ఓట్ల కోసం నాటకాలా?

ABN , First Publish Date - 2021-01-25T12:54:28+05:30 IST

వేలాయుధధారిగా కనిపించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిప్పులు చెరిగారు. దేవుడే లేడన్నవారు ఇప్పుడు ఎలా వేలాయుధం చేతబూనారని ...

ఓట్ల కోసం నాటకాలా?

దేవుడే లేడన్నవారు..ఇప్పుడెలా వేలాయుధం చేతబూనారు ?

స్టాలిన్‌పై ఎడప్పాడి ధ్వజం


చెన్నై (ఆంధ్రజ్యోతి): వేలాయుధధారిగా కనిపించిన డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి నిప్పులు చెరిగారు. దేవుడే లేడన్నవారు ఇప్పుడు ఎలా వేలాయుధం చేతబూనారని ప్రశ్నించారు. ఓట్ల కోసం ఇలా ఎన్ని గిమ్మిక్కులు చేసినా దేవుడు వరమివ్వడని, ఆయన అనుకున్నది జరగబోదని శాపనార్థాలు పెట్టారు. ఈ నాటకాలను ప్రజలు గుర్తించారని ఎద్దేవా చేశారు. కోయంబత్తూరు జిల్లా సింగానల్లూరులో శనివారం ఎన్నికల ప్రచారం చేపట్టిన ఆయన డీఎంకే అధినేతపై తీవ్ర విమర్శలు చేశారు. సీఎం ప్రచారానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. దాంతో ఉత్సాహంతో  సీఎం తన ప్రసంగాన్ని కొనసాగించారు. ‘ప్రజలకు అత్యవసరాలైన రోడ్డు, తాగునీరు, వైద్యం, వృత్తి అని అన్ని వసతులు కల్పించిన ఒకే ఒక ప్రభుత్వం అమ్మ ప్రభుత్వం. పేదలు, బలహీనవర్గాల జీవనాధారం పెంపొందేలా ప్రభుత్వం కొత్త పథకాలు ప్రకటించి అమలుపరుస్తోంది. కరోనా వైరస్‌ వ్యాపించిన కాలంలో ఎనిమిది నెలలు రేషన్‌ దుకాణాల ద్వారా ఉచిత బియ్యం, పప్పు, నూనె, చక్కెర పంపిణి చేశాం. వాటితో పాటు రూ.1,000 నగదు అందజేశాం. అయితే డీఎంకే ప్రభుత్వంలో తుపాను సమయాల్లో ప్రజలను పట్టించు కోలేదు. వారి కుటుంబసభ్యులను కాపాడుకునేందుకే ప్రాధాన్యత ఇచ్చారు.

2011కు ముందు రాష్ట్రం ఎలా ఉండేది, గత పదేళ్లలో ఎలా అభివృద్ధి చెందింది అన్న దాన్ని ప్రజలు పోల్చి చూడాలి. విద్యారంగంలో విప్లవం కలిగించి గ్రామాల్లో ఉన్న పేద విద్యార్థులు ఉన్నత విద్య అభ్యసించేందుకు విస్త్రత అవకాశాలు కల్పించాం. ఎక్కడికక్కడ కళాశాలల్ని ప్రారంభించాం. పాఠశాలల హోదా పెంచాం. దేశంలో విద్యాభోధనలో రాష్ట్రం ప్రథమస్థానంలో ఉంది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలు, బ్యాగు, సైకిల్‌, యూనిఫారం, షూ, రూ.12 వేల విలువైన ల్యాప్‌టాప్‌లు అందజేశాం. ఇప్పటివరకు 52 లక్షల మంది విద్యార్థులకు వీటిని అందజేశాము. డీఎంకే ప్రభుత్వంలో ల్యాప్‌టాప్‌లు ఇచ్చారా?’’ అని ప్రశ్నించారు. అమెరికాలో కూడా ఇలాంటి ఉచితాలు లేవని తెలిపారు. ఒక్కో గ్రామంలో పర్యటిస్తున్న స్టాలిన్‌ అమాయక మహిళలతో మాట్లాడుతున్నారని, ఇలాంటి పథకాలు డీఎంకే చేపట్టిందా? అని నిలదీశారు.  డీఎంకే ఒక కుటుంబ పార్టీ అని, కార్పొరేట్‌ కంపెనీ అని, దాని ఛైర్మన్‌ స్టాలిన్‌, డైరెక్టర్లు ఉదయనిధి, కనిమొళి, ధయానిఽధి మారన్‌లని విమర్శించారు. స్టాలిన్‌ కొత్త అవతారం ఎత్తారని, శూలాయుధం పట్టుకొని పత్రికలకు ఫోజులిస్తున్నారని ఎద్దేవా చేశారు. అనర్హులంతా శూలాయుధం పట్టుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు. మనసులో ఒకటి పెట్టుకొని, బయట మరొకటి చెప్పి నటిస్తున్నారన్నారు. దేవుడే లేడని చెబుతున్న వారు ఎలా శూలాయుధం పట్టుకొని కొత్త రూపం దాల్చారని అన్నారు. దేవుడు నమ్మిన వారిని చేయి విడిచిన చరిత్ర లేదన్నారు. దేవుడిపై భక్తి కలిగిన వారు ఇతరులకు సాయం చేస్తారని, అలాంటి వారికి దేవుడు మేలు చేస్తాడని అన్నారు. ఆ క్రమంలో, స్టాలిన్‌ చేసే మోసపూరిత నాటకాలకు దేవుడు ఎలాంటి వరం ఇవ్వడని అన్నారు. దైవభక్తి కలిగిన అన్నాడీఎంకే అలాంటి కుట్రలు, కుతంత్రాలకు పాల్పడవన్నారు. కోయంబత్తూర్‌ జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి చేశామన్నారు.

Updated Date - 2021-01-25T12:54:28+05:30 IST