పాక్‌ తడబాటు

ABN , First Publish Date - 2020-08-14T08:59:14+05:30 IST

ఓవైపు వర్షంతో అంతరాయం.. మరోవైపు పాకిస్థాన్‌ వికెట్ల పతనం.. ఇదీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆటతీరు. ఆతిథ్య జట్టు పేసర్ల పదునైన బంతులకు బ్యాటింగ్‌ వైఫల్యంతో పాకిస్థాన్‌ తడబడుతోంది...

పాక్‌ తడబాటు

  • తొలి ఇన్నింగ్స్‌ 126/5
  • అబిద్‌ అలీ అర్ధసెంచరీ
  • ఇంగ్లండ్‌తో రెండో టెస్టు

సౌతాంప్టన్‌: ఓవైపు వర్షంతో అంతరాయం.. మరోవైపు పాకిస్థాన్‌ వికెట్ల పతనం.. ఇదీ ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో మొదటి రోజు ఆటతీరు. ఆతిథ్య జట్టు పేసర్ల పదునైన బంతులకు బ్యాటింగ్‌ వైఫల్యంతో పాకిస్థాన్‌ తడబడుతోంది. ఓపెనర్‌ అబిద్‌ అలీ (60) అర్ధసెంచరీతో కాస్త గౌరవప్రదమైన స్కోరైనా సాధించగలిగింది. దీంతో తొలిరోజు గురువారం పాక్‌ 45.4 ఓవర్లలో 5 వికెట్లకు 126 పరుగులు చేసింది. క్రీజులో బాబ ర్‌ ఆజమ్‌ (25 బ్యాటింగ్‌), రిజ్వాన్‌ (4 బ్యాటింగ్‌) ఉన్నారు. ఇక పాక్‌ ఆశలన్నీ ఆజమ్‌పైనే పెట్టుకుంది. ఓవరాల్‌గా మూడుసార్లు వర్షం ఆటంకం కలిగించడంతో సగం ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. అండర్సన్‌కు రెండు వికెట్లు దక్కాయి. పాక్‌ జట్టులో 11 ఏళ్ల తర్వాత ఫవాద్‌ ఆలమ్‌ చోటు దక్కించుకున్నాడు. 2009లో అతను చివరి టెస్టు ఆడాడు. ఇంగ్లండ్‌ టీమ్‌లో స్టోక్స్‌, ఆర్చర్‌ స్థానాల్లో సామ్‌ కర్రాన్‌, క్రాలే వచ్చారు.


కట్టడి చేశారు..

ఉదయం వాతావరణం మెరుగ్గానే కనిపించడంతో టాస్‌ గెలిచిన పాక్‌ బ్యాటింగ్‌ తీసుకోగా ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. ఆకాశం మేఘావృతం కావడంతో ఇంగ్లండ్‌ పేసర్లకు సహకారం లభించింది. దీంతో మూడో ఓవర్‌లోనే ఓపెనర్‌ షాన్‌ మసూద్‌ను అండర్సన్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఈ దశలో పాక్‌కు అబిద్‌ అలీ, కెప్టెన్‌ అజర్‌ అలీ (20) అండగా నిలిచారు. అబిద్‌ అలీ 0, 22 వ్యక్తిగత స్కోరు వద్ద ఇచ్చిన రెండు క్యాచ్‌లను స్లిప్‌లో ఫీల్డర్లు వదిలేశారు. వర్షం కారణంగా పది నిమిషాల ముందుగానే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లాల్సి వచ్చింది. ఓపిగ్గా ఆడుతున్న ఈ జోడీని విరామం తర్వాత కొద్దిసేపటికే అండర్సన్‌ విడదీశాడు. అజర్‌ అలీ ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో బర్న్స్‌ అందుకోవడంతో రెండో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. 34వ ఓవర్‌లో మరోసారి వర్షం కురవడంతో గంటన్నర ఆటకు బ్రేక్‌ పడగా టీ బ్రేక్‌ ఇచ్చారు.


11 ఏళ్లు.. 4 బంతులు..డకౌట్‌

చివరి సెషన్‌లో ఇంగ్లండ్‌ బౌలర్లు సత్తా చూపడంతో పాక్‌ మూడు వికెట్లను కోల్పోయింది. అబిద్‌ అలీ, బాబర్‌ ఆజమ్‌ జోడీ పాక్‌ను భారీ స్కోరు వైపు తీసుకెళతారని భావించినా పేసర్‌ సామ్‌ కర్రాన్‌ కీలక అబిద్‌ అలీ వికెట్‌ తీశాడు. ఆ తర్వాత వరుస ఓవర్లలో పాక్‌ షఫీఖ్‌ (5), ఫవాద్‌ ఆలమ్‌ (0) వికెట్లను కోల్పోయి చిక్కుల్లో పడింది. 11 ఏళ్ల తర్వాత టెస్టుల్లో చోటు దక్కించుకున్న ఫవాద్‌ కేవలం నాలుగు బంతులే ఆడి వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు పాక్‌ వికెట్ల పతనాన్ని అడ్డుకోవడానికా అన్నట్టు వర్షం మూడోసారి అంతరాయం కలిగించగా గంటన్నర వేచిచూసినా ఫలితం లేకపోయింది. దీంతో 30 ఓవర్లకు పైగా ఆట మిగిలి ఉన్నా తొలి రోజు ఆటను ముగించాల్సి వచ్చింది.


Updated Date - 2020-08-14T08:59:14+05:30 IST