Pakistan లో భయం భయం.. భారత్‌లో పరిస్థితులను చూసి వెన్నులో వణుకు..!

ABN , First Publish Date - 2021-05-25T22:13:42+05:30 IST

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళించేసింది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం మన దేశంలో కనిపిస్తున్నాయంటే నమ్మగలరా?

Pakistan లో భయం భయం.. భారత్‌లో పరిస్థితులను చూసి వెన్నులో వణుకు..!

కరోనా సెకండ్ వేవ్ భారత్‌ను కబళించేసింది. ప్రతిరోజూ రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. ప్రపంచంలో ప్రతిరోజూ నమోదవుతున్న కరోనా కేసుల్లో సగం మన దేశంలో కనిపిస్తున్నాయంటే నమ్మగలరా? ప్రజలు ప్రాణవాయువు లేక గిలగిల్లాడుతుంటే.. వైద్య రంగం మొత్తం అతలాకుతలం అవుతోంది. పేషెంట్లను కాటికి పంపడం తప్పితే ఏమీ చేయలేని స్థితిలో ప్రభుత్వం చేతులు కట్టుకొని నిస్సహాయంగా నిలబడిపోయింది. కరోనా బారిన పడి మరణించిన వారి కుటుంబ సభ్యులకు కన్నీళ్లే మిగిలాయి. స్మశానాల్లో అంత్యక్రియలకు ఖాళీ లేదు. వాటి ముందు అంత్యక్రియల కోసం కట్టిన మృతదేహాల క్యూలకు అంతే లేదు. ప్రపంచం మొత్తం భారత్‌లో పరిస్థితి చూసి వణికిపోతోంది. కరోనా మహమ్మారి ఎంతటి ప్రళయాన్ని సృష్టించగలదో అందరికీ ఈ భయానక దృశ్యం మరోసారి గుర్తుచేసింది.


ఇదంతా వాయువ్య దేశం పాకిస్తాన్ కూడా గమనించి భయంతో గుటకలు మింగుతోంది. అక్కడ కరోనా సెకండ్ వేవ్ కూడా ముగిసింది. కాకపోతే ఈ మహమ్మారి తొలి రెండు వేవ్‌లలో పాక్‌పై జాలి చూపించింది. తొలి వేవ్‌లో చాలా తక్కువ మరణాలు సంభవించాయి. రెండో వేవ్ తీవ్రత పెరిగినా అంత భారీగా నష్టం జరగలేదు. దీంతో చాలా మంది పాక్ నిపుణులు ఇలా జరగడానికి కారణాలు వెతికేశారు. ఉపఖండంలోని దేశాల ప్రజల్లో ఇలాంటి వైరస్‌లు అంత త్వరగా వ్యాప్తి చెందవని, కాబట్టి మూడో వేవ్ గురించి అంత భయం అక్కర్లేదని చెప్పి ఏదో సాధించామని జబ్బలు చరుచుకున్నారు. వారందరికీ భారత్‌లో పరిస్థితులు వీపు పగలగొట్టాయి. చిన్నపాటి నిర్లక్ష్యం ఎంతలి విలయాన్ని సృష్టిస్తుందో తెలిసేలా చేశాయి.


తొలి రెండు కరోనా వేవ్‌ల ప్రభావం తక్కువగా ఉండటంతో పాకిస్తాన్ ప్రజలు కూడా ఈ వైరస్‌ పట్ల భయపడలేదు. పదిమందిలో ఒక్కరే మాస్కు ధరించేవారు. సోషల్ డిస్టెన్సింగ్ మాటేలేదు. కానీ ఇప్పుడు మళ్లీ కరోనా కేసులు పెరగడంతో ప్రజల్లో భయం పట్టుకుంది. ఇక్కడ ఏప్రిల్ 17న 6,127 కరోనా కేసులు నమోదయ్యాయి. గతేడాది జూన్ 20 తర్వాత ఇన్ని కేసులు నమోదవడం పాక్‌లో అదే తొలిసారి. ఇక్కడ టెస్టింగు సదుపాయాలు, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం కావడంతో పాజిటివిటీ రేటు కూడా భారీగా పెరిగింది. ఈ ప్రభావంతో పాకిస్తాన్ ఆస్పత్రులు వేగం పెంచాయి. విషమ పరిస్థితుల్లో ఉన్న కరోనా పేషెంట్లపై ఫోకస్ పెరిగింది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఏప్రిల్ 27న ఇక్కడ రికార్డు స్థాయిలో ఒక్కరోజే 201 మంది కరోనాకు బలయ్యారు. ఒకానొక సందర్భంలో పాకిస్తాన్ తమ దేశంలోని 90శాతం ఆక్సిజన్ సరఫరాను ఉపయోగంలోకి తీసుకొచ్చేసింది.


దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరగడం, పొరుగు దేశంలో కరోనా విపత్తు సమయంలో కూడా పాకిస్తాన్ కఠిన నిర్ణయాలు తీసుకోలేక తడబడింది. దీనికి కారణం రంజాన్ నెల ప్రారంభం. ఇది మతసంబధ అంశం కావడంతో ప్రజలు దీనికి చాలా విలువ ఇస్తారు. వారిని మసీదులకు వెళ్లకుండా అడ్డుకుంటే సమస్య. దీంతో వీరికోసమే లాక్‌డౌన్ నిబంధనలను సడలించింది ప్రభుత్వం. ప్యాండెమిక్ అలసట, జనాభా సాంద్రత, నిబంధనల్లో రంజాన్ సడలింపు, వేగంగా వ్యాపించే వేరియంట్లు, జన్యు సీక్వెన్సింగ్ కొరత, అరుదుగా మారిన వ్యాక్సిన్ ప్రచారం, కరువులో ఉన్న వైద్యరంగం.. ఇవన్నీ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి తలనొప్పులుగా మారాయి. 


రంజాన్ సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా మసీదులకు వెళ్లారు. దేశంలో అప్పటికే ఉన్న కరోనా వేరియంట్లు ఈ గుంపుల వల్ల మరింత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. పాక్‌లో ఇప్పటి వరకూ నమోదైన కరోనా కేసుల్లో 70శాతం యూకే వేరియంట్ (బి117) వల్లే. ఇదేగాక సౌతాఫ్రికా వేరియంట్ (బి13351), బ్రెజిల్ (పి1) మ్యూటెంట్ కూడా పాక్‌లో వెలుగు చూశాయి. ఇంకా భారత్‌లో కనిపించిన (బి1617) పాక్ తలుపు తట్టలేదు. కానీ ఇది చాపకింద నీరులా ఎలా వ్యాపిస్తుందో పాక్ ప్రజల కళ్లకు స్పష్టంగా కనబడుతోంది. ఇక్కడ చాలా తక్కువగా ఉన్న జన్యు సీక్వెన్సింగ్ వల్ల ఏ వేరియంట్ ఎక్కువగా వ్యాపిస్తుందో తెలుసుకోవడం కూడా కష్టమే. గ్లోబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ డేటాబేస్ జీఐఎస్ఏఐడీ వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లో వెలుగు చూసిన సుమారు. 8,70,000 కేసుల్లో కేవలం 0.022శాతమే సీక్వెన్సింగ్ జరిగిందట.


ఈ వైరస్ వేరియంట్లే దేశ భవిష్యత్తును నిర్ణయించే ప్రస్తుత పరిస్థితుల్లో ఈ డేటా కొరత చాలా ప్రమాదకరమని నిపుణులు అంటున్నారు. ఇది కేవలం పాకిస్తాన్ ఒక్కదానితోనే పోదు. మళ్లీ ప్రపంచం మొత్తానికి చుట్టుకుంటుందనేది వారి ఆందోళన. పాక్‌లో వ్యాక్సిన్ సప్లై కూడా నత్తనడకన సాగుతోంది. దీనికి ప్రధాన కారణం భారత్‌లో కరోనా సెకండ్ వేవే. భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తి రంగం చాలా పెద్దది. అయితే స్వదేశంలోని కరోనా ప్రళయంతో పోరాడటం కోసం వ్యాక్సిన్ ఎగుమతులను భారత్ ఆపేసింది. ప్రపంచంలో వ్యాక్సిన్ అన్ని దేశాలకూ అందజేయడం కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేసిన కోవ్యాక్స్ సంస్థకు కూడా భారత్ నుంచి వ్యాక్సిన్లు అందడం లేదు. దీంతో పాకిస్తాన్‌కు వ్యాక్సిన్లు అందడం కరువైంది. అయితే చైనా నుంచి వచ్చిన వ్యాక్సిన్, అలాగే రష్యా స్పుత్నిక్ ఉత్పత్తికి ప్రైవేటు రంగాన్ని పురమాయించి పాక్ కొంత కోలుకుంది.


ఇప్పటి వరకూ పాక్‌లో కేవలం 1శాతం ప్రజలే వ్యాక్సిన్ తీసుకున్నారు. అయితే భారత్‌లో పరిస్థితులను చూసిన పాకిస్తానీలు ఈసారి వ్యాక్సిన్లు తీసుకోవడానికి క్యూలు కడతారని తెలుస్తోంది. తాజాగా చేసిన సర్వేలో 65శాతం ప్రజలు ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తాము వ్యాక్సిన్ తీసుకుంటామని చెప్పారు. అదే సమయంలో భారత్‌లో వచ్చినట్లు గనుక పాక్‌లో కరోనా కేసులు పెరిగితే తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే ఇక్కడ వైద్యరంగంలో పెట్టుబడులు, కేటాయింపులు అత్యల్పం. దేశ జీడీపీలో కేవలం 0.7శాతమే వైద్యరంగానికి కేటాయించారు. ఇప్పటికే లాహోర్, ఇస్లామాబాద్ వంటి ప్రాంతాల్లో ఆస్పత్రులు నిండిపోయాయి. భారత్‌లో జరుగుతున్న విలయంలో ఎంతో కొంత శాతం పాక్‌లో జరిగినా ఆ దేశ వైద్య వ్యవస్థ కుప్పకూలుతుందని నిపుణులు అంటున్నారు.


గడిచిన ఏడాదిలో కరోనా విషయంలో పాకిస్తాన్ తీసుకున్న తప్పుడు నిర్ణయాలు కొత్తవేమీ కావు. ఇంకా చెప్పాలంటే ప్రపంచంలో కరోనాను తక్కువ అంచనా వేసిన దేశాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నాయో పాక్ కూడా సేమ్ టు సేమ్ అవే నిర్ణయాలు తీసుకుంది. కానీ కరోనా మాత్రం ఇలా తనను తక్కువ అంచనా వేసిన దేశాలన్నింటినీ తొక్కిపడేసింది. అందుకే ఇప్పుడు పాక్ మేలుకుంటోంది. నిపుణుల మాటలు వింటోంది. చేయాల్సిన పనులు చేస్తోంది. ప్రస్తుతం ప్రపంచం ఫోకస్ మొత్తం భారత్‌పైనే ఉంది. కానీ ఈ విషయంలో పాకిస్తాన్ ఏం చేస్తుందనేది కూడా అంతర్జాతీయంగా ముఖ్యమైన అంశమే. భారత్‌తో పోల్చుకుంటే ఆర్థికంగా, ప్రణాళికా పరంగా పాక్ వెనుకబడి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా కనుక తన చూపు పాక్‌పై పెడితే ఆ దేశం అతలాకుతలం కావడం ఖాయమని కొందరు వాదిస్తున్నారు. దానికి తోడు భారత్‌కు సాయం చేయడానికి చాలా దేశాలు ముందుకొచ్చాయి. మరి పాకిస్తాన్‌కు అండగా ఎన్ని దేశాలు ఉంటాయి? అనేది ప్రశ్న. 


ఉగ్రవాదులతో సంబంధాల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా పాక్‌పై వ్యతిరేకత కొద్దోగొప్పో ఉంది. ఇది కూడా పాక్‌కు పెద్ద సమస్యే. అయితే పాకిస్తానీలు మాత్రం.. ‘‘పాక్‌ను కూడా ప్రపంచం పట్టించుకోవాలి. ఎందుకంటే ఈ భయంకరమైన వ్యాధి నుంచి అందరూ తప్పించుకునే వరకూ ఎవరూ భద్రంగా ఉన్నట్లు కాదు’’ అని అంటున్నారు. మరి భారత్‌ను చూసి పాక్ ఏమైనా నేర్చుకుంటుందా? లేక కరోనా కాటుకు బలై విలవిల్లాడుతుందా? అనేది తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే.

Updated Date - 2021-05-25T22:13:42+05:30 IST