Abn logo
Feb 22 2020 @ 02:10AM

పలనాటి వీరకేసరి కన్నెగంటి

కోలగుట్లకు వస్తున్న కన్నెగంటిని 30 మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టారు. నిరాయుధునిగా ఉన్న హనుమంతుపై ఏకపక్షంగా కాల్పులు జరిపారు. 26 తూటాలు దిగి, శరీరమంతా బుల్లెట్‌ గాయాలైన స్థితిలో ఆ వీరకేసరి మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా పోలీసులు తుపాకీ మడమలతో గొంతుపై నొక్కి తీవ్రంగా హింసించి చంపారు.


కన్నెగంటి హనుమంతు/ వెన్నులోని బాకు/ 

కత్తి కట్టి కదల మంది/ కడ విజయం వరకు... 

అని ఆరుద్ర రాసిన పాట అందరమూ వింటూనే ఉన్నాం.


బ్రిటిష్‌ పాలకుల క్రూర నిర్బంధానికి బలైపోయిన వేలాది యోధుల్లో హనుమంతు ఒకరు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలోని మించాలపాడు (ప్రస్తుత దుర్గి మండలం) గ్రామ వాసి. అచ్చమ్మ -వెంకటప్పయ్య దంపతులకు 1870లో జన్మించిన ఈ వీరుడు యుక్త వయస్సులోనే కాంగ్రెస్‌ పార్టీ పట్ల, స్వాతంత్య్ర సమరం పట్ల ఆకర్షితుడయ్యాడు.


సారవంతమైన రేగడి భూములున్నా పల్నాడు ప్రాంతం నీటి వసతి లేక వర్షాధారంగానే ఉండేది. వర్షాలు కురవక, కురిసినా సరిపోక ఈ ప్రాంతమంతా నిత్యం కరువు కాటకాలతో కునారిల్లుతుండేది. పాడి ప్రధాన పోషకంగా ఉన్నా పశు గ్రాసానికి తీవ్ర కొరత ఉండేది. పశువుకి రెండు రూపాయలు చెల్లిస్తే తప్ప అడవిలో వాటిని మేపుకునేందుకు ఫారెస్ట్‌ అధికారులు, రెవెన్యూ సిబ్బంది అనుమతించే వారు కాదు. దీనినే ‘అడవి పుల్లరి’ అనే వారు. ఈ అధికారిక వసూళ్లే గాక ఇతర లంచాలు, వేధింపులు కూడా ఉండేవి. 


ఈ పరిస్థితికి నిరసనగా జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలు అడవి పుల్లరితో నహా ఇతర పన్నులు కట్టటం మానుకున్నారు. 1921లో ఉన్నవ లక్ష్మీనారాయణ నాయకత్వంలో ఒక వాలంటీర్ల దళం అడవి పుల్లరికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్ట్‌ అయింది. ఉన్నవను, మూడభూషి నరసింహాచార్యాలను విచారించి ఒక సంవత్సరం కఠిన కారాగార శిక్ష విధించి రాయవెల్లూరు జైలుకు పంపారు. దీంతో సుమారు 90–- 100 గ్రామాలకు పుల్లరి వ్యతిరేక ఉద్యమం వ్యాపించింది. 


ఈ ఉద్యమానికి కన్నెగంటి హనుమంతు నాయకత్వం వహించారు. హనుమంతు ఉద్యమం సాగిస్తున్న 30–- 40 గ్రామాల్లో పాలన పూర్తిగా స్తంభించింది. జనాలను లొంగదీసుకోవడానికి అసంఖ్యాకంగా పోలీసులు దిగారు. వారి బెదిరింపులకు జనం భయపడలేదు. పోలీసులు జంగమహేశ్వరపురం, రామాపురం, జెట్టిపాలెం గ్రామాలపై పెద్ద ఎత్తున దాడులు జరిపారు. అప్పుడు గుంటూరు జిల్లా కలెక్టర్‌ రూథర్‌ ఫర్డ్‌. ఇతనే తరువాత అల్లూరి సీతారామరాజుని కూడా చంపించాడు. హనుమంతుకు ధనాశ చూపి ఉద్యమం విరమింప చేయడానికి కోలగుట్ల కరణం సదా శివయ్య ద్వారా విఫల యత్నం చేశారు. హనుమంతుతో చర్చించాలని డిప్యూటీ కలెక్టర్‌ కబురు చేశారు. ఆయన కోసం మించాలపాడు నుంచి పక్కనే ఉన్న ‘కోలగుట్ల’కు వస్తున్నామని కబురు చేశారు. ఈలోగా కోలగుట్లకు తూర్పు విభాగంలో నీళ్ల కోసం వచ్చిన పశువుల మందను ముటుకూరు ‘బందెల దొడ్డి’కి తీసుకెళుతున్న మిలిటరీ దళాన్ని హనుమంతు అల్లుడు పసుపులేటి చిన్నయ్య అడ్డుకొని పశువుల్ని వదలమని కోరాడు. ఆయన్ను పోలీసులు హింసించడంతో ప్రజలు పోలీసులపై తిరగబడ్డారు. పోలీసులు జరిపిన కాల్పుల్లో హనుమంతు పాలేరు శేషయ్య అక్కడికక్కడే చనిపోయాడు. మరో 28 మంది గాయపడ్డారు. 


ఆ రోజు మహాశివరాత్రి. 1922 ఫిబ్రవరి 22వ తేదీ. జనమంతా పండుగ సంబరాల్లో మునిగి ఉన్నారు. 


కోలగుట్లకు వస్తున్న కన్నెగంటిని 30 మంది సాయుధ పోలీసులు చుట్టుముట్టారు. గ్రామం తూర్పు వైపు జరిగిన హింసాత్మక ఘటన తెలిస్తే హనుమంతు మనల్ని చంపుతాడని పోలీసులను భయపెట్టిన కరణం సదా శివయ్య నిరాయుధునిగా ఉన్న హనుమంతుపై ఏకపక్షంగా కాల్పులు జరిగేటట్టు చేశాడు. తుపాకీ కాల్పుల్లో 26 తూటాలు తగిలి శరీరమంతా బుల్లెట్‌ గాయాలైన స్థితిలో ఆ వీర కిషోరం మంచినీళ్లు అడిగినా ఇవ్వకుండా పోలీసులు తుపాకీ మడమలతో గొంతుపై నొక్కి తీవ్రంగా హింసించి చంపారు. హనుమంతు మరణంతో ఉద్యమాన్ని నడిపించే నాయకుడు లేకుండా పోవడంతో ప్రజలు కకావికలయ్యారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమంలో పాల్గొన్న రైతులకు జరిమానాలు విధించి కొందరికి ఆరు నెలలు కారాగార శిక్ష కూడా విధించారు. పలు రకాలుగా వారిని ఇబ్బందులకు గురి చేశారు. అంతటి వీరుడి సమాధిని ఆనాడు సాదా సీదాగా నిర్మించారు. ఈ మధ్య కాలంలో దాన్ని పునర్‌నిర్మించుకొని ఆ వీరుని పట్ల పల్నాడు ప్రజలు తమ గౌరవాభిమానాలు ప్రకటించుకున్నారు. అలాగే గుంటూరు నగరంలో కూడా ఈయన కాంస్య విగ్రహాన్ని అప్పటి కేంద్ర మంత్రి చిరంజీవి ఆవిష్కరించారు. 

చెరుకూరి సత్యనారాయణ

(హనుమంతు ప్రాణత్యాగానికి నేటికి 98 సంవత్సరాలు)

Advertisement
Advertisement
Advertisement