ఎప్పుడిస్తారో?

ABN , First Publish Date - 2022-06-30T05:19:11+05:30 IST

‘వాణిజ్య పంటలపై దృష్టి సారించండి.. అన్ని సహాయ సహకారాలు అందిస్తాం’ అని చెబుతున్న అధికారులు ప్రకటనలకే పరిమితమవుతు న్నారు. క్షేత్రస్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తూ.. రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పామాయిల్‌ సాగుచేసే రైతులకు పూర్తిస్థాయిలో మొక్కలు అందడం లేదు.

ఎప్పుడిస్తారో?
తోటపల్లి సమీపంలోని ఉల్లిభద్రలోని నర్సరీ

  పూర్తిస్థాయిలో అందని పామాయిల్‌ మొక్కలు

  స్థానిక రైతులకు మొండిచెయి

  తప్పని నిరీక్షణ

  పట్టించుకోని అధికారులు

 (పార్వతీపురం - ఆంధ్రజ్యోతి)

‘వాణిజ్య పంటలపై దృష్టి సారించండి.. అన్ని సహాయ సహకారాలు అందిస్తాం’ అని చెబుతున్న అధికారులు ప్రకటనలకే పరిమితమవుతు న్నారు. క్షేత్రస్థాయిలో భిన్నంగా వ్యవహరిస్తూ.. రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో పామాయిల్‌ సాగుచేసే రైతులకు పూర్తిస్థాయిలో మొక్కలు అందడం లేదు. ఉద్యానశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న నర్సరీల ద్వారా వారికి సరఫరా కావడం లేదు. అధిక ధరలకు కొనుగోలు చేద్దామన్నా.. ఎక్కడా లభించని పరిస్థితి. దీంతో వారు తలలు పట్టుకుంటున్నారు. అసలు జిల్లాలో సుమారు 6వేల హెక్టార్లలో పామాయిల్‌ పంట సాగువుతోంది. అయితే దీనికి సంబంధించి ఏటా రైతులకు  జూన్‌  నుంచి ఆగస్టు లోపు మొక్కలను సరఫరా చేయాల్సి ఉంది. స్థానికంగా మొక్కలు లేకపోవడంతో ఏం చేయాలో వారికి తోచడం లేదు. పామాయిల్‌ మొక్కలు ఇప్పించాలని కలెక్టరేట్‌ స్పందన కార్యక్రమంలో పెద్దఎత్తున వినతిపత్రాలు కూడా ఇస్తున్నారు. అయినా అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో పెదవి విరుస్తున్నారు. 

ఇదీ పరిస్థితి.. 

ఉద్యానశాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని గరుగుబిల్లి మండలం తోటపల్లిలోని ఉల్లిభద్ర సమీపంలో నడుస్తున్న నర్సరీలో పామాయిల్‌ మొక్కలను పెంచుతున్నారు. వాటిని  రైతులకు సరఫరా చేయాల్సి ఉన్నా.. రెండేళ్లుగా అలా జరగడం లేదు. జిల్లా కేంద్రానికి సమీపంలోని ఒక పామాయిల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం సిఫారసుల మేరకు అత్యధికంగా మొక్కలు సరఫరా జరుగుతున్నాయనే ఆరోపణలు న్నాయి. అసలు ఉద్యాన శాఖ అధికారులు, ప్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.133  మొక్కలను సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఒడిశా రైతులతో పాటు స్థానికులకు ఒక్కో మొక్కను రూ.300 విక్రయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసే మొక్కల్లో ఒడిశాకు  లక్ష , స్థానిక జిల్లా రైతులకు లక్ష మొక్కలు ఇవ్వాలనే నిబంధన ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం లక్ష మొక్కలను మాత్రమే సరఫరా చేసిందని చెబుతున్న ఉద్యాన శాఖ అధికారులు..  స్థానిక రైతులకు మొండి చేయి చూపుతున్నారు.  

పలుకుబడి ఉంటేనే.. 

రైతులకు పామాయిల్‌ మొక్కలు కావాలంటే పలుకుబడి ఉంటేనే సరఫరా జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఓ వైపు ఫ్యాక్టరీ యాజమాన్యం రైతులకు రూ.133 విక్రయిం చాల్సిన మొక్కను రూ.300కు విక్రయిస్తున్న పరిస్థితి.  మరో వైపు పలుకుబడి కలిగిన రైతులు, నాయకుల బంధువులకు అధికంగా మొక్కలు  సరఫరా చేస్తుండడంతో సామాన్య రైతులకు  అందని పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా గత రెండేళ్లుగా నర్సరీకి ఎన్ని మొక్కలు వచ్చాయి.. ఎవరెవరికి సరఫరా చేశారన్న విషయాన్ని అధికారులు చెప్పడం లేదు.  దీనిపై జిల్లా అధికార యంత్రాంగం స్పందించి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా రైతులు కోరుతున్నారు. 

   ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటాం

పామాయిల్‌ మొక్కలను ఫ్యాక్టరీ యజమాన్యం అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు వస్తే  చర్యలు తీసుకుంటాం. కొంతమంది రైతులు అధిక ధరలకు మొక్కలు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం ఉన్నప్పటికీ  ఫిర్యాదులు రాలేదు. కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో  మొక్కలు సరఫరా చేయకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  డిమాండ్‌ మేరకు మొక్కలు ఉంటే ప్రతిఒక్క రైతుకు సరఫరా చేస్తాం. 

-  సత్యనారాయణ రెడ్డి, జిల్లా ఉద్యాన శాఖాధికారి

   

Updated Date - 2022-06-30T05:19:11+05:30 IST