ఎస్‌పీ గ్రూప్‌ అధినేత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

ABN , First Publish Date - 2022-06-29T09:20:49+05:30 IST

ప్రముఖ పారిశ్రామికవేత్త, షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ అధినేత పల్లోంజీ మిస్త్రీ (93) మరికలేరు.

ఎస్‌పీ గ్రూప్‌ అధినేత పల్లోంజీ మిస్త్రీ కన్నుమూత

ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త, షాపూర్జీ పల్లోంజీ (ఎస్‌పీ) గ్రూప్‌ అధినేత పల్లోంజీ మిస్త్రీ (93) మరికలేరు. మంగళవారం తెల్లవారుజామున ముంబైలోని తన నివాసంలో కన్నుమూశారు. టాటా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ సైరస్‌ మిస్త్రీతో పాటు ఆయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. కుమార్తె అలూ.. రతన్‌ టాటా సోదరుడు నోయల్‌ టాటా భార్య. బుధవారం ముంబైలోని పార్సీ స్మశానవాటికలో పల్లోంజీ మిస్త్రీ అంత్యక్రియలు జరుగుతాయి. 


కొత్త శిఖరాలకు సంస్థ భవన నిర్మాణ రంగంలో ఎస్‌పీ గ్రూప్‌ను పల్లోంజీ మిస్త్రీ అత్యున్నత స్థాయికి తీసుకువెళ్లారు. 1947లో ఎస్‌పీ గ్రూప్‌లో అడుగుపెట్టిన పల్లోంజీ తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ మరణానంతరం ఆ గ్రూప్‌ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు. దేశంలోనే పుట్టి పెరిగిన ఆయన తర్వాత ఐర్లాండ్‌ పౌరసత్వం తీసుకున్నారు. పల్లోంజీ నాయకత్వంలో ఎస్‌పీ గ్రూప్‌ విదేశాలకూ విస్తరించింది. మస్కట్‌లో ఒమన్‌ రాజప్రసాదాన్ని ఎస్‌పీ గ్రూపే నిర్మించింది. రియల్‌ ఎస్టేట్‌, టెక్స్‌టైల్స్‌, నౌకాయానం, హోమ్‌ అప్లయన్సెస్‌ వంటి రంగాలకూ గ్రూప్‌ను విస్తరించారు. పారిశ్రామిక రంగంలో ఆయన సేవలను గుర్తించి ప్రభుత్వం 2016లో పద్మ భూషణ్‌ అవార్డుతో గౌరవించింది. 


‘టాటా సన్స్‌’లో అతి పెద్ద వాటాదారు : టాటా గ్రూప్‌ హోల్డింగ్‌ కంపెనీ టాటా సన్స్‌ ఈక్విటీలో పల్లోంజీ మిస్త్రీ అతి పెద్ద వాటాదారు. ఈ కంపెనీ ఈక్విటీలో పల్లోంజీకి ఇప్పటికీ 18.37 శాతం వాటా ఉంది. తన తండ్రి షాపూర్జీ పల్లోంజీ నుంచి ఆయనకు ఈ వాటా సంక్రమించింది. 2012లో రతన్‌ టాటా.. టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి తప్పుకున్న తర్వాత పల్లోంజీ కుమారుడు సైరస్‌ మిస్త్రీ 2016 వరకు చైర్మన్‌గా వ్యవహరించారు. రతన్‌ టాటా నాయకత్వంలోని బోర్డు సైరస్‌ మిస్త్రీని అర్థాంతరంగా తొలగించడంతో రెండు పారిశ్రామిక గ్రూప్‌ల మధ్య ఎడబాటు పెరిగింది.


రాష్ట్రపతి, ప్రధాని సంతాపం: పల్లోంజి మృతి పట్ల రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీతో సహా పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ‘సంపద సృష్టి, దేశ నిర్మాణంలో పల్లోంజీ మిస్త్రీ పాత్రను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది’ అని రాష్ట్రపతి తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. దేశ పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు పల్లోంజీ అద్భుత సేవలు అందించారని ప్రధాని మోదీ ట్వీట్‌ చేశారు.  


రూ.39,425 కోట్ల నెట్‌వర్త్‌ 

ప్రస్తుతం ఎస్‌పీ గ్రూప్‌ నికర విలువ 500 కోట్ల డాలర్ల (సుమారు రూ.39,425 కోట్లు) వరకు ఉంటుందని అంచనా. దేశంలోని మరే నాన్‌ లిస్టెడ్‌ కంపెనీ నికర విలువ ఈ స్థాయిలో లేదు. ఎస్‌పీ గ్రూప్‌ నిర్మించే కట్టడాలు నాణ్యతకు మారుపేరుగా ఉండేవి. దీంతో అనేక ప్రముఖ భవనాల నిర్మాణ కాంట్రాక్టులు ఎస్‌పీ గ్రూప్‌నకు దక్కేవి. ముంబైలోని ఆర్‌బీఐ, హెచ్‌ఎ్‌సబీసీ, బీఎస్‌ఈ భవనాలు, తాజ్‌, ఒబెరాయ్‌ స్టార్‌ హోటళ్ల భవనాలను ఎస్‌పీ గ్రూప్‌ నిర్మించింది. అమరావతిలోని ఏపీ సెక్రటేరియట్‌, హైకోర్టు భవనాల్ని ఈ గ్రూపే నిర్మించింది. అలాగే తెలంగాణ కొత్త సెక్రటేరియట్‌ భవన నిర్మాణ కాంట్రాక్టు కూడా ఎస్‌పీ గ్రూప్‌కే దక్కింది. అంతేకాదు హైదరాబాద్‌లో పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను ఎస్‌పీ గ్రూప్‌ నిర్మించింది. 

Updated Date - 2022-06-29T09:20:49+05:30 IST