చెనిక్కాయ వద్దప్పో..!

ABN , First Publish Date - 2022-05-27T05:41:42+05:30 IST

వేరుశనగ సాగుకు జిల్లా రైతు ఆసక్తి చూపట్లేదు. అతివృష్టి, అనావృష్టితో కొన్నేళ్లుగా వేరుశనగ పంట చేతికందట్లేదు.

చెనిక్కాయ వద్దప్పో..!

విత్తన రిజిస్ట్రేషనకు స్పందన కరువు

ఆసక్తి చూపని అన్నదాత

బోసిపోయిన ఆర్‌బీకేలు

కొత్తచెరువు/చిలమత్తూరు, మే 26: వేరుశనగ సాగుకు జిల్లా రైతు ఆసక్తి చూపట్లేదు. అతివృష్టి, అనావృష్టితో కొన్నేళ్లుగా వేరుశనగ పంట చేతికందట్లేదు. పెట్టుబడులు పెరగడం, దిగుబడులు రాకపోవడం, వచ్చినా ధర లేక ఏటా అన్నదాత నష్టాలు మూటగట్టుకుని, అప్పుల పాలవుతున్నాడు. దీంతో పంట సాగుకు ముందుకు రావట్లేదు. ప్రభుత్వ సబ్సిడీ విత్తన వేరుశనగ రిజిస్ట్రేషనకు స్పందన కరువవడమే ఇందుకు నిదర్శనం. రిజిస్ర్టేషన చేసుకునే రైతు భరోసా కేంద్రా(ఆర్‌బీకే)లు వెలవెలబోతున్నాయి.


మార్పిడి దిశగా..

ఏళ్ల తరబడి వర్షాధారంగా సాగుచేస్తున్న వేరుశనగ పంటపై రైతుల్లో నిరాసక్తత నెలకొంది. 20 ఏళ్లుగా ఆశించిన దిగుబడులు రాకపోవడం, పెట్టుబడులు అధికం కావడం, చేతికొచ్చిన పంటకు గిట్టుబాటు ధర దక్కకపోవడంతో వేరుశనగ పంట సాగుపై రైతుల్లో మార్పు కనిపిస్తోంది. ఖరీఫ్‌ సీజన ప్రారంభంలో మండలవ్యాప్తంగా వేరుశనగ సాగుకు రైతులు సిద్ధమవడం సర్వసాధారణం. ఈ ఖరీ్‌ఫలో ఆ పంటను సాగు చేయడానికి రైతులు సిద్ధంగా లేరన్నట్లు అనిపిస్తోంది. ఈ పాటికి ముంగార్ల సేద్యంలో రైతులు బిజీబిజీగా ఉండేవారు. వర్షాధారంగా సాగుచేసే వేరుశనగ పంట నష్టాలతో విసిగిపోయిన రైతన్నలు పంట మార్పిడికి సిద్ధపడుతున్నారు. 


మందకొడిగా విత్తన రిజిస్ట్రేషన

సబ్సిడీ వేరుశనగ విత్తనకాయల కోసం ప్రతి ఆర్‌బీకేలో ఈనెల 24 నుంచి ముందస్తు రిజిస్ర్టేషన్లు చేపడుతున్నారు. జిల్లావ్యాప్తంగా 396 ఆర్‌బీకేల్లో ఆయా సచివాలయ వ్యవసాయ సహాయకులు రైతుల నుంచి నగదుతోపాటు ఆధార్‌, పట్టాదారు పాసుపుస్తకం వివరాలను తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 16961 మంది రైతులు, 14248 బ్యాగుల విత్తనకాయలకు రిజిస్ట్రేషన చేసుకున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి శివన్నారాయణ గురువారం తెలిపారు. దీనిని బట్టి చూస్తే విత్తన వేరుశనగ కాయలపై రైతులకు ఆసక్తి లేదనిపిస్తోంది. ఏటా వేరుశనగ కొనుగోలుకు రైతులు క్యూకట్టేవారు. ఈ ఏడాది ఆర్‌బీకేల్లో రైతుల కోసం అధికారులు ఎదురు చూడాల్సి వస్తోంది. రోజూ 10 నుంచి 20 మంది రైతులు మాత్రమే ఒక్కో ఆర్‌బీకేలో రిజిస్ట్రేషన చేసుకుంటున్నారని తెలుస్తోంది.


పెట్టుబడులు పెరగడంతోనే..

వేరుశనగ పంట సాగు పెట్టుబడులు విపరీతంగా పెరగడంతో రైతులు సాగుపై పునరాలోచిస్తున్నారు. పంట బాగా పండినా గిట్టుబాటు ధర దక్కక కొన్నేళ్లుగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పంటసాగును తగ్గించుకొని ఇతర పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఎకరంలో వేరుశనగ సాగు చేయాలంటే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతోంది. ఇటీవల దుక్కి దున్నే ట్రాక్టర్ల బాడుగ నుంచి విత్తనాలు, కూలీలు, ఎరువులు, పంటకోత, నూర్పిడి ఇలా ప్రతి పనికి రేట్లు విపరీతంగా పెరిగాయి. అవి రైతుకు భారంగా మారుతున్నాయి.


ప్రత్యామ్నాయం వైపు మొగ్గు

కొన్నేళ్లుగా వేరుశనగ పంటతో నష్టాల్లో కూరుకుపోయిన రైతులు ప్రత్యామ్నాయ వర్షాధార పంటల సాగుకు మొగ్గు చూపుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కో పంట పెడుతున్నారు. హిందూపురం ప్రాంతంలో మొక్కజొన్న ఎక్కువగా సాగు చేస్తున్నారు. రెండుమూడు సంవత్సరాలుగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరుగుతోందని వ్యవసాయాధికారులు పేర్కొంటున్నారు. పెట్టుబడులు తక్కువగా కావడమే అందుకు కారణం. తక్కువ వర్షపాతం కురిసినా పంట పూర్తిస్థాయిలో రైతుకు దక్కే అవకాశం ఉంది. దీంతో ఖరీఫ్‌ సీజనలో మొక్కజొన్న పంట సాగు పెరిగే అవకాశం ఉంది.


అంతర పంటల ఊసేలేదు..

గతంలో వేరుశనగ పంట సాగుచేస్తే అందులో అంతర పంటలుగా కందులు, పెసలు, మినుములు, అలసంద, నువ్వులు వంటివి వేసుకునేవారు. వాటి ద్వారా రైతుకు అదనపు ఆదాయం సమకూరేది. ఇటీవల అంతర పంటల సాగును పూర్తిగా తగ్గించడంతో రైతులు అదనంగా వచ్చే ఆదాయాన్ని కోల్పోయారు. ప్రభుత్వం కూడా అంతర పంటల విత్తనాలను సబ్సిడీపై ఇవ్వకపోవడంతో రైతులు రానురాను వాటి సాగును మరచిపోతున్నారు. వేరుశనగ పంట సాగులో వీటిని అదనంగా అంతరంగా వేసుకునేవారు. ప్రత్యామ్నాయ పంటల్లో వీటిని వేసుకునే అవకాశం లేకపోవడం కూడా అంతర పంటల సాగు తగ్గడానికి ఒక కారణంగా చెప్పొచ్చు.

Updated Date - 2022-05-27T05:41:42+05:30 IST