శశికళకు పళనిస్వామి షాక్..!

ABN , First Publish Date - 2021-01-20T01:20:39+05:30 IST

తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం స్నేహ గీతం ఆలపిస్తున్న...

శశికళకు పళనిస్వామి షాక్..!

చెన్నై: తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సీఎం పళనిస్వామి ఢిల్లీ పర్యటనపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రస్తుతం స్నేహ గీతం ఆలపిస్తున్న అన్నాడీఎంకే, బీజేపీ వచ్చే ఎన్నికల్లో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా జరుగుతున్న సమయంలో సీఎం టూర్ ప్రాధాన్యం సంతరించుకుంది. శశికళను, టీటీవీ దినకరన్‌ను కలుపుకుని పోవాలని పళనికి చెప్పేందుకే భారతీయ జనతా పార్టీ ఆయనను ఢిల్లీకి పిలిపించుకుందన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పళని స్వామి భేటీ కానున్నారు. ఈ సందర్భంగా.. ఢిల్లీలో మీడియా ఎదుట సీఎం పళని స్వామి ఓ విషయాన్ని స్పష్టం చేశారు.


శశికళ మళ్లీ అన్నాడీఎంకేలో చేరతారన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. ఎట్టి పరిస్థితుల్లో అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఆమె పార్టీలోనే లేదని స్పష్టం చేశారు. వంద శాతం ఆమెను పార్టీలో చేర్చుకునే పరిస్థితి లేదని పళనిస్వామి కుండబద్ధలు కొట్టి మరీ చెప్పారు. ఈ విషయంలో అన్నాడీఎంకేలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని తెలిపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ నాలుగేళ్ల నుంచి జైలు జీవితం గడిపిన సంగతి తెలిసిందే. పది కోట్ల రూపాయల జరిమానా చెల్లించి ఆమె వచ్చే వారంలో విడుదల కానున్నారన్న వార్తల నేపథ్యంలో పళనిస్వామి తాజా వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. జనవరి 27న జయలలిత మెమోరియల్‌ను సీఎం పళనిస్వామి ప్రారంభించనున్నారు. అదే రోజు జైలు నుంచి శశికళ విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


జయలలిత చనిపోయిన అనంతరం జరిగిన అనూహ్య పరిణామాలతో సీఎం పదవి చేజారిపోయిన సందర్భంలో శశికళ ‘ప్లాన్‌ బి’ అమల్లోకి తెచ్చారు. పార్టీని, ప్రభుత్వాన్ని తన గుప్పిటలో ఉంచుకోవడానికి శరవేగంగా పావులు కదిపారు. ముఖ్యమంత్రి రేసు నుంచి పనీర్‌ సెల్వాన్ని తప్పించి, తన అనుచరుడికి అప్పగించే దిశగా అడుగులు వేశారు. సుప్రీం తీర్పు వెలువడిన గంటలోపే, కోవత్తూరు రిసార్టులోనే అత్యవసరంగా తన వర్గం ఎమ్మెల్యేలతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీనియర్‌ నేతలు పళని స్వామి, సెంగోట్టియన్‌, తంబిదురై ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డారు. అయితే, అనుంగు అనుచరుడు, సెల్వానికి బద్ధ విరోధి అయిన పళని స్వామిని శశికళ ఎంపిక చేశారు. ఎమ్మెల్యేలంతా ఆయననే తమ నేతగా ఎంపిక చేసుకున్నారు. పళనిని సీఎం సీటులో కూర్చోబెట్టేందుకు ఇంత చేసిన శశికళను పార్టీలో చేర్చుకునేది లేదని పళని స్వామి వ్యాఖ్యానించడం తమిళ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలకు అద్దం పడుతున్నాయి.

Updated Date - 2021-01-20T01:20:39+05:30 IST