ఐపీఎల్‌ను పాక్ ఆటగాళ్లు బాగా మిస్సవుతున్నారు: అఫ్రిది

ABN , First Publish Date - 2020-09-28T00:18:59+05:30 IST

కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యూఏఈకి షిఫ్టయింది. ఈ నెల 19న ముంబై

ఐపీఎల్‌ను పాక్ ఆటగాళ్లు బాగా మిస్సవుతున్నారు: అఫ్రిది

ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి కారణంగా మార్చిలో జరగాల్సిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) యూఏఈకి షిఫ్టయింది. ఈ నెల 19న ముంబై ఇండియన్స్-చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌తో ప్రారంభమైన టోర్నీ రసవత్తరంగా సాగుతోంది. మ్యాచ్‌లు క్లోజ్‌డ్ డోర్స్ మధ్య సాగుతున్నప్పటికీ టీ20లోని అసలైన మజాను పంచుతున్నాయి. 


2008లో ప్రారంభమైన ఐపీఎల్‌కు ఏటికేడు ఆదరణ పెరుగుతూ వస్తోంది. ప్రపంచంలోనే గొప్ప లీగ్‌గా పేరు సంపాదించుకుంది. ప్రపంచంలోని క్రికెట్ ఆడే దేశాల్లోని క్రికెటర్లు అందరూ ఐపీఎల్‌లో ఒకసారైనా ఆడాలని కలలు కంటున్నారంటే దానికుండే క్రేజ్ ఏపాటిదో అర్ధం చేసుకోవచ్చు. అయితే, పాకిస్థాన్ ఆటగాళ్లకు మాత్రం ఈ అవకాశం లేకుండా పోయింది. ప్రారంభ టోర్నీలో షోయబ్ అక్తర్, ఉమర్ గుల్ వంటి పాక్ ఆటగాళ్లు ఆడినప్పటికీ, 2009 నుంచి భారత-పాక్ మధ్య ఉన్న రాజకీయ కారణాలు, ఉద్రిక్తతల కారణంగా పాక్ ఆటగాళ్లకు చోటు లేకుండా పోయింది.


ఐపీఎల్ తొలి సీజన్‌లో ఆడం గిల్‌క్రిస్ట్ సారథ్యంలోని డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది తాజాగా మాట్లాడుతూ.. ఐపీఎల‌లో ఆడకపోవడం కారణంగా తమ దేశ ఆటగాళ్లు ‘గొప్ప అవకాశాన్ని’ కోల్పోతున్నారని పేర్కొన్నాడు. పాకిస్థాన్‌కు కూడా పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్) పేరుతో ఒకటి ఉన్నప్పటికీ అది పేరుకు మాత్రమే. కాగా, డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన అఫ్రిది 9 వికెట్లు పడగొట్టి 81 పరుగులు చేశాడు. 


‘‘ఐపీఎల్ చాలా పెద్ద బ్రాండ్. అది గొప్ప అవకాశం కూడా. బాబర్ ఆజం కానీ, ఇతర పాక్ ఆటగాళ్లు కానీ ఒత్తిడిని కూడా ఎదుర్కొని గొప్పగా ఆడతారు. డ్రెస్సింగ్ రూమును పంచుకుంటారు. నా అభిప్రాయంలో చెప్పాలంటే.. పాకిస్థాన్ ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడకుండా గొప్ప అవకాశాన్ని కోల్పోతున్నారు’’ అని అఫ్రిది ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు. 


భారత్, పాకిస్థాన్‌లలో క్రికెట్‌ను ఒక మతంలా భావిస్తారని, ఇరు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడంలో క్రికెట్ కీలక పాత్ర పోషిస్తుందని అఫ్రిది ఆశాభావం వ్యక్తం చేశాడు.  


 


Updated Date - 2020-09-28T00:18:59+05:30 IST