American Federal Jury: మోసపూరిత స్కీమ్ కేసులో పాక్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ దోషి

ABN , First Publish Date - 2022-07-08T21:34:17+05:30 IST

లక్షలాది డాలర్ల మోసపు స్కీమ్‌కు సంబంధించిన కేసులో పాకిస్థాన్ సంతతి

American Federal Jury: మోసపూరిత స్కీమ్ కేసులో పాక్ ఎగ్జిక్యూటివ్ రమేశ్ దోషి

న్యూయార్క్ : లక్షలాది డాలర్ల మోసపు స్కీమ్‌కు సంబంధించిన కేసులో పాకిస్థాన్ సంతతి వ్యక్తి రమేశ్ సన్నీ బల్వానీ దోషిగా నిర్థరణ అయింది. ఆయనపై వచ్చిన ఆరోపణలన్నీ రుజువైనట్లు అమెరికాలోని ఫెడరల్ జ్యూరీ తెలిపింది. ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ ఎలిజబెత్ హోమ్స్ ఈ కంపెనీని ఏర్పాటు చేశారు. ఆమెను ఒకప్పుడు సిలికాన్ వ్యాలీ రైజింగ్ స్టార్ అని పిలిచేవారు. 


రమేశ్ బల్వానీ (57) బ్లడ్ టెస్టింగ్ కంపెనీ థెరనోస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌ కూడా. ఆయనపై నమోదైన కుట్ర, వైర్ ఫ్రాడ్ ఆరోపణలు రుజువైనట్లు శాన్ జోస్‌లోని ఫెడరల్ జ్యూరీ గురువారం తీర్పు చెప్పింది. థెరనోస్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినవారిని, రోగులను మోసం చేశారని, కుట్రపూరితంగా వ్యవహరించారని నమోదైన ఆరోపణలు రుజువైనట్లు తెలిపింది. ఈ వివరాలను అమెరికా అటార్నీ స్టెఫానీ హిండ్స్, ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) స్పెషల్ ఏజెంట్ ఇన్‌ఛార్జి సియాన్ రాగన్ ఓ ప్రకటనలో తెలిపారు. 


ఆరు నెలల క్రితం ఇచ్చిన తీర్పులో ఎలిజబెత్ హోమ్స్ కూడా దోషి అని జ్యూరీ తెలిపింది. థెరనోస్‌లో పెట్టుబడి పెట్టినవారిని మోసం చేసినట్లు రుజువైందని పేర్కొంది. రమేష్‌కు విధించే శిక్షపై నిర్ణయం తీసుకోవడానికి తదుపరి విచారణ నవంబరు 15న జరుగుతుందని జడ్జి డవిలా తెలిపారు. ఆయనకు దాదాపు 20 సంవత్సరాలు జైలు శిక్ష, 2,50,000 డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 


Updated Date - 2022-07-08T21:34:17+05:30 IST