జమాబంది సర్వరోగ నివారిణి కాదు

ABN , First Publish Date - 2021-05-15T06:02:09+05:30 IST

‘జమాబంది చేస్తే ఈ జగడాలుండవు’ శీర్షికన మే5వ తేదీన వి.బాలరాజ్ రాసిన వ్యాసం, సమస్య పరిష్కారానికి సరైన మార్గాలను సూచించలేదు. కర్ణుని చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు, తెలంగాణ గ్రామ...

జమాబంది సర్వరోగ నివారిణి కాదు

‘జమాబంది చేస్తే ఈ జగడాలుండవు’ శీర్షికన మే5వ తేదీన వి.బాలరాజ్ రాసిన వ్యాసం, సమస్య పరిష్కారానికి సరైన మార్గాలను సూచించలేదు. కర్ణుని చావుకు కారణాలు ఎన్నో అన్నట్లు, తెలంగాణ గ్రామ రెవెన్యూ రికార్డులలో తప్పిదాలకు కారణాలు అనేకం. కారణాలు ఏమైనా, కారకులు ఎవరైనా.. లోపభూయిష్టమైన రికార్డు నిర్వహణ మూలంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్న బాధితులు మాత్రం అంతో, ఇంతో వ్యవసాయ భూమి కలిగియున్న సామాన్య రైతులేనన్నది విదితమే. గ్రామ రెవెన్యూ రికార్డులో చోటుచేసుకున్న అనేక విధములైన తప్పులు కొంతమందికి వరమైతే, మరికొందరికి శాపమై, పరిష్కారం లభించక పీడనకు గురి అవుతూ కార్యాలయాల చుట్టూ నేటికి తిరుగుతూనే ఉన్నారు. వీటన్నిటికీ విరుగుడు జమాబంది పక్రియ అనుకోవడం ఎందుకో ఇప్పటి సాంకేతిక కంప్యూటరీకరణ అంతర్జాల అభివృద్ధి దిశగా సహజంగా అనిపించడం లేదు. 


జమాబంది నిర్వహణ విధానం బిఎస్ఓ -12 ననుసరించి జరిగేది. జమాబంది ప్రతి ఫస్లీ సంవత్సరం ముగిసేలోగా గ్రామం భూమిశిస్తు నిర్ధారణతో పాటు ప్రభుత్వభూముల అన్యాక్రాంత వివరాలు, యాజమాన్య బదిలీలు, నీటివనరుల స్థితిగతులు, భూ సంబందిత పరిష్కారాలు ప్రధానాంశాలుగా కొనసాగిన విధానంలో జమాబంది కొనసాగింది. ఒకప్పుడు భూమిశిస్తు ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయవనరుగా ఉండేది, 1984లో భూమిశిస్తు రద్దు చేసి కేవలం ప్రభుత్వ జలవనరుల నుంచి నీరు తీసుకుని సాగు కాబడే భూములపై నీటి పన్ను విధించడం జరిగినందున, భూమి శిస్తు నిర్ధారణ అనేది అప్రస్తుత విషయం. ఇప్పుడు ఎకరానికి ఇంత అని రైతులకే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తున్నది కూడా ఇక యాజమాన్యపు బదిలీల విషయంలో ఆర్ఓఆర్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా పట్టా బదిలీలను ఎప్పుడైనా చేయవచ్చు, జమాబంది జరిగేదాక ఆగవలసి ఉండనక్కరలేదు. దీనికి సంబంధించినంతవరకు జమాబందితో సంబంధమే లేదు. భూ సంబంధిత ఫిర్యాదుల విషయంలోనూ, మండల ఆఫీసులో ప్రతి సోమవారం రోజున తమ ఇబ్బందులు, సమస్యలను తెలియచేసుకుని సమస్యలను పరిష్కరించుకునే అవకాశం ఉన్నది కాబట్టి, జమాబంది జరిగే నాటిదాకా ఆగి ఉండక్కరలేదు. నీటి వనరుల నిర్వహణ బాధ్యత ఇరిగేషన్ శాఖకు అప్పగించి నందున, ఇక జమాబంది ఆవశ్యకత గూడా ఇప్పుడు అక్కరలేదు. 


1994 తదనంతర కాలం నుంచి గ్రామ రెవెన్యూ రికార్డుల నిర్వహణ కంప్యూటరీకరణ దిశగా అడుగులిడుతున్నప్పటి నుంచి అప్పటివరకు నిర్వహిస్తున్న గ్రామలెక్కల్లో మొత్తం 16 నమూనాలుగాను, అందులో భూమి యాజమాన్య అనుభవము తెలియజేయు గ్రామ లెక్క నెం.3 పహాణి పత్రికను మాత్రమే కంప్యూటరీకరణ చేసి, మిగతా నమూనాల ప్రాధాన్యత కోల్పోవడంతో వాటి ప్రాముఖ్యాన్ని పూర్తిగా మరచిపోవడం జరిగింది. కేవలం యాజమాన్యపు హక్కుల నిర్ధారణ, పట్టాదారు పాసుపుస్తకాల జారీకి గాను ఈ గ్రామలెక్క నెం.3. రెవెన్యూ రికార్డును ఇప్పుడు ఉపయోగించుకోవటం జరుగుతోంది. అత్యంత ప్రాధాన్యత కలిగిన ఈ రికార్డులోనూ కొన్ని లోపాలుండి కొంత మంది భూమి అనుభవదారుల్లో విశ్వసనీయతను కోల్పోయిందనడంలో అతిశయోక్తి లేదు. గ్రామ స్థాయిలో రెవెన్యూ నిర్వహణ సిబ్బందే లేని వ్యవస్థలో అంతర్జాల భూయాజమాన్యపు హక్కుల నిర్వహణ పక్రియ రికార్డు ననుసరించి ‘జమాబంది’ తో జగడాలు ఎలా తీరుతాయి?


రాష్ట్రమంతా బందోబస్తు సర్వే సెటిల్ మెంట్ జరిగి ఇప్పటికి సుమారు ఏడెనిమిది దశాబ్దాల కాలం కావస్తున్నా నేటి వరకు కనీసం రివిజన్ సర్వేను కూడ చేపట్టలేకపోయారు. అప్పటి నుంచి జరిగిన భూసంబంధమైన, యాజమాన్యపరమైన ఎన్నో మార్పుల దృష్ట్యా రికార్డులలో అవకతవకలకు ఆస్కారం చోటు చేసుకుంది. రికార్డుల ప్రక్షాళన, జమాబంది నిర్వహణ అంటూ కాగితాలపై చేసే ప్రయోగాల ఆలోచనలను మానుకుని, క్షేత్రస్థాయిలో నిర్వహించగలిగిన సమగ్ర భూమి సర్వేను చేపట్టాలి. అప్పుడు భూమి వర్గీకరణలో భాగంగా ప్రస్తుత కాలానుగుణ పరిస్థితుల దృష్ట్యా వ్యవసాయభూమి, వ్యవసాయేతర భూమి, ప్రభుత్వ సంబంధిత భూములంటూ వర్గీకరించవచ్చు. వ్యవసాయ భూముల వివరాలను గ్రామస్థాయిలో, వ్యవసాయేతర భూముల వివరాలు మండల స్థాయిలోనూ, ప్రభుత్వ భూముల ఆధీనత రెవెన్యూ డివిజన్ పరిధిలోను కొనసాగేట్లుగా బదలాయింపు జరగాలి. అప్పుడే కొంత మేరకైనా భూ సంబంధిత సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించి, కొత్త రెవెన్యూ చట్టానికి న్యాయం చేకూర్చిన వారవుతారు. 


-పాలడుగు రత్నాకర్ రావు

Updated Date - 2021-05-15T06:02:09+05:30 IST