ఇంటి తలుపులు పగలగొట్టి TDP నేతను అరెస్ట్ చేసిన CID

ABN , First Publish Date - 2022-06-30T18:01:29+05:30 IST

టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్న గార్లపాటి వెంకటేష్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇంటి తలుపులు పగలగొట్టి TDP నేతను అరెస్ట్ చేసిన CID

పల్నాడు (Palnadu) జిల్లా: ధరణికోటలో టీడీపీ (TDP) సోషల్ మీడియా కార్యకర్తగా పనిచేస్తున్న గార్లపాటి వెంకటేష్‌ (Venkatesh)ను సీఐడీ (CID) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతరాత్రి గోడదూకి సీఐడీ పోలీసులు లోపలికి ప్రవేశించారు. ఇంటి గడియ పగులగొట్టి లోపలకు వచ్చారని వెంకటేష్ తల్లిదండ్రులు తెలిపారు. మొత్తం దృశ్యాలను వీడియో తీస్తుండడంతో పోలీసులు లైట్లు పగులగొట్టారు. యూటూబ్ చానల్‌ను నడుపుతున్న వెంకటేష్.. సీఎం జగన్ (CM Jagan), వైసీపీ (YCP) ప్రభుత్వంపై విమర్శలు చేశారంటూ సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసి, కంప్యూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.


అదుపులోకి తీసుకున్న వెంకటేష్‌ను పోలీసులు గుంటూరు రీజనల్ సీఐడీ కార్యాలయానికి తరలించారు. పోలీసులు ఇంట్లోకి వచ్చిన సమయంలో వెంకటేష్ తల్లిదండ్రులు మీరు ఎవరని ప్రశ్నించినా సమాధానం చెప్పకుండా.. వారిని కూడా బెదిరించారు. తాము పోలీసులమని చెప్పినా నమ్మలేని పరిస్థితిలో కుటుంబసభ్యులు ఉన్నారు. పోలీసులు అయితే గోడదూకి, తలుపులు పగులగొట్టి రావాల్సిన అవసరం ఏముందని కుటుంబసభ్యులు, చుట్టుపక్కలవాళ్లు ప్రశ్నిస్తున్నారు.


అలాగే టీడీపీ కేంద్ర కార్యాలయంలో పని చేసే మోకారాల సాంబశివరావు అనే వ్యక్తిని  సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు సీఐడీ కార్యాలయంలో విచారిస్తున్నారు. సాంబశివరావుకు సంబంధించిన కంప్యూటర్, హార్డ్ డిస్క్‌లను తీసుకువెళ్లారు. సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడనే కారణంతో సాంబశివరావుని సీఐడీ పోలీసులు తీసుకువెళ్లారు.

Updated Date - 2022-06-30T18:01:29+05:30 IST