పాక్‌ ప్రహసనం

ABN , First Publish Date - 2022-06-29T06:09:12+05:30 IST

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సాజిద్ మజీద్ మీర్‌ను పాకిస్థాన్ న్యాయస్థానం ఒకటి ఇటీవల విచారించి, శిక్షవిధించి, జైలుకు పంపించిందని అక్కడి పత్రికల ద్వారా తెలిసి...

పాక్‌ ప్రహసనం

ముంబై ఉగ్రదాడుల సూత్రధారి, లష్కరే తోయిబా డిప్యూటీ చీఫ్ సాజిద్ మజీద్ మీర్‌ను పాకిస్థాన్ న్యాయస్థానం ఒకటి ఇటీవల విచారించి, శిక్షవిధించి, జైలుకు పంపించిందని అక్కడి పత్రికల ద్వారా తెలిసి మిగతా ప్రపంచం ఎంతో ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం ఎందుకంటే, సదరు ఉగ్రనాయకుడు తమ వద్ద లేడని, ఎప్పుడో మరణించాడని పాకిస్థాన్ ప్రభుత్వం గత ఏడాది డిసెంబరులోనే చెప్పింది కనుక. అలా చెప్పినవారే అతడిని ఎక్కడనుంచో బయటకు తెచ్చి మొన్న ఏప్రిల్ 21న అరెస్టు చేశారు. ఇంతకంటే ఆశ్చర్యం కలిగించే అంశమేమంటే, అరెస్టయిన మూడువారాల్లోనే అతడిపై విచారణ పూర్తికావడం. మే 16న ఉగ్రవాద వ్యతిరేక న్యాయస్థానం మూడుఅంశాల్లో అతడిని దోషిగా నిర్ధారించడంతో లాహోర్‌లోని కోట్ లఖ్‌పత్ జైలుకు తరలించారు. అక్కడ ఈ ఉగ్రవాది మొత్తం పదిహేను సంవత్సరాల ఆర్నెల్లు శిక్ష అనుభవించబోతున్నాడు. ఊహకు అందనంత వేగంగా ఈ వ్యవహారం జరిగిపోవడానికి ప్రధానకారణం మరో మూడురోజుల్లో అంటే, మే 19న అమెరికా పాకిస్థాన్ విదేశాంగమంత్రుల సమావేశం ఒకటి జరగబోతూండటం, మరో నెలలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్‌ఏటీఎఫ్) ప్లీనరీలో పాకిస్థాన్ తన సచ్ఛీలతను రుజువుచేసుకోవాల్సిన అవసరం ఉండటం. మే 19 సమావేశంలో మీర్ మీద వేటువేసిన విషయాన్ని పాకిస్థాన్ అమెరికాకు చూపుకుంది. గ్రేలిస్టునుంచి బయటపడవేసేందుకు సహకరించమని విజ్ఞప్తి చేసింది. ఈ వ్యూహం, వేగం ఫలితాన్నిచ్చాయి. ఉగ్రవాద నిరోధక చర్యలు తీసుకోవడంలోనూ, వ్యక్తులను శిక్షించడంలోనూ పాక్ చక్కని కృషిచేసిందనీ, ముప్పైనాలుగు పాయింట్ల యాక్షన్ లిస్టును పూర్తిచేసిందని జూన్ 17న ఎఫ్ఏటీఎఫ్ ప్రశంసించింది. అప్పటికే, అమెరికా తన మిత్రదేశాలను కూడా ఒప్పించి, అంతా కలసి పాకిస్థాన్‌ను గ్రే లిస్టునుంచి బయటపడవేయాలని కూడా నిర్ణయించుకున్నాయి. ఆగస్టులో నామమాత్ర క్షేత్రస్థాయి తనిఖీలతో ఇది పూర్తవుతుందని అంటున్నారు.


166మందిని బలితీసుకున్న ముంబైదాడుల పథకరచనలో, శిక్షణలో సాజిద్ పాత్ర కీలమైనది. అజ్మల్ కసబ్, డేవిడ్ హాడ్లీ వంటివారిని నియమించి, పనులు అప్పగించి, మూడురోజుల పాటు ముంబైని గుప్పిట్లో పెట్టుకున్న దశలో కూడా ఏం చేయాలో, ఎవరిపై కాల్పులు జరపాలో ఎప్పటికప్పుడు ఆదేశిస్తూ వచ్చినవాడు మీర్. కానీ, ఈ దారుణ మారణకాండకు సంబంధించి అతడిమీద ఇంకా ఏ విచారణలూ లేవు. పాకిస్థాన్ ఈ మాత్రమైనా స్పందించడానికి కారణం అనేక అంతర్జాతీయ ఉగ్రవాదచర్యలతో అతడికి సంబంధం ఉండటమే. ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ లిస్టులో ఐదుమిలియన్ డాలర్ల రేటు పలుకుతున్నాడు. భద్రతామండలి ప్రకటించిన ఉగ్రవాదుల జాబితాలో మీర్ పేరులేనందున ఇదంతా ఎఫ్ఏటీఎఫ్ కంటే ప్రధానంగా అమెరికానూ ఇతర పాశ్చాత్యదేశాలనూ సంతృప్తిపరచడానికేనని భావించాలి. ప్రవక్తను అవమానించిన కార్టూన్లు వేసిన డానిష్ న్యూస్ పేపర్ మీదా, ఆస్ట్రేలియా మిలటరీ స్థావరాలపైనా దాడులు చేయడంతో పాటు, ఫ్రాన్సులోనూ, అమెరికాలోనూ ఉగ్రకార్యకలాపాల నిమిత్తం నియామకాలు చేపట్టిన ఆరోపణలు ఇతడిమీద ఉన్నాయి. 2011 నుంచి పాకిస్థాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటలిజెన్స్ (ఐఎస్ఐ) అధీనంలోనే మీర్ ఉన్నప్పటికీ ఆచూకీ తెలియదని బుకాయిస్తూ వచ్చిన పాకిస్థాన్ చివరకు అతడు మరణించాడని కూడా ప్రకటించడం విచిత్రం.


ఎఫ్ఏటీఎఫ్ గ్రేలిస్టు కారణంగా నాలుగేళ్ళుగా దేశం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నందున పాకిస్థాన్ తన వైఖరిని కాస్తంత సడలించుకున్నట్టు అనిపిస్తోంది. కనీసం పాశ్చాత్యదేశాలను సంతృప్తిపరచడానికైనా అది ఉగ్రవాదం మీద పోరాడుతున్నట్టు కనిపించవలసి వస్తున్నది. ఓసారి జాబితానుంచి బయటపడిన తరువాత అది మళ్ళీ జూలు విదల్చే అవకాశాలు లేకపోలేదు. అందువల్ల, ముంబై దాడుల కేసులో విచారణ ఎదుర్కొనేందుకు మీర్‌ను అప్పగించాల్సిందిగా భారతదేశం పాకిస్థాన్‌పై ఒత్తిడి తేవాలని కొందరు సూచిస్తున్నారు. ఇది అంత సులువుగా సాధ్యపడదు కనుక, అమెరికా సహా పలు దేశాల నుంచి, అంతర్జాతీయంగానూ ఒత్తిడి రావాలన్నది ఆలోచన. ముంబై దాడుల కారకులెవ్వరినీ వదిలేదిలేదన్న విస్పష్టమైన సందేశం పాకిస్థాన్ గ్రేలిస్టు నుంచి బయటపడేలోగా యావత్ ప్రపంచానికి చేరడం అవసరం.

Updated Date - 2022-06-29T06:09:12+05:30 IST