గిల్గిట్-బాల్టిస్థాన్‌ హోదా మార్చే అధికారం పాక్‌కు లేదు : భారత్

ABN , First Publish Date - 2020-09-25T02:30:11+05:30 IST

పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఆ దేశంలో ఐదో ప్రావిన్స్‌గా మార్చేందుకు చట్టపరమైన ఆధారం ఏదీ ఆ దేశానికి లేదని భారత దేశం స్పష్టం చేసింది.

గిల్గిట్-బాల్టిస్థాన్‌ హోదా మార్చే అధికారం పాక్‌కు లేదు : భారత్

న్యూఢిల్లీ : పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులోని గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఆ దేశంలో ఐదో ప్రావిన్స్‌గా మార్చేందుకు చట్టపరమైన ఆధారం ఏదీ ఆ దేశానికి లేదని భారత దేశం స్పష్టం చేసింది. అటువంటి చర్య ఏదైనా ప్రారంభంలోనే చెల్లనిదవుతుందని పేర్కొంది. 


భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిథి అనురాగ్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, సైనిక బలంతో ఆక్రమించుకున్న గిల్గిట్-బాల్టిస్థాన్‌ హోదాను మార్చేందుకు అవసరమైన చట్టపరమైన ప్రాతిపదిక ఏదీ పాకిస్థాన్‌కు లేదని చెప్పారు. అటువంటి చర్య ప్రారంభంలోనే చెల్లనిదవుతుందన్నారు. 


జమ్మూ-కశ్మీరు, లడఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లోని అన్ని భూభాగాలు భారత దేశంలో అంతర్భాగాలేనని చెప్పారు. ఇవి భారత దేశంలో అంతర్భాగాలుగానే ఉంటాయని చెప్పారు. భారత దేశ అంతర్గత వ్యవహారాలపై వ్యాఖ్యలు చేసే స్థానిక అధికార పరిథి పాకిస్థాన్‌కు లేదన్నారు. 


అసెంబ్లీ ఎన్నికలు జరుపుతామంటున్న పాక్ 

గిల్గిట్-బాల్టిస్థాన్‌ను ఐదో ప్రావిన్స్‌గా చేసేందుకు పాకిస్థాన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాకిస్థాన్‌లో పంజాబ్, బలూచిస్థాన్, ఖైబర్ పష్తూన్‌క్వా, సింధ్ అనే నాలుగు ప్రావిన్స్‌లు ఉన్నాయి. గిల్గిట్-బాల్టిస్థాన్‌ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎన్నికలు  నవంబరు 15న జరుగుతాయని ప్రకటించింది. 


Updated Date - 2020-09-25T02:30:11+05:30 IST