నిధులేవి ?

ABN , First Publish Date - 2021-03-08T05:33:17+05:30 IST

పల్స్‌పోలియో కార్యక్రమం జరిగి నెల కావస్తున్నా అందులో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన గౌరవ ప్రోత్సాహకాలు నేటికి చెల్లించని స్ధితి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉంది.

నిధులేవి ?
పోలియో చుక్కలు వేస్తున్న సిబ్బంది (ఫైల్‌)

పల్స్‌పోలియోకు విడుదల చేయని ప్రభుత్వం

రూ. 45 లక్షలు ఎప్పుడు ఇస్తారో..?

పాల్గొన్న వారికి చెల్లింపుల్లో జాప్యం 


నెల్లూరు (వైద్యం)మార్చి 7 : పల్స్‌పోలియో కార్యక్రమం జరిగి నెల కావస్తున్నా అందులో పాల్గొన్న వైద్య సిబ్బంది, ఇతర ఉద్యోగులకు చెల్లించాల్సిన గౌరవ ప్రోత్సాహకాలు నేటికి చెల్లించని స్ధితి జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఉంది. జనవరి 31వ తేదీ నుంచి ఫిబ్రవరి 2వ తేదీ వరకు పల్స్‌పోలియో కార్యక్రమం జరిగింది. ఇందులో 13,775 మంది పారామెడికల్‌, ఆశా, అంగన్‌వాడీ, నర్సింగ్‌ సిబ్బంది పాల్గొని, 3,38,938 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పాల్గొన్న వీరికి రోజుకు రూ. 250 చెల్లించాలి. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు సంబందించి నిధులు విడుదల చేయలేదు. పల్స్‌ పోలియోకు కేంద్ర ప్రభుత్వం రూ. 45 లక్షలు జిల్లాకు మంజూరు చేసినా ఈ నిధులు రాష్ట్రం జిల్లాకు విడుదల చేయలేదు. దీంతో చెల్లించాల్సిన రోజువారి బకాయిలు నేటికీ జమకాలేదు. ఈ నిధులను రాష్ట్రం సొంతానికి వాడుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే బకాయిలు చెల్లింపులు ఎప్పుడు చేస్తారో తెలియక వైద్యాధికారులు తలలు పట్టుకుంటున్నారు. ప్రతి ఏటా రెండు దఫాలు పల్స్‌పోలియో కార్యక్రమాలు జరుగుతుండగా ముందుగానే ఏర్పాట్లు, సిబ్బంది గౌరవ చెల్లింపులకునిధులు జిల్లాకు వచ్చేవి. అయితే ఈ సారి మాత్రం కేంద్రం విడుదల చేసినా రాష్ట్రం నిధులు విడుదల చేయక పోవటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. 


ఇంకా నిధులు రాలేదు.. : డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచ్‌వో

పల్స్‌పోలియో నిర్వహణకు సంబంధించి నిధులు ఇంకా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ప్రభుత్వం నిధులు విడుదల చేస్తే పల్స్‌పోలియోలో పాల్గొన్న వారికి గౌరవ ప్రోత్సాహకాలు అందచేస్తాం. 


 

Updated Date - 2021-03-08T05:33:17+05:30 IST