క్రికెట్లోలా చివరి బంతి వరకు పోరాటం సాగిస్తా
స్పష్టం చేసిన పాక్ ప్రధాని ఇమ్రాన్
కూలదోయడానికి అమెరికా కుట్ర అని టంగ్ స్లిప్
గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగం
అవిశ్వాస తీర్మానంపై 3న పార్లమెంటులో ఓటింగ్
చర్చ లేకుండానే గురువారం పార్లమెంటు వాయిదా
ఇస్లామాబాద్, మార్చి 31: మెజారిటీ కోల్పోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా.. పదవి నుంచి దిగిపోయేది లేదని తేల్చి చెప్పారు పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. ‘‘క్రికెట్లో నేను చివరి బంతి వరకు పోరాడా.. ఇక్కడా అంతే పోరాడతా’’ అని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆదివారం జరిగే ఓటింగ్‌ను ఎదుర్కొంటానని అన్నారు. దేశం ఎక్కడికి వెళ్లాలో అదే నిర్దేశిస్తుందని వ్యాఖ్యానించారు. కాగా, ఇమ్రాన్ ప్రభుత్వం మీద ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ లేకుండానే పాక్ పార్లమెంటు గురువారం అర్ధంతరంగా వాయిదాపడింది.
సభ్యులు వెంటనే ఓటింగ్‌కు పట్టుబట్టినా.. డిప్యూటీ స్పీకర్ అదేమీ పట్టించుకోకుండా సభను వాయిదా వేశారు. ఆదివారం ఓటింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ క్రమంలో ఇమ్రాన్ గురువారం రాత్రి దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. తన వ్యతిరేకులే పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రెబల్ ఎంపీలను ద్రోహులుగా అభవర్ణించడమే కాక డబ్బు కోసం అమ్ముడుపోవద్దంటూ మండిపడ్డారు. కుట్రకు వ్యతిరేకంగా పోరాడతానని.. వారిని గెలవనీయనని శపథం చేశారు. భారత్, అమెరికాలో తనకు చాలామంది మిత్రులు ఉన్నారని.. కశ్మీర్ స్వయం ప్రతిపత్తికి ఉద్దేశించిన ఆర్టికిల్ 370 రద్దు సమయంలో భారత్‌తో వివాదం తలెత్తిందని గుర్తు చేశారు.
అమెరికా కుట్రంటూ నోరుజారి..
తన స్వతంత్ర విదేశాంగ విధానం నచ్చని విదేశీ శక్తులు ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపణలు చేస్తున్న ఇమ్రాన్.. గురువారం ప్రసంగం సందర్భంగా నోరు జారి ఆ శక్తి ‘‘అమెరికా’’ అని అన్నారు. ఈ విదేశీ శక్తులతో ప్రతిపక్షాలు టచ్‌లో ఉన్నాయని ఆరోపించారు. ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఓ దేశం కుట్రపన్నినట్టు విదేశాంగ వర్గాలు సమాచారం ఇచ్చాయని ఇమ్రాన్ ఆదివారం నాటి ర్యాలీలో అన్నారు. కాగా, ఇమ్రాన్ వ్యాఖ్యలపై అమెరికా స్పందించింది. తమ ప్రభుత్వ సంస్థలు కానీ, అధికారులు కానీ పాకిస్థాన్‌కు ఎలాంటి లేఖలూ రాయలేదని పేర్కొంది. తమకు ‘బెదిరింపు లేఖ పంపిన దేశానికి’ గట్టిగా సమాధానం చెబుతామని పాకిస్థాన్ జాతీయ భద్రతా కమిటీ గురువారం పేర్కొంది. అయితే దేశం పేరును ప్రస్తావించలేదు.
తదుపరి ప్రధాని షాబాజ్ షరీఫ్!
అవిశ్వాస తీర్మానం నెగ్గి ఇమ్రాన్ దిగిపోతే.. తదుపరి ప్రధానిగా పాకిస్థాన్ ముస్లిం లీగ్ (పీఎంఎల్-ఎన్) అధినేత, ప్రతిపక్ష నేత షాబాజ్ షరీఫ్ (70) ఎన్నిక కానున్నట్లు తెలుస్తోంది. మాజీ ప్రధాని నవాజ్ సోదరుడీయన.