గవాస్కర్‌ సలహా పాటించడం వల్లే ఇలా: ఇంజమామ్

ABN , First Publish Date - 2020-07-13T21:47:14+05:30 IST

భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఓ సామెత. అది క్రికెట్‌లో మరింతగా...

గవాస్కర్‌ సలహా పాటించడం వల్లే ఇలా: ఇంజమామ్

ఇస్లామాబాద్: భారత్-పాకిస్తాన్ మధ్య ఎప్పుడూ పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని ఓ సామెత. అది క్రికెట్‌లో మరింతగా ఉంటుంది. ముఖ్యంగా అభిమానుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ అంటే చాలు అదో మినీ యుద్ధంలా ఫీల్ అయిపోతారు. ఇక ఆటగాళ్లు కూడా ఒకరిపై మరొకరు అప్పుడప్పుడూ ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి తరుణంలో పాక్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్‌హక్ భారత లెజెండ్ గవాస్కర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. బ్యాటింగ్‌లో గవాస్కర్ సలహా పాటించడం వల్లే తన కెరీర్ మలుపు తిరిగిందని చెప్పుకొచ్చాడు. ఇటీవల తన యూట్యూబ్ చానల్‌లో పోస్ట్ చేసిన ఓ వీడియో ద్వారా ఇంజమామ్ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ సిరీస్‌లో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, గవాస్కర్ సలహాతో వాటిని ఎలా అధిగమించింది వివరించాడు. ‘ఆస్ట్రేలియాలో జరిగిన 1992 ప్రపంచ కప్‌లో అంతకుముందే విజయ పతాకం ఎగురవేశాం. తరువాత మొదటి సారిగా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లాను.


అక్కడి పరిస్థితులు నాకు అసలు తెలియదు. దాంతో షార్ట్ పిచ్‌ బంతులు ఎదుర్కోవడం చాలా కష్టతరమైంది. అయితే అప్పటికి ఏదో చారిటీ మ్యాచ్‌ కోసం గవాస్కర్ ఇంగ్లాండ్‌లో ఉన్నారు. ఆ మ్యాచ్‌లో నేను కూడా ఆడాల్సిఉంది. అలా ఆయనను కలిశాను. వెంటనే నా ఇబ్బందిని వివరించాను. వెంటనే ఆయన షార్ట్ పిచ్ బంతుల గురించి ఆలోచించడం, భయపడడం మానేయమని చెప్పారు. బౌలర్ బంతి వేయగానే ఆ బంతి ఏలాంటిదో అర్థమైపోతుందని, అందువల్ల బౌలర్ బంతిని వదిలే వరకు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోమని చెప్పారు.


అదే తరహాలో నెట్స్‌లో ప్రాక్టీస్ చేశాను. దాంతో ఆ తరువాత షార్ట్ బంతులను ఎదుర్కోవడం సులభతరమైంది. ఆ ఒక్క సలహా నా కెరీర్‌కు కూడా ఎంతగానో ఉపయోగపడింది’ అని ఇంజమామ్ చెప్పుకొచ్చారు. అంతేకాకుండా గవాస్కర్ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు తాను లైవ్‌లో చూసి ఉండాల్సిందని, అలా చూడలేకపోవడం తన దురదృష్టమని ఇంజమామ్ చెప్పారు.

Updated Date - 2020-07-13T21:47:14+05:30 IST