24 గంటల్లోగా రాజీనామా చేయండి... ఇమ్రాన్ ఖాన్‌ను డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు...

ABN , First Publish Date - 2022-03-08T22:18:26+05:30 IST

పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని

24 గంటల్లోగా రాజీనామా చేయండి... ఇమ్రాన్ ఖాన్‌ను డిమాండ్ చేసిన ప్రతిపక్షాలు...

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి పదవికి 24 గంటల్లోగా రాజీనామా చేయాలని ఇమ్రాన్ ఖాన్‌ను ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వ  పరిపాలన దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ నిర్వహణ సక్రమంగా లేదని ఆరోపించాయి. 


పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) నేతృత్వంలో ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు మంగళవారం పెద్ద ఎత్తున ప్రదర్శన నిర్వహించారు. ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పరిపాలన అత్యంత దయనీయంగా ఉందని, ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపించారు. పీపీపీ నేత బిలావల్ భుట్టో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రధాన మంత్రి పదవికి రాజీనామా చేయాలని, లేదంటే పార్లమెంటులో అవిశ్వాస  తీర్మానాన్ని ఎదుర్కొనాలని హెచ్చరించారు. 


మరికొందరు ప్రతిపక్ష నేతలు మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు లేదన్నారు. ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయిందని, కరంట్ అకౌంట్ లోటు పెరిగిందని, విదేశీ మారక ద్రవ్యం నిల్వలు క్షీణిస్తున్నాయని ఆరోపించారు. 


ఇమ్రాన్ ఖాన్ 2018లో ప్రధాన మంత్రి పదవిని చేపట్టారు. పాకిస్థాన్ సైన్యం సహకారంతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఆయన ప్రభుత్వానికి సైన్యం మద్దతు ఇవ్వడం లేదని తెలుస్తోంది. కానీ ఈ ఆరోపణలను సైన్యం, ఇమ్రాన్ తోసిపుచ్చారు. 


ప్రతిపక్షాల డిమాండ్లను ఇమ్రాన్ ఖాన్ తోసిపుచ్చారు. పెట్రోలు, డీజిల్ ధరలను, విద్యుత్తు ఛార్జీలను తగ్గించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మానం పెడితే, అందుకు పర్యవసానాలను ఎదుర్కొనవలసి వస్తుందని ప్రతిపక్షాలను హెచ్చరించారు. 


పాకిస్థాన్ పార్లమెంటు సాధారణ ఎన్నికలు 2023లో జరగవలసి ఉంది.


Updated Date - 2022-03-08T22:18:26+05:30 IST