పాక్‌లో చైనీయులపై పెరుగుతున్న దాడులు

ABN , First Publish Date - 2022-03-22T22:21:55+05:30 IST

పాకిస్తాన్‌లో ఉంటున్న చైనీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. చైనీయులు పాక్‌లో ఆధిపత్యం చెలాయించడంతోపాటు, దూకుడుగా వ్యవహరిస్తుండటంతో స్థానికులు తట్టుకోలేకపోతున్నారు.

పాక్‌లో చైనీయులపై పెరుగుతున్న దాడులు

పాకిస్తాన్‌లో ఉంటున్న చైనీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. చైనీయులు పాక్‌లో ఆధిపత్యం చెలాయించడంతోపాటు, దూకుడుగా వ్యవహరిస్తుండటంతో స్థానికులు తట్టుకోలేకపోతున్నారు. దీంతో చాలా సందర్భాల్లో చైనీయులపై పాకిస్తానీలు దాడులకు దిగుతున్నారు. కొన్ని సందర్భాల్లో చైనీయులు మరణిస్తున్నారు. ఒకపక్క అనేక విషయాల్లో పాక్‌కు చైనా సహకరిస్తుంటే, మరోపక్క పాక్ ప్రజల్లో చైనీయులపై అసహనం పెరిగిపోతోంది. దశాబ్ద కాలంగా చైనీయులపై దాడులు ఎక్కువైనట్లు అక్కడి నివేదికలు చెబుతున్నాయి. పాక్‌లో చైనా అనేక ప్రాజెక్టులు చేపడుతోంది. చైనా-పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్‌తోపాటు, రోడ్లు, భవనాలు, బ్రిడ్జిల నిర్మాణం చేపడుతోంది చైనా. అయితే, ఈ నిర్మాణాల్లో ఎక్కువగా చైనీయులే పనిచేస్తున్నారు. గత డిసెంబర్‌లో కరాచీలోని ఒక చైనీస్ నిర్మాణ కంపెనీలో పనిచేస్తున్న చైనా సిబ్బందిపై పాక్‌కు చెందిన గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారు. గత జూలైలో పాకిస్తానీలు బస్సుపై జరిపిన ఒక దాడిలో దాదాపు తొమ్మిది మంది ఇంజనీర్లు మరణించారు. పాక్‌లో ఉంటున్న చైనీయుల వైఖరే ఇందుకు కారణమని తెలుస్తోంది. చైనీయులు పాక్‌లోని వనరులను దోచుకోవడంతోపాటు, వాళ్ల ఉద్యోగాలను లాక్కోవడంతో పాకిస్తానీలు తిరగబడుతున్నారు. చైనా వ్యతిరేక సెంటిమెంట్ కూడా బలపడుతోంది. ప్రధానంగా కరాచీతోపాటు సింధ్ ప్రాంతం, బెలూచిస్తాన్‌లోనూ ప్రజలు చైనీయులపై తిరగబడుతున్నారు.

Updated Date - 2022-03-22T22:21:55+05:30 IST