‘పల్లెప్రగతి’ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-05-29T06:15:10+05:30 IST

జిల్లా వ్యాప్తంగా ఐదో విడత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు.

‘పల్లెప్రగతి’ని విజయవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి

వెలుగుచూసిన అధికారుల సమన్వయలోపం

నల్లగొండ, మే 28: జిల్లా వ్యాప్తంగా ఐదో విడత పల్లెప్రగతిని విజయవంతం చేయాలని జడ్పీ చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి అన్నారు. పల్లెప్రగతిపై జడ్పీ సమావేశ మందిరంలో శనివారం నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఇతర సిబ్బంది పల్లెల అభివృద్ధే ధ్యేయంగా పనిచేయాలన్నారు. పల్లెప్రగతి ప్రారంభం రోజున గ్రామాల్లో పాదయాత్రలు, గ్రామసభలు నిర్వహించి సీఎం సందేశాన్ని చదివి వినిపించాలన్నారు. పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని, ఒకరోజు పవర్‌డే పాటించి పెండింగ్‌ సమస్యలు పరిష్కరించాలన్నారు. తాగునీటి వనరులను గుర్తించి శుభ్రం చేయాలని, డంపింగ్‌యార్డు, వైకుంఠధామాలను సందర్శించాలన్నారు. గ్రామస్థుల సహకారంతో శ్రమదానం చేసి పిచ్చి మొక్కలను తొలగించాలన్నారు. పాడుబడిన, నిరుపయోగంగా ఉన్న బావులను పూ డ్చివేయాలని, ఇళ్ల శిథిలాలను తొలగించాలన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మ మాట్లాడుతూ, హరితహారం కింద పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా పెద్ద సంఖ్యలో మొక్కలను నాటాలని సూచించారు. అధికారులు సమన్వయంతో పల్లెప్రగతిని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో వీరబ్రహ్మచారి, డిప్యూటీ సీఈవో కాంతమ్మ, డీఆర్‌డీఏ పీడీ కాళిందిని, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్థన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అధికారుల మధ్య సమన్వయలోపం

పల్లెప్రగతి కార్యక్రమానికి ముందే ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారుల మధ్య సమన్వయలోపం జడ్పీ వేదికగా వెలుగుచూసింది. ఓ మండలం లో ఎంపీడీవో సహకరించడం లేదని, ఆయన సెలవుల్లో ఉన్నాడని, ఇలాగైతే తాను పల్లెప్రగతిపై ఎలా పనిచేయగలుగుతానని మండల ప్రత్యేక అధికారి సమావేశం దృష్టికి తీసుకొచ్చారు. మరో ఎంపీడీవో మా ట్లాడుతూ, తన మండలంలో ప్రత్యేక అధికారి 30 రోజులుగా సెలవుల్లో ఉన్నారని అన్నారు. మరో ఎంపీడీవో మాట్లాడుతూ నిధులు లేనప్పుడు సర్పంచ్‌లకు ఏం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఇకనైనా బిల్లులు మంజూరు చేయాలని కోరారు. దీంతో చైర్మన్‌ బండా నరేందర్‌రెడ్డి మా ట్లాడుతూ, సర్పంచ్‌లు ఎవ్వరూ సొంత జేబుల్లోంచి పెట్టడం లేదని, ప్రభుత్వం ఎప్పటికప్పుడు బిల్లులు మంజూరు చేస్తోంని, ప్రభుత్వాన్ని బదనాం చేస్తే ఎంతటివారైనా సహించేది లేదని హెచ్చరించారు. జడ్పీ సీఈవో వీరబ్రహ్మం ఓ ప్రత్యేక అధికారి ప్రశ్నలపై స్పందిస్తూ సదరు మండలానికి చెందిన ఎంపీడీవో చురుకైన వ్యక్తని మందలిచ్చారు. ఇదే సమయంలో మరో ఎంపీడీవో మాట్లాడుతూ ఏఈవోలకు పెద్దగా పని ఉండదని, వారు పల్లెప్రగతిలో బాధ్యతగా పనిచేసేలా చూడాలని సూచించారు. దీంతో చైర్మన్‌ జోక్యం చేసుకుని ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్ల సమస్యలు పరిష్కారం కావని, సమన్వయంతో పనిచేయాలని సూచించారు. నిధులు, సిబ్బంది, ప్రత్యేక అధికారుల కొరత, అధికారుల సెలవులపై సమావేశంలో సుదీర్ఘ చర్చ సాగింది.

Updated Date - 2022-05-29T06:15:10+05:30 IST