Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

పామాయిల్‌ ఢమాల్‌

twitter-iconwatsapp-iconfb-icon
పామాయిల్‌ ఢమాల్‌

రెండు నెలల్లోనే అమాంతం  పడిపోయిన ధర 

పెరిగిపోయిన కౌలు, పెట్టుబడులు 

సంక్షోభం వైపు  రైతులు


పామాయిల్‌ రైతుల ఆనందం ఆవిరైంది.. నిన్న మొన్నటి వరకు మంచి రేటు వచ్చిందనే ఆనందంలో ఉన్న రైతులంతా ఒక్కసారిగా నీరుగారారు. ఆల్‌టైమ్‌ రికార్డులో నిలిచిన పామాయిల్‌ ధరలు ఒక్కసారిగా పడిపోవడంతో కుదేలయ్యారు. దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

జంగారెడ్డిగూడెం, ఆగస్టు 14 : ఇటీవల పామాయిల్‌ గెలల ధరను పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆయిల్‌పామ్‌ రైతులు ఆనందం వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనంతగా, రైతులెవ్వరూ ఊహించని రీతిలో పామాయిల్‌ గెలలకు నెలనెలా ధర పెరుగుతూ వస్తుండడంతో రైతులు ఎంతో ఆనందపడ్డారు. నవంబరు నుంచి పామాయిల్‌ గెలల ధరలో పెరుగుదల ప్రారంభమైంది. జనవరి నెలలో పామాయిల్‌ గెలలు టన్ను ధర రూ.17 వేలు మార్కును చేరు కోవడంతో రైతులు ఆనందించారు. ఆ తరువాత ఫిబ్రవరి నుంచి గణనీయంగా పెరుగుతూ మే నెలలో ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేస్తూ ఏకంగా రూ.23,365లకు చేరుకుంది. ఇది ఆయిల్‌పామ్‌ చరిత్రలో అత్యధికం. నెల రోజుల వ్యవధిలోనే ధరలు తగ్గి ప్రస్తుతం అది కాస్తా ఇప్పుడు రూ.16,911లకు చేరుకుంది.


ఒక్కసారిగా ధరలు పతనం 

మే నెలలో పామాయిల్‌ ధరలు టన్ను రూ.23,365 ఉంటే జూలై నెలలో రూ.16,912లకు పడిపోయింది. అంటే రెండు నెలల వ్యవధి లోనే ఒక టన్నుకు రూ.6,453 రైతులు కోల్పోయారు. అత్యధిక ధర పలకడంతో రైతులు పెట్టుబడులను అమాంతం పెంచేశారు. ఒకప్పుడు టన్ను లోడింగ్‌ చార్జీకి ఇప్పటి లోడింగ్‌ చార్జీలకు డబుల్‌ అయ్యాయి. ఒక్కో మనిషికి గెలలను నరికేందుకు రూ.1000 పై మాటే. ఇక కౌలు విషయానికొస్తే  ఎకరం రూ.40 వేల నుంచి ప్రస్తుతం గరిష్టంగా రూ.1.15 లక్షల వరకు వెళ్లింది. గత రెండు నెలల క్రితం అయితే అసలు పామాయిల్‌ తోటల కోసం ఎంతో మంది రైతులు కాళ్లరిగేలా తిరిగినా కౌలుకు దొరకలేదంటే ఎంత డిమాండ్‌ పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం పరిస్థితులు తల్లకిందులయ్యాయి. ఇప్పుడు కౌలు రైతులంతా దిగాలు చెందుతున్నారు. పెరిగిన కౌలు ధరలతో పాటు కూలి, ట్రాన్స్‌పోర్ట్‌, ఇతరత్రా ఖర్చులు చూసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పులు పోగేసుకోక తప్పదని ఆవేదన చెందుతున్నారు. దీనికి తగ్గట్టు ప్రతీ నెల ధరల్లో వ్యత్యాసం, పక్క రాష్ట్రాలకు ఇక్కడకు తేడా ఉండం రైతులను మరింత క్షోభకు గురిచేస్తోంది. మిగిలిన పంటల సాగుకు పామాయిల్‌ సాగుకు ఎంతో వ్యత్యాసం ఉంది. ఇతర పంటలైతే లాభదాయకంగా లేకపోతే ప్రత్యామ్నాయ పంట సాగుకు వెళ్లే అవకాశం ఉంటుంది. దీనికి ఆ అవకాశం కూడా లేదు. మొక్క నాటి నుంచి 30 ఏళ్ల పాటు పామాయిల్‌ పంట పండించాల్సిందే.


76,860 హెక్టార్లలో సాగు

ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 76,860 హెక్టార్లలో ఆయిల్‌ఫామ్‌ సాగు చేస్తున్నారు. ఎకరానికి 9, 10 టన్నుల దిగుబడి సాధిస్తే ప్రతీ ఏడాది 5 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. ఏలూరు జిల్లాలోని కామవరపుకోట, టి.నరసాపురం, ద్వారకాతిరుమల, నల్లజర్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం, చింతలపూడి తదితర మండలాల్లో ఎక్కువగా పామాయిల్‌ సాగు ఉంది. కాగా ద్వారకా తిరుమల మండలం సీహెచ్‌పోతేపల్లి వద్ద గోద్రేజ్‌ ప్రాసెస్‌ యూనిట్‌, పెదవేగిలో ఆయిల్‌ ఫెడ్‌ ఫ్యాక్టరీ, యర్నగూడెంలో ఎఫ్‌ఎఫ్‌ఎఫ్‌ కంపెనీ, చింతలపూడిలో రెండు ప్రాసెస్‌ యూనిట్‌లు జంగా రెడ్డిగూడెంలో నవభారత్‌, కృష్ణా జిల్లాలో రుచి ఫ్యాక్టరీ తదితర కంపెనీలు రైతుల నుంచి పామాయిల్‌ గెలలు కొనుగోలు చేస్తున్నారు.


ఆదుకోకపోతే అప్పులపాలే

– కాటేపల్లి సత్యన్నారాయణ,  పామాయిల్‌ రైతు, అప్పలరాజుగూడెం

 రైతులు గడ్డుకాలాన్ని ఎదుర్కొంటున్నారు. రెండు నెలల క్రితం పెరిగిన ధరల ఫలితంగా కౌలు అమాంతం డబుల్‌ అయ్యింది. కూలి ఖర్చులు, పెట్టుబడులు పెరిగిపోయాయి. ఇప్పుడు పామాయిల్‌ ధరలు తగ్గిపోయాయి. దీనికి తోడు పక్కనే ఉన్న తెలంగాణకు, ఆంధ్రకు ధరలు కూడా వ్యత్యాసం ఎంతో ఉంది. ఇప్పుడు రైతులను ఆదుకోకపోతే అప్పుల పాలవ్వడమే.


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.