పలాస టు విశాఖ!

ABN , First Publish Date - 2020-07-09T11:00:39+05:30 IST

ప్రజా అవసరాలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను నియోజకవర్గానికొక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసి..

పలాస టు విశాఖ!

స్టాక్‌ పాయింట్‌ నుంచి తరలుతున్న ఇసుక

పేరుకే స్థానిక అవసరాలు

కావాలంటే 24 రోజుల పైమాటే..

రవాణా చార్జీల రూపంలో ప్రభుత్వ ధనం వృథా


(పలాస): ప్రజా అవసరాలకు ఇసుకను అందుబాటులోకి తెచ్చినట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకుగాను నియోజకవర్గానికొక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేసి.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ పారదర్శకంగా ఇసుక సరఫరా చేస్తున్నట్టు చెబుతోంది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం స్టాక్‌ పాయింట్లు స్థానిక అవసరాలకు ఉపయోగపడడం లేదు. ఇతర జిల్లాల అవసరాల పేరుతో తరలించుకుపోతున్నారు. పలాస నియోజకవర్గానికి సంబంధించి కోసంగిపురం జంక్షన్‌ వద్ద ఇసుక స్టాక్‌ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. స్థానిక అవసరాలకు ఈ ఇసుక వినియోగించాలని.. భవన నిర్మాణదారులకు పుష్కలంగా ఇసుక అందుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్‌ అప్పలరాజు ప్రకటించారు. కానీ ఇటీవల స్థానికులకు మాత్రం ఇసుక దొరకడం లేదు. విశాఖ అవసరాల పేరిట ఇక్కడి ఇసుకను తరలిస్తున్నారు.


స్టాక్‌ పాయింట్‌లో 51,300 టన్నుల ఇసుకను విక్రయించనున్నట్టు అధికారులు చెబుతున్నారు. గత వారం రోజులుగా వందలాది లారీల్లో ఇసుక తరలిస్తున్నారు. స్థానిక భవన నిర్మాణదారులు, లారీ యజమానులు రోజుల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి. అక్కడున్న సిబ్బందిని అడుగుతుంటే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నడుచుకుంటున్నామని చెబుతున్నారు. శ్రీకాకుళం, ఆమదాలవలస స్టాక్‌పాయింట్ల నుంచి విశాఖకు తరలించేందుకు దగ్గర మార్గం. పలాస నుంచి రవాణా ఖర్చులు అధికమైనా ఇక్కడి ఇసుకను ఎందుకు తరలిస్తున్నారో అంతుపట్టడం లేదు. 


రూ.లక్షల్లో ప్రజాధనం వృథా!

రవాణా చార్జీల రూపంలో ప్రభుత్వంపై అదనపు భారం పడుతోంది. పలాస స్టాక్‌ పాయింట్‌కు జిల్లాలో వేర్వేరు ర్యాంపుల నుంచి ఇసుకను తరలిస్తున్నారు. అక్కడి నుంచి ప్రజా అవసరాలకు సరఫరా చేస్తున్నారు. ర్యాంపు నుంచి 70 కిలోమీటర్ల దూరంలో ఉండే స్టాక్‌ పాయింట్‌కు లారీ ఇసుక తరలించేందుకు రవాణా ఖర్చు రూ.10 వేలుగా చూపుతున్నారు. అదే 210 కిలోమీటర్ల దూరంలోని విశాఖకు ఇసుక తరలిస్తున్నారంటే రవాణా చార్జీలు ఎంత చెల్లిస్తున్నారో అర్ధం చేసుకోవచ్చు. దీనివెనుక చాలా తతంగం జరుగుతోందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. భారీగా ప్రభుత్వ నిధులు వృథా అవుతున్నట్టు తెలుస్తోంది. ఇసుక వ్యవహారాలు చూస్తున్న ఏపీ మినరల్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌(ఏపీఎండిసీ) అధికారులు సమాధానం చెప్పాల్సి ఉంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాల్సిన అవసరం జిల్లా యంత్రాంగంపై ఉంది. 


మూడు వారాల పైమాటే..

ఇసుక కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే కనీసం 24 రోజుల కానిదే రావడం లేదు. అదీ స్థానిక స్టాక్‌పాయింట్‌ నుంచి కాకుండా ప్రభుత్వ ర్యాంపుల నుంచి మాత్రమే ఇసుకను అందిస్తున్నారు. దీంతో సమయంతో పాటు ధనం కూడా వృథా అవుతోందని నిర్మాణదారులు చెబుతున్నారు. ప్రస్తుతం సచివాలయ భవనాలు, ‘నాడు-నేడు’ పథకంలో భాగంగా నిర్మాణాలు చురుగ్గా జరుగుతున్నాయి. వాటికి సైతం ఆశించినంత ఇసుక లభ్యత లేదు. చాలాచోట్ల పనులు నిలిపివేస్తున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది పురుషోత్తపురం, పర్లాం, జలుమూరు వంటి ప్రాంతాల నుంచి ఇసుకను తెచ్చుకుంటున్నారు. రవాణా చార్జీలు అధికంగా ఉంటున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 


అధికారుల ఆదేశాల మేరకే..

జిల్లా అధికారుల ఆదేశాల మేరకే విశాఖ అవసరాలకు ఇసుకను తరలిస్తున్నారు. ఇసుక తరలింపులో అదనపు భారమైనా ప్రభుత్వమే భరిస్తుంది. పలాస ప్రాంతానికి ఇసుక అవసరాలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. కొత్తగా మళ్లీ ఇసుకను తీసుకొచ్చి స్టాక్‌ చేయనున్నారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వెంటనే అందిస్తున్నాం. 

-శంకరరావు, ఏడీ, మైన్స్‌

Updated Date - 2020-07-09T11:00:39+05:30 IST