తాలిబన్లకు మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలం

ABN , First Publish Date - 2021-09-29T22:56:06+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు

తాలిబన్లకు మద్దతు కూడగట్టడంలో పాక్ విఫలం

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్‌లో ఏర్పాటైన తాలిబన్ల ప్రభుత్వానికి అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాకిస్థాన్ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇస్లామిక్ ఎమిరేట్ ఆఫ్ ఆఫ్ఘనిస్థాన్‌కు గుర్తింపు సాధించేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్నప్పటికీ, ఐక్యరాజ్య సమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో ప్రసంగించేందుకు తాలిబన్ ప్రతినిధికి అనుమతి లభించలేదు. పదవీచ్యుతుడైన అష్రఫ్ ఘనీ ప్రభుత్వ ప్రతినిధిని యూఎన్‌జీఏ ఆహ్వానించింది. 


ఈ పరిణామాల నేపథ్యంలో ఆఫ్ఘన్‌లో తాలిబన్ ప్రభుత్వానికి సమీప భవిష్యత్తులో ఇతర దేశాల మద్దతు లభించే అవకాశం కనిపించడం లేదు. ఆఫ్ఘన్ తాలిబన్లకు మద్దతుగా పాకిస్థాన్ దూకుడుగా ప్రచారం చేసింది. దీంతో యూరోపు, అమెరికాలలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. మరోవైపు ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వంపై పాకిస్థాన్ ప్రతిపక్షాలు కూడా మండిపడుతున్నాయి. పాకిస్థాన్ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. తాలిబన్లపై వైఖరి కారణంగా అమెరికా నుంచి సాయం అందే అవకాశాలు తగ్గుతాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. 


అయితే విశ్లేషకుల అంచనా ప్రకారం, చైనా మీద మితిమీరిన నమ్మకంతోనే అమెరికాకు వ్యతిరేకంగా పాకిస్థాన్ ప్రవర్తిస్తోంది. దీంతో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ తల్చుకుంటే పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకు రుణాలు లభించడం కష్టమవుతుంది. 


Updated Date - 2021-09-29T22:56:06+05:30 IST