సా..గుతోంది

ABN , First Publish Date - 2022-08-05T05:15:30+05:30 IST

ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుంది. ఈపాటికి ముమ్మరంగా సాగు పనులు మొదలవ్వాలి.

సా..గుతోంది
పత్తి చేను

ఇప్పటికి 37 శాతమే సాగు 

ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు

నామమాత్రంగా కూడా లేని వ్యవసాయం

7.12 లక్షలకు 2.49 లక్షల ఎకరాల్లోనే సాగు


జిల్లాలో సాగు వివరాలు..

పంట ఎకరాలు

వరి 225  

మిరప 4,988

అపరాలు 2,400 

పత్తి 2,41,538 


నరసరావుపేట, ఆగస్టు 4: ఖరీఫ్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తుంది. ఈపాటికి ముమ్మరంగా సాగు పనులు మొదలవ్వాలి. రైతులు పంటల సాగు పనుల్లో బిజీబిజీగా ఉండాలి. కూలీలు వ్యవసాయ పనుల్లో నిమగ్నమై ఉండాలి. ముందస్తుగా రుతుపవనాలు వస్తాయి.. ఆశాజనకంగా వర్షాలు పడతాయన్న వాతావరణశాఖ ముందస్తు హెచ్చరికల చేసింది. దీంతో రైతులు మే నెల నుంచే సాగు పనులకు సిద్ధమయ్యారు. అయితే ముందస్తు రుతుపవనాలు నీరుగార్చాయి. ఇక సాగర్‌ నుంచి నీటి విడుదలను కూడా పాలకులు వాయిదాలతో కాలం వెళ్లదీశారు. ఈ క్రమంలో జిల్లాలో పంటల సాగు నామమాత్రంగా కూడా లేదు. సీజన్‌ ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన రీతిలో పంటలు సాగు కాలేదు. ఇప్పటికి జిల్లాలో సాధారణ విస్తీరణంలో 37 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయి. అధికంగా పత్తి పంటను రైతులు సాగు చేశారు. వరి, మిరప, అపరాల సాగు నామమాత్రంగా కూడా లేదు. సాగర్‌ కుడి కాలువకు నాలుగు రోజుల క్రితం నీటిని విడుదల చేశారడీ నేపథ్యంలో కుడి కాల్వ ఆయకట్టు పరిధిలో వరి సాగు ప్రారంభం కానున్నది. రైతులు వరి సాగుకు పొలాలలను సిద్ధం చేస్తున్నారు. ఖరీఫ్‌లో 7.12 లక్షల ఎకరాల్లో పంటల సాగు లక్ష్యంగా వ్యవసాయ శాఖ   నిర్ణయించింది. జిల్లా సాధారణ సాగు విస్తీర్ణం 6.51 లక్షల ఎకరాలు. అయితే ఇప్పటి వరకు సాఽధారణ విస్తీర్ణంలో 37 శాతం మాత్రమే అంటే  2,49,415 ఎకరాల్లో మాత్రమే పంటల సాగు చేశారు. ఇందులో కూడా పత్తి పంట అధికంగా సాగైంది. జిల్లాలో 3,25,068 ఎకరాల్లో పత్తి సాగు కావాల్సి ఉండగా 2,41,538 ఎకరాల్లో మాత్రమే సాగైంది.   వర్షాభావం వల్లే పంటల సాగులో జాప్యం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు పూర్తి స్థాయిలో పంటలు సాగు చేస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇటీవల కుడి కాల్వకు నీరు విడుదల చేయడంతో వరి సాగు ఊపందుకునే పరిస్థితులు ఉన్నాయి. రైతులు వరి సాగుకు నారుమళ్లను సిద్ధం చేస్తున్నారు. వరి విత్తన సేకరణలో రైతులు నిమగ్నమయ్యారు. ఆర్‌బీకేల ద్వారా వరి విత్తనం కిలో రూ.5 రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. బీపీటీ 5204, ఎన్‌ఎన్‌ఆర్‌ 34449 విత్తనాలను రాయితీపై పంపిణీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రైతులు జేజీఎన్‌ 384 రకం వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ రకం వరి విత్తనానికి ప్రభుత్వం సబ్సిడీ ఇవ్వడం లేదు. దాదాపు 40 వేల కింటాళ్ల వరి విత్తనం జిల్లాకు అవసరం ఉంది. ఆర్‌బీకేల ద్వారా 9 వేల కింటాళ్ల వరి విత్తనాన్ని పంపిణీ చేయనున్నట్లు అధికారులు చెప్పారు.  


Updated Date - 2022-08-05T05:15:30+05:30 IST