ఉగ్రవాదుల్ని మేపుతూ శాంతి పాఠాలా?

ABN , First Publish Date - 2021-10-05T20:03:45+05:30 IST

కశ్మీరు అంశాన్ని మరోసారి ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తిన పాకిస్థాన్‌పై

ఉగ్రవాదుల్ని మేపుతూ శాంతి పాఠాలా?

ఐక్యరాజ్య సమితి : కశ్మీరు అంశాన్ని మరోసారి ఐక్యరాజ్య సమితిలో లేవనెత్తిన పాకిస్థాన్‌పై భారత్ తీవ్రంగా మండిపడింది. పాకిస్థాన్ ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తోందని, ప్రపంచ ఉగ్రవాదానికి కేంద్రంగా ఉంటోందని, ప్రపంచంలో అతి పెద్ద అస్థిరపరిచే శక్తిగా ఉంటోందని నిరూపణ అయిందని, అటువంటి దేశం నుంచి నిర్మాణాత్మక సహకారాన్ని ఆశించడం సాధ్యం కాదని పేర్కొంది. 


ఐక్య రాజ్య సమితికి భారత దేశ శాశ్వత మిషన్‌లో కౌన్సెలర్ ఏ అమర్‌నాథ్ సోమవారం మాట్లాడుతూ, న్యూక్లియర్ మెటీరియల్‌ను, టెక్నాలజీని అక్రమంగా ఎగుమతి చేసే ట్రాక్ రికార్డుగల దేశం నుంచి భారత దేశానికి సలహాలు అవసరం లేదని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేయడానికి పాకిస్థాన్ నైరాశ్యంతో చేసే ప్రయత్నాలను, వివిధ దేశాల వేదికల ప్రాధాన్యాన్ని దుర్వినియోగం చేసే అలవాటును సమష్టిగా ధిక్కరించాలన్నారు. 


భారత్‌పై అనేక నిష్ఫలమైన, నిరాధారమైన ఆరోపణలను పాకిస్థాన్ చేస్తోందన్నారు. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్మూ-కశ్మీరు, లడఖ్ విషయంలో కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తోందని చెప్పారు. ఈ ఆరోపణలపై స్పందించవలసిన అవసరం లేదన్నారు. ఆ అంశాలు భారత దేశ అంతర్గత వ్యవహారాలని స్పష్టం చేశారు. 


ఐక్యరాజ్య సమితికి పాకిస్థాన్ దౌత్యవేత్త మునీర్ అక్రమ్ నిరాయుధీకరణ, అంతర్జాతీయ భద్రత సమస్యలపై చర్చించే సాధారణ సభ ఫస్ట్ కమిటీ సమావేశంలో జమ్మూ-కశ్మీరు అంశాన్ని లేవనెత్తారు.  దీనిపై సమాధానం చెప్పే హక్కును భారత దేశం వినియోగించుకుంది. జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతం గతంలో, వర్తమానంలో, భవిష్యత్తులో భారత దేశ అంతర్బాగమని, విడదీయరాని భాగమని అమర్‌నాథ్ స్పష్టం చేశారు. పాకిస్థాన్ అక్రమ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా భారత దేశంలో భాగమేనని తెలిపారు. తన దురాక్రమణలో ఉన్న అన్ని ప్రాంతాలను తక్షణమే పాకిస్థాన్ ఖాళీ చేయాలన్నారు. పాకిస్థాన్ ప్రభుత్వం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వడం, సహాయపడటం, చురుగ్గా మద్దతివ్వడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు స్పష్టంగా వెల్లడవుతోందని, అటువంటి దేశం అంతర్జాతీయ శాంతి, భద్రతల గురించి చర్చించే ఫస్ట్ కమిటీకి నిర్మాణాత్మకంగా సహకరిస్తుందని ఎవరైనా ఎలా ఆశించగలరని ప్రశ్నించారు. 


భారత దేశం చాలా బాధ్యతాయుతమైన దేశమని, అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం నిర్వహించవలసిన బాధ్యతలకు కట్టుబడి ఉంటుందని చెప్పారు. న్యూక్లియర్ మెటీరియల్‌, టెక్నాలజీలను చట్టవిరుద్ధంగా ఎగుమతి చేసే ట్రాక్ రికార్డుగల దేశం నుంచి తమకు ఎటువంటి సలహాలు అవసరం లేదన్నారు. భారత దేశ ఆయుధాల గురించి పాకిస్థాన్ దౌత్యవేత్త ప్రస్తావించిన నేపథ్యంలో అమర్‌నాథ్ ఈ విధంగా బదులిచ్చారు.


Updated Date - 2021-10-05T20:03:45+05:30 IST