Advertisement
Advertisement
Abn logo
Advertisement

Pakistan: కివీస్ పర్యటన రద్దు వెనక ‘బోల్ నా ఆంటీ’ సింగర్: పాక్ మంత్రి ఆరోపణ

ఇస్లామాబాద్: ఏళ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ జట్టు మరికాసేపట్లో తొలి వన్డే ప్రారంభమవుతుందనగా భద్రతాపరమైన కారణాలతో సిరీస్‌ను రద్దు చేసుకుంది. కివీస్ నిర్ణయం క్రికెట్ ప్రపంచంలో సంచలనమైంది. మరీ ముఖ్యంగా పాకిస్థాన్‌ షాక్‌లోకి వెళ్లిపోయింది.


ఇప్పటికే సంక్షోభంలో కూరుకుపోయిన పాక్ క్రికెట్‌కు కివీస్ నిర్ణయం గోరుచుట్టుపై రోకలిపోటులా తయారైంది. అయితే, ఈ మొత్తం వ్యవహారం వెనక భారత్ ఉందంటూ పాకిస్థాన్ సమాచార, ప్రసారశాఖ మంత్రి పవాద్ చౌదరి తాజాగా ఆరోపించారు. బుధవారం నిర్వహించి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. తెహ్రీక్-ఐ-తాలిబాన్ పాకిస్థాన్’ అనే ఉగ్రవాద సంస్థ నకిలీ ఖాతా నుంచి కివీస్ జట్టుకు బెదిరింపు ఈ-మెయిల్ వెళ్లినట్టు ఆరోపించారు.


ఈ బెదిరింపు వ్యవహారంలో ఓం ప్రకాశ్ మిశ్రా అనే వ్యక్తి ఉన్నాడని, ఇదంతా ఇండియా వేదికగా జరిగిందని మంత్రి ఆరోపించారు. ‘‘ఈ పేరు మీకు తెలిసినట్టుగా అనిపిస్తోంది కదూ.. అవును, ‘బోల్ నా ఆంటీ అవూ క్యా’ అనే పాటతో మిశ్రా సోషల్ మీడియా సెన్షేషన్ అయ్యాడు’’ అని పేర్కొన్నారు.


మంత్రి ఆ మాట అన్నారో లేదో ట్విట్టర్ యూజర్లు విరుచుకుపడ్డారు. మీమ్స్‌తో ట్విట్టర్‌ను హోరెత్తించారు. దీంతో  #OmPrakshMishra అనే హ్యాష్‌టాగ్ ట్రెండింగ్ అయింది. పాక్ మంత్రి పేర్కొన్న ఓం ప్రకాశ్ మిశ్రా ముంబైకి చెందిన యూట్యూబర్. ర్యాప్ సాంగ్ ‘బోల్ నా ఆంటీ ఆవూ క్యా’తో 2017లో సోషల్ మీడియా సెన్షేషన్‌గా మారాడు. అలాంటి ఓ యూట్యూబ్ స్టార్‌ను పట్టుకుని న్యూజిలాండ్ జట్టు పర్యటన రద్దు వెనక ఉన్నాడని హాస్యాస్పద ఆరోపణలు చేయడం తగదంటూ నవ్వు తెప్పించే మీమ్స్‌తో పాక్ మంత్రిని నెటిజన్లు ఎండగడుతున్నారు.

Advertisement
Advertisement