పక్కాగా.. పంటల లెక్క!

ABN , First Publish Date - 2022-07-05T09:35:08+05:30 IST

పంటల సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించే అంశంపై వ్యవసాయశాఖ దృష్టిసారించింది.

పక్కాగా.. పంటల లెక్క!

వచ్చే వారం క్రాప్‌ బుకింగ్‌కు శ్రీకారం

హైదరాబాద్‌, జులై 4 (ఆంధ్రజ్యోతి): పంటల సాగు విస్తీర్ణాన్ని పక్కాగా లెక్కించే అంశంపై వ్యవసాయశాఖ దృష్టిసారించింది. వచ్చే వారం నుంచి పంటల నమోదు(క్రాప్‌ బుకింగ్‌) ప్రారంభించాలని వ్యవసాయ కమిషనరేట్‌ నుంచి ఏఈవోలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇందుకోసం రూపొందించిన ‘ఏఈవో యాప్‌’ను కూడా మంత్రి నిరంజన్‌రెడ్డి ఆవిష్కరించారు. గతంలో ఏ సర్వే నెంబరులో ఎంత విస్తీర్ణం ఉంది? ఏ రైతు ఏ పంట వేశాడు? అనే వివరాలను  సేకరించారు. ఈసారి దానికి అదనంగా మరికొన్ని అంశాలను జోడించారు. వాటితో పాటు పంట ఏ దశలో ఉంది? చీడ పీడలు ఏమైనా ఆశించాయా? పంట దిగుబడి ఎంత వచ్చే అవకాశం ఉంది? అనే వివరాలను వివిధ దశల్లో నమోదుచేసేలా ఈ ‘యాప్‌’ను రూపొందించారు. ఎక్కడో కార్యాలయంలో కూర్చొని వివరాలు నమోదు చేయకాకుండా... తప్పనిసరిగా వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి నమోదు చేస్తేనే వివరాలు తీసుకునేలా ఏర్పాట్లు చేశారు.


అక్షాంశాలు, రేఖాంశాల ప్రకారం పంటల నమోదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. శాటిలైట్‌ సిస్టమ్‌లో సర్వే కూడా చేపట్టాలని వ్యవసాయశాఖ భావిస్తోంది. ఇందుకుగాను ‘నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌’(ఎన్‌ఆర్‌ఎ్‌ససీ) శాస్త్రవేత్తలను కూడా సంప్రదించింది. ఉపగ్రహం సాయంతో పంటల నుంచి వచ్చే కాంతి కిరణాల ఆధారంగా పంటల సమగ్ర వివరాలను సేకరించేలా కసరత్తు చేస్తున్నారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లో ఈ శాటిలైట్‌ సిస్టమ్‌ను వినియోగిస్తున్నారు. తెలంగాణలో కూడా అదే పద్ధతిని అనుసరించాలని వ్యవసాయశాఖ ప్రయత్నాలు చేస్తోంది. సాగు లెక్కలు పక్కాగా తేలితే... ఎరువులు, ప్రొక్యూర్మెంట్‌ ప్రణాళిక కూడా పకడ్బందీగా చేసుకోవచ్చని భావిస్తోంది. 

Updated Date - 2022-07-05T09:35:08+05:30 IST