Abn logo
Sep 17 2021 @ 04:07AM

కామాంధుడి ఖేల్‌ ఖతం

ఆరేళ్ల పాపపై హత్యాచారానికి పాల్పడిన రాజు ఆత్మహత్య

జనగామ జిల్లాలో కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కిందపడి బలవన్మరణం

స్టేషన్‌ఘన్‌పూర్‌-నష్కల్‌ మధ్య ఘటన

నుజ్జునుజ్జయిన ముఖం.. తెగిన కుడిచేయి

పచ్చబొట్టు ఆధారంగా గుర్తించిన పోలీసులు

వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం

మృతదేహం తీసుకోవడానికి అక్కడికి

వెళ్లేందుకు నిరాకరించిన కుటుంబసభ్యులు

వారికి కౌన్సెలింగ్‌ చేసి పంపిన పోలీసులు

అంబులెన్సుపై చెప్పులు విసిరిన స్థానికులు

ఎంజీఎం మార్చురీ వద్ద తీవ్ర ఉద్రిక్తత

భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు

కొడుక్కి తలకొరివి పెట్టిన తల్లి

జనగామ, మోత్కూరు, హనుమకొండ అర్బన్‌, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ముక్కుపచ్చలారని ఆరేళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టి ఆ చిన్నారి ప్రాణాలు బలిగొన్న కామాంధుడి ఖేల్‌ ఖతమైంది! వారం రోజులుగా పోలీసులకు దొరక్కుండా తప్పించుకు తిరుగుతున్న పల్లకొండ రాజు(30).. ఇక తప్పించుకోవడం కష్టమనుకున్నాడో, పోలీసులకు దొరికిపోతే ఏమవుతుందనుకున్నాడో ఏమో.. ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం 8.45 గంటల సమయంలో.. జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం నష్కల్‌ శివారులో.. కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు వెళ్తున్న కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ కింద పడి దారుణంగా చనిపోయాడు. రైలు వేగం తాకిడికి అతడి ముఖం నుజ్జునుజ్జయిపోయింది! కుడిచెయ్యి మణికట్టు భాగం నుంచి తెగి మాంసం ముద్దగా మారింది. వేళ్లు తెగిపోయాయి. ఎడమ మోకాలు మడమ మధ్య భాగం విరిగిపోయింది!! రాజు ఆత్మహత్యకు పాల్పడడానికి కొద్ది నిమిషాల ముందు రైల్వేట్రాక్‌ విధుల్లో ఉన్న కీమ్యాన్‌ కూతాటి సారంగపాణి అతణ్ని గమనించాడు.

సికింద్రాబాద్‌-కాజీపేట రైల్వే పట్టాలపై 309 నంబర్‌ మైలురాయి వద్ద కూర్చుని ఉన్న రాజును.. ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు. దీనికి రాజు తనపేరు చెప్పకుండా.. తాము ఎరుకల వాళ్లమని చెప్పాడు. పేరేంటని మరోసారి అడిగినా చెప్పలేదు. అయితే, ప్రసారమాధ్యమాల్లో రాజు ఫొటోను పలుమార్లుచూసిన సారంగపాణి.. అతడే రాజు అని గుర్తించి.. ‘నువ్వు రాజువు కదా’ అని ప్రశ్నించాడు. దీంతో రాజు ‘‘నీకెందుకురా?’’ అని దుర్భాషలాడుతూ కాజీపేట వైపు 200 మీటర్ల దూరం పరిగెత్తాడు.దీంతో సారంగపాణి అక్కడే పొలంలో యూరియా చల్లుతున్న యువకులు భూక్యా రాంసింగ్‌, గేమ్‌సింగ్‌, భూక్యా సురేశ్‌కు చెప్పారు. ఈ క్రమంలో రాజు చెట్ల పొదల్లోకి వెళ్లి దాక్కున్నాడు. యువకులు వెళ్లి చెట్ల పొదల్లోకి కంకర రాళ్లు విసరగా ఎంతకూ బయటకు రాలేదు. ఆ యువకులు కొద్దిసేపు చూసి వెళ్లిపోతుండగా పొదల్లోంచి రాజు బయటకు వచ్చి పట్టాల పక్కన నిల్చున్నాడు. అదే సమయంలో కాజీపేట నుంచి సికింద్రాబాద్‌ వైపు కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ వస్తోంది. అప్పటికే చనిపోవాలని నిర్ణయించుకున్నాడో ఏమో.. రాజు పట్టాలకు అడుగు దూరంలోనే నిల్చున్నాడని, రైలు తన సమీపానికి రాగానే ఒక్కసారిగా పట్టాల మీదకు వచ్చాడని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. 


పట్టించిన పచ్చబొట్టు..

రాజు ఆత్మహత్య చేసుకోవడంతో.. రైల్వే కీమ్యాన్‌ సారంగపాణి తొలుత రైల్వే పోలీసులకు, ఆ తర్వాత 100కు డయల్‌ చేసి సమాచారం ఇచ్చారు. ప్రత్యక్షసాక్షి భూక్యా సురేశ్‌ స్థానికంగా పరిచయం ఉన్న ఓ కానిస్టేబుల్‌కు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు 9.53 గంటలకు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతుడి ఎడమ చేతిపై తెలుగులో, కుడి చేతిపై ఇంగ్లీష్‌లో మౌనిక అని పచ్చబొట్టు ఉండడంతో అతడు సైదాబాద్‌లో బాలికపై హత్యాచారానికి పాల్పడ్డ రాజుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. రాజు దుస్తుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, ఇంటి తాళం చెవి, కొంత నగదును పోలీసుల స్వాధీనం చేసుకున్నారు. ఒక ఫోన్‌లో సిమ్‌కార్డు ఉండగా.. మరో ఫోన్‌లో సిమ్‌ లేకుండా ఖాళీగా ఉంది. 


ఎంజీఎంకు తరలింపు..

రైల్వే ట్రాక్‌పై పడి ఉన్న రాజు మృతదేహాన్ని పోలీసులు గురువారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఎంజీఎం మార్చురీకి తరలించారు. రాజు మృతదేహం ఉన్న అంబులెన్సు మార్చురీ వద్దకు చేరుకున్న సమయంలో కొందరు స్థానికులు ఆవేశం పట్టలేక అంబులెన్సుపై చెప్పులు విసిరారు. వారిని పోలీసులు అడ్డుకొని శాంతపరిచారు. రాజు మృతదేహాన్ని భారీపోలీసు బందోబస్తు మధ్య మార్చురీ గదికి తరలించారు. మరోవైపు హైదరాబాద్‌ మలక్‌పేట ఏసీపీ వెంకటరమణ హుటాహుటిన ఎంజీఎం మార్చురీకి చేరుకున్నారు. కాజీపేట రైల్వే పోలీసుల పంచనామాతో పోస్టుమార్టం ప్రక్రియ మొదలైంది. రాజును గుర్తించేందుకు.. సూర్యాపేట జిల్లా పోల్‌మల్ల గ్రామానికి చెందిన కేదిరి మహేశ్‌, కేదిరి సురేశ్‌లను హైదరాబాద్‌ పోలీసులు వరంగల్‌కు తీసుకువచ్చారు. వీరిద్దరు రాజుకు బావమరుదులు. వీరు రాజును గుర్తించడంతో పోస్టుమార్టం పూర్తి చేసి మృతదేహాన్ని సాయంకాలం బంధువులకు అప్పగించారు.


సైదాబాద్‌ ఎస్‌ఐ, ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లతో యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరుకు వెళ్లి రాజు కుటుంబసభ్యులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. రాజు మృతదేహాన్ని తీసుకోవడానికి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని చెప్పగా అందుకు వారు నిరాకరించారు. దాంతో ఎస్‌ఐలు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చి భార్య మౌనిక, రాజు సోదరి అనిత, తల్లి ఈరమ్మను పోలీస్‌ వాహనంలో వరంగల్‌ ఎంజీఎం తీసుకెళ్లారు. మార్చురీ వద్ద మృతదేహాన్ని చూసి తల్లి, భార్య బోరున విలపించారు. భారీ పోలీస్‌ బందోబస్తు మధ్య మృతదేహాన్ని పోతననగర్‌ శ్మశాన వాటికకు తరలించి రాత్రి 8.40 గంటల సమయంలో భారీ బందోబస్తు నడుమ అంత్యక్రియలు పూర్తి చేశారు. రాజు తల్లి తలకొరివి పెట్టింది.

నష్కల్‌వైపు ఎందుకొచ్చాడు?

హనుమకొండ క్రైం: రాజు ఆత్మహత్య కేసుకు సంబంధించి వరంగల్‌ పోలీసులు పలుకోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రాజు ఆత్మహత్య విషయం తెలియగానే సీపీ తరుణ్‌జోషితో పాటు జనగామ డీసీపీ శ్రీనివా్‌సరెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రాథమిక విచారణ తర్వాత ఆత్మహత్యకు పాల్పడ్డది రాజు అనే నిర్ధారణకు వచ్చారు. మూడు ప్రత్యేక పోలీసు బృందాలు, ఒక క్లూస్‌టీమ్‌ ఘటనాస్థలికి వెళ్లి అక్కడ లభించిన వస్తువులను సేకరించారు. మృతుడి వేలిముద్రలు, రక్త నమూనా, ప్రమాదంలో చితికి బయటపడ్డ మెదడు, వేసుకున్న బట్టలు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. క్లూస్‌టీమ్‌ బృందం సేకరించిన ఆనవాళ్లను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపిస్తున్నట్టు వెల్లడించారు. రాజు ఆత్మహత్యపై స్టేషన్‌ఘన్‌పూర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సీపీ తెలిపారు. అతడు నష్కల్‌వైపు ఎందుకొచ్చాడనే కోణంలో దర్యాప్తు చేసినట్టు తరుణ్‌జోషి వివరించారు. రాజుది కచ్చితంగా ఆత్మహత్యేనని తరుణ్‌జోషి స్పష్టం చేశారు. పోలీసులు అణువణువూ జల్లెడపట్టి గాలిస్తున్నా హైదరాబాద్‌ నుంచి స్టేషన్‌ ఘన్‌పూర్‌ వరకూ రాజు ఎలా చేరుకున్నాడనే ప్రశ్నకు సమాధానం లభించలేదు.


సరిగ్గా అక్కడ..

జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్‌-నష్కల్‌ రైల్వే స్టేషన్ల మధ్య 309/1-3 కిలో మీటర్‌ మైలురాయి సమీపంలో ఉన్న రాజవరం బ్రిడ్జి వద్ద రాజు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాజీపేట-సికింద్రాబాద్‌ అప్‌లైన్‌ మార్గంలో ఘటన జరిగిన స్థలం నుంచి స్టేషన్‌ఘన్‌పూర్‌ 4 కి.మీ, నష్కల్‌ స్టేషన్‌ 2.5 కి.మీ దూరంలో ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల మధ్యలో రాజవరం గ్రామం నుంచి వచ్చే వాగుపై ఈ బ్రిడ్జి ఉంటుంది.