'కలలో రూ.30కోట్ల లాటరీ గెలిచినట్లు వచ్చింది.. 4 రోజుల తర్వాత అదే నిజమైంది'.. పాకిస్తానీ కల నిజమైన వేళ..

ABN , First Publish Date - 2021-11-04T16:33:27+05:30 IST

చాలా మంది తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చెబుతుంటారు. ఇది మనం చాలాసార్లు విని ఉంటాం కూడా. కానీ, నిజంగా నిజమవుతాయా? అంటే.. సందేహమే.

'కలలో రూ.30కోట్ల లాటరీ గెలిచినట్లు వచ్చింది.. 4 రోజుల తర్వాత అదే నిజమైంది'.. పాకిస్తానీ కల నిజమైన వేళ..

అబుధాబి: చాలా మంది తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని చెబుతుంటారు. ఇది మనం చాలాసార్లు విని ఉంటాం కూడా. కానీ, నిజంగా నిజమవుతాయా? అంటే.. సందేహమే. అయితే, అబుధాబిలో ఉండే పాకిస్తానీ విషయంలో అతడికి తెల్లవారుజామున వచ్చిన కల నిజంగానే నిజమైంది. ముందురోజు రాత్రి కలలో తాను లాటరీ గెలిచినట్లు రావడంతో ఆ తర్వాతి రోజు అతడు అబుధాబి బిగ్ టికెట్ రాఫెల్‌లో ఓ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అంతే.. 4 రోజుల తర్వాత నిర్వహించిన డ్రాలో నిజంగానే అతడు విజేతగా నిలిచాడు. దాంతో ఏకంగా 15 మిలియన్ దిర్హామ్స్(రూ.30.42కోట్లు) గెలుచుకున్నాడు. ఇక కల నిజంగానే నిజమవడంతో అతగాడి ఆనందానికి అవధుల్లేవు. 


వివరాల్లోకి వెళ్తే.. పాకిస్తాన్‌కు చెందిన షాహిద్ మహమూద్(35) అనే వ్యక్తి 2007 నుంచి అబుధాబిలో పనిచేస్తూ అక్కడే ఉంటున్నాడు. ఈ క్రమంలో గడిచిన ఆరేళ్లుగా క్రమం తప్పకుండా అబుధాబి బిగ్‌టికెట్ రాఫెల్‌లో లాటరీ టికెట్లు కొనుగోలు చేస్తున్నాడు. కానీ, ఎప్పుడూ షాహిద్‌కు అదృష్టం వరించలేదు. అయితే, ఈసారి అతడి కల నిజమైంది. అది కూడా కలలో తాను లాటరీ గెలిచినట్లు రావడం.. నిజంగానే అతడు లాటరీ గెలవడం జరిగింది. అక్టోబర్ 30న షాహిద్‌కు ఓ కల వచ్చింది. అదేంటంటే.. అతడు 15 మిలియన్ దిర్హామ్స్ బిగ్‌టికెట్ లాటరీ గెలిచినట్లు. ఆ సమయంలో లాటరీ నిర్వహకులలో ఒకరైన రిచర్డ్‌తో మాట్లాడడం.. ఆ వెంటనే లాటరీ గెలిచిన ఆనందంలో సెలబ్రేషన్స్ చేసుకోవడం లాంటి దృశ్యాలు షాహిద్ కలలో వచ్చాయట. దాంతో వెంటనే నిద్రలేచి చూసిన షాహిద్‌ తెల్లవారుజామున 3 గంటలు అవ్వడం గమనించాడు. 


ఆ తర్వాతి రోజు తన సోదరుడికి తన కల గురించి చెప్పి, ఆన్‌లైన్‌లో లాటరీ టికెట్ కొనుగోలు చేయాల్సిందిగా కోరాడు. దాంతో షాహిద్ సోదరుడు అక్టోబర్ 31న నెం.071808 గల లాటరీ టికెట్ కొన్నాడు. బుధవారం నిర్వహించిన బిగ్ టికెట్ డ్రాలో షాహిద్ కొన్న ఆ లాటరీ టికెట్‌కే జాక్‌పాట్ తగిలింది. దాంతో ఆయన రూ.30.42కోట్లు గెలుచుకున్నాడు. నాలుగు రోజుల కింద కలలో వచ్చింది వచ్చినట్టు జరగడంతో షాహిద్ ఆనందానికి అవధుల్లేవు. నలుగురు పిల్లల తండ్రియైన షాహిద్.. ఈ భారీ మొత్తాన్ని తన పిల్లల భవిష్యత్తుకు ఉపయోగిస్తానని చెప్పుకొచ్చాడు. అలాగే కొంత మొత్తాన్ని తన సోదరుడికి ఇస్తానని తెలిపాడు. 

Updated Date - 2021-11-04T16:33:27+05:30 IST