పల్లె ప్రగతి పట్టాలెక్కేనా..!

ABN , First Publish Date - 2021-02-24T05:01:45+05:30 IST

పల్లె ప్రగతికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత పంచాయతీల రూపం మారిం ది.

పల్లె ప్రగతి పట్టాలెక్కేనా..!
లక్ష్మిపాళెంలో అధ్వాన్నంగా ఉన్న రహదారి..

32 నెలల తర్వాత కొత్త పాలకవర్గాలు 

సర్పంచులకు సమస్యల స్వాగతం 

పుష్కలంగా నిధులు 

ఖర్చు చేసేందుకు సమయం నెలమాత్రమే..!


బద్వేలు, ఫిబ్రవరి 23: పల్లె ప్రగతికి ఎంతో ప్రాధాన్యం ఇవ్వాలన్న సంకల్పంతో రాష్ట్రప్రభుత్వం గ్రామ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిన తర్వాత పంచాయతీల రూపం మారిం ది. పంచాయతీలు పదిమంది ఉద్యోగులు కలిగిన గ్రామ సచివాలయాలుగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ తరుణంలో పంచాయతీలకు కొత్త ప్రజాప్రతినిధులు ఎన్నిక య్యారు. ప్రతి పంచాయతీలో సమస్యలు తిష్టవేశాయి. రోడ్లు, డ్రైనేజీలు, పారిశుధ్యలోపం, నీటి సరఫరా, పాఠశాలలు అంగన్వాడీలకు ప్రహరీ లేకపోవడం, వీధిలైట్లు... అనేక సమస్యలు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు స్వాగతం పలుకుతున్నాయి. ఈ సమస్యలు తీరాలంటే కొత్తపాలకవర్గాల చొరవ, నిధుల అవసరం ఉంది. అయితే నిధులున్నా నెలలోపే ఖర్చు చేయకుంటే మురిగిపోయే ప్రమాదముంది.


14, 15వ ఆర్థిక సంఘం నిధులు 

గ్రామపంచాయతీల్లో ప్రస్తుతం 14, 15వ ఆర్థిక సంఘం నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిన్న పంచాయతీలకు సగటున రూ.20 లక్షలు, పెద్ద పంచాయతీలకు  సుమారు కోటి రూపాయల వరకు నిధులున్నాయి. అయితే ఈ నిధులన్నీ ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోపే అంటే మార్చి 31వ తేదీ నాటికే ఖర్చు చేయాల్సి ఉంది. లేదంటే ఈ నిధులు మురిగిపోయే ప్రమాదముంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చకచకా నిర్మాణ పనులు చేపట్టాల్సి ఉంది. 14వ ఆర్థిక సంఘం నిధులతో సిమెంటురోడ్లు, డ్రైనేజీ, స్కూలు, అంగన్వాడీ కేంద్రాలు, శ్మశానాల ప్రహరీ నిర్మాణాలు చేపట్టవచ్చు.  తాగునీటి పథకాలకు నిధులు ఖర్చు చేయాల్సిఉంది. వేసవి మొదలు కానుండడంతో నీటి ఎద్దడిపై  చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు జరగకుండా ఉంటే ఆర్థిక సంఘాల నిధులు వచ్చేందుకు అవకాశం లేకపోయినా కరోనా పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం ఈ నిధులను విడుదలచేసింది. ఈ నిధులు చాలామటుకు ఇప్పటికే ఖర్చుచేయాల్సి ఉన్నా స్పెషల్‌ ఆఫీసర్ల పాలనలో పనుల కేటాయింపునకు రాజకీయ సమస్యలు తలెత్తడంతో  ఆలస్యమైంది. కొన్నిచోట్ల ఎమ్మెల్యేల సూచనలతో ఈ నిధులు ఖర్చుచేసేందుకు ప్రణాళికలు రూపొందించినా ఇంతలోపే పంచాయతీ ఎన్నికల కోడ్‌ రావడంతో ఆ పనులు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో 32 నెలల తరువాత కొలువు తీరుతున్న పంచాయతీ పాలకవర్గాలు ఈ నిధులతో అభివృద్ధి పనులు మార్చి 31లోపు చేపట్టేందుకు త్వరితగతిన చొరవ చూపాల్సిఉంది.


నియోజకవర్గమంతా సమస్యలే..


బద్వేలు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో సమస్యలు తిష్టవేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పారిశుధ్యం లోపించడంతో ప్రజల అవస్థలు వర్ణనాతీతం. కొత్తగా ఎన్నికైన సర్పంచులపై ప్రజలు ఎంతో ఆశపెట్టుకున్నారు.

బద్వేలు మండలం లక్ష్మిపాళెంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో నీరంతా రోడ్లపై ప్రవహిస్తూ ప్రజలు తీవ్ర అగచాట్లు పడుతున్నారు. రాత్రివేళ ప్రజల అవస్థలు చెప్పనలవి కాదు. 

బయనపల్లెలో శ్మశాన వాటిక లేకపోవడంతో రహదారిపక్కలోనే దహన సంస్కారాలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 

బి.కోడూరు మండలంలో బి.కోడూరు, మునెల్లి, ఐత్రంపేట, పాయలకుంట్ల పంచాయతీల్లో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో పారిశుధ్యం లోపించింది. కొన్ని గ్రామాల్లో లైట్లు వెలగకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. 

కలసపాడు మండలంలోని కలసపాడు, పుల్లారెడ్డిపల్లె, ముసల్‌రెడ్డిపల్లె, చింతలపల్లె, శంఖవరం, పెండ్లిమర్రి గ్రామాల్లో డ్రైనేజీ, రహదారులు అధ్వానంగా ఉన్నాయి.

పోరుమామిళ్ల మండలంలోని బుచ్చిరెడ్డిపాళెం గ్రామానికి మట్టి రోడ్డే గతి. దీంతో వర్షాకాలంలో ఆ రోడ్డుపై నడవాలంటే పాదచారులు అనేక రకాల అవస్థలు పడుతున్నారు. 

పోరుమామిళ్ల పంచాయతీలో రహదారులు అధ్వానంగా ఉన్నాయి. చిన్నపాటి వర్షం వచ్చినా రోడ్లపై నీరు ప్రవహిస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పూసలవాడ, రామేశ్వరం ఎస్టీ కాలనీల్లో రహదారి అధ్వాన్నంగా ఉంది. చల్లగిరిగెల, తోకలపల్లె గ్రామాల్లో డ్రైనేజీ కాల్వలు అస్తవ్యస్థంగా ఉండడంతో పారిశుధ్యం లోపించింది.

Updated Date - 2021-02-24T05:01:45+05:30 IST