కోడికూరతో వెజ్ కూడితే!
ఆదివారం వచ్చిందంటే చాలు చికెన్ పైకి మనసు లాగేస్తుంటుంది. అయితే ప్రతి వారం చికెన్ కర్రీ అంటే ఎవరికైనా బోర్ కొడుతుంది. అందుకే ఈ వారం కోడికూరతో వెజ్ మిక్స్ చేసి కొత్త రుచిని ఆస్వాదించండి. కరివేపాకు, పాలకూర, గోంగూర, బ్యాంబూ షూట్స్... ఇలా రకరకాల వెజ్ పదార్థాలను జోడించి చికెన్ రెసిపీలు తయారుచేసుకోవచ్చు. ఇక దాల్ చికెన్ రుచి మళ్లీ మళ్లీ తినాలనిపించేలా ఉంటుంది. ఈ వంటల్ని మీరూ ట్రై చేయండి.
కావలసినవి: చికెన్ - అర కిలో, పాలకూర - ఆరు కట్టలు, నూనె - తగినంత, ఉప్పు - రుచికి సరిపడా, పచ్చిమిర్చి - రెండు, జీలకర్రపొడి - పావు టీస్పూన్, ఉల్లిపాయ - ఒకటి, అల్లం - చిన్నముక్క, వెల్లుల్లి రెబ్బలు - నాలుగు.
తయారీ విధానం: పాలకూర, చికెన్‌ను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక చికెన్ ముక్కలు వేసి వేగించాలి. ఉప్పు, జీలకర్ర పొడి వేసి కలుపుకోవాలి. కాసేపు వేగిన తరువాత ఒక పాత్రలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కుక్కర్లో పాలకూర వేసి కొన్నినీళ్లు పోసి చిన్నమంటపై నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టాలి. ఒక పాన్‌లో నూనె వేసి కాస్త వేడి అయ్యాక ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, తగినంత ఉప్పు వేసి వేగించాలి. కాసేపు వేగిన తరువాత కొన్ని నీళ్లు పోసి చిన్నమంటపై ఉడికించాలి. ఇప్పుడు వేగించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేయాలి. కాసేపయ్యాక పాలకూర వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించాలి. ఈ పాలకూర చికెన్‌ను వేడి వేడి అన్నంతో లేదా చపాతీతో సర్వ్ చేసుకోవాలి.