూట్‌ బర్గర్లు, గలౌటీ కబాబ్స్‌, మసాలా దోశ, బిర్యానీలను వండేస్తున్నారు. ఈ కోవలోకే వచ్చేది జాక్‌ఫ్రూట్‌ 365. పనసకాయతో చేసిన పిండి ఇది. పనస గ్ల్లైసెమిక్‌ ఇండెక్స్‌ వరి, గోధుమల కన్నా నలభై శాతం తక్కువ. కాబట్టి మధుమేహుల ఆరోగ్యానికి మంచిది. పనస పిండిని వంటల్లో వాడడం వల్ల రక్తపోటు, షుగరు నియంత్రణలో ఉంటాయి. మార్కెట్లో ఈ మధ్యే వచ్చాయి జాకోబైట్‌. పనస తొనల్ని ఫ్రీజర్‌లో పెట్టి గడ్డకట్టేలా చేస్తారు. ఇవి మూడు నెలల వరకు చెడిపోవు. ఇలా పనసను కూడా మామిడి, ద్రాక్షలాగ విరివిగా ఉపయోగించడం ఇప్పుడిప్పుడే మొదలవుతోంది. అంటే, మన నేలల్లో విరివిగా పండే పనసకు మంచి రోజులు వచ్చినట్లే!. 


సూపర్‌ హెల్తీ

ఇమ్యూనిటీ: పనసలో విటమిన్‌ - సి, యాంటీ ఆక్సిడెంట్లు అధికం. దీనివల్ల శరీరానికి ఇన్‌ఫెక్షన్లపై పోరాడే రోగనిరోధక శక్తి వస్తుంది. 

తక్షణ శక్తి : వంద గ్రాములు పనస 94 కెలోరీల శక్తిని ఇస్తుంది. 

రక్తపోటు నియంత్రణ: పొటాషియం మెండుగా ఉన్నందున గుండె ఆరోగ్యానికి రక్షణ కలిగిస్తుంది. రక్త ప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది.

జీర్ణక్రియకు తోడ్పాటు: పనసలో రెండు రకాల పీచుపదార్థాలు.. సాల్యుబుల్‌, ఇన్‌సాల్యుబుల్‌ ఉండడం విశేషం. దీనివల్ల జీర్ణవ్యవస్థ సజావుగా సాగుతుంది.

క్యాన్సర్‌ నిరోధకం: ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియంట్స్‌, ఫ్లేవనాయిడ్స్‌ అధికం. ఈ యాంటీ ఆక్సిడెంట్లు టాక్సిన్లను, ఫ్రీరాడికల్స్‌ను తొలగించి క్యాన్సర్‌ బారిన పడకుండా నివారిస్తాయి.

కంటిచూపు మెరుగు: విటమిన్‌ - ఎ (బీటా కెరోటిన్‌) అధికంగా ఉండడం వల్ల కళ్ల ఆరోగ్యానికి ఉపకరిస్తుంది. బాక్టీరియా, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. కాటరాక్ట్‌ బారినపడకుండా, రెటీనా పొర క్షీణించకుండా సహాయపడుతుంది.

ఎముకల పటుత్వం: అత్యధిక స్థాయిల్లో కాల్షియం ఉండడం వల్ల ఎముకలు పెళుసుబారకుండా చూస్తుంది. ఇందులోని  పొటాషియం వల్ల కిడ్నీల ద్వారా కాల్షియం పోకుండా నిరోధిస్తుంది.

ఆరోగ్య రక్తం : తగిన మొత్తంలో ఐరన్‌ ఉండడం వల్ల ఎనీమియాను నివారించవచ్చు. ఐరన్‌ జీవక్రియకు సహాయపడుతుంది. విటమిన్‌- సి, మెగ్నీషియం, కాపర్‌ ఉండడం వల్ల రక్త నాణ్యత మెరుగుపడుతుంది.

ఆస్తమా నియంత్రణ: కాలుష్యం వల్ల శరీరంలో చెరే ఫ్రీ రాడికల్స్‌ని నిరోధించి ఉపశమనం కలిగిస్తుంది.

థైరాయిడ్‌ పనితీరుకు: కాపర్‌ ఎక్కువగా ఉండడం వల్ల థైరాయిడ్‌ ఆరోగ్యానికి రక్షణనిస్తుంది.


వంద గ్రాముల్లో... 

కెలోరీలు- 94

కొవ్వు-0.3 గ్రాములు

పీచు పదార్థాలు- 2 గ్రాములు 

ప్రొటీన్లు- గ్రాము 

పొటాషియం- 303 మిల్లీ గ్రాములు

కాల్షియం-34 మిల్లీ గ్రాములు

కార్బోహైడ్రేట్స్‌- 24 గ్రాములు

ఫొలేట్‌- 14 మైక్రో గ్రాములు

ఐరన్‌- 0.6 మిల్లీగ్రాములు

Updated Date - 2021-07-25T20:49:03+05:30 IST