పాక్‌.. అదే జోరు

ABN , First Publish Date - 2021-10-27T07:23:42+05:30 IST

టీ20 ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌ దూసుకెళుతోంది. వరుసగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లను మట్టికరిపిస్తూ టైటిల్‌ కోసం తామెంత కసిగా ఉన్నామో.......

పాక్‌.. అదే జోరు

టీ20 ప్రపంచక్‌పలో పాకిస్థాన్‌ దూసుకెళుతోంది. వరుసగా భారత్‌, న్యూజిలాండ్‌ జట్లను మట్టికరిపిస్తూ టైటిల్‌ కోసం తామెంత కసిగా ఉన్నామో ప్రత్యర్థి జట్లకు చాటి చెబుతోంది. ఇటీవల పాక్‌ పర్యటనలో సరిగ్గా సిరీస్‌ ఆరంభానికి ముందే  భద్రతా కారణాలరీత్యా వైదొలిగిన కివీ్‌సపై ఈ విజయంతో బాబర్‌ సేన బదులుతీర్చుకున్నట్టయింది.


షార్జా: సరికొత్తగా కనిపిస్తున్న పాకిస్థాన్‌ జట్టు నుంచి మరో అద్భుత ప్రదర్శన. పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ (4/22) నిప్పులు చెరిగే బంతులతో కివీ్‌సను స్వల్ప స్కోరుకే కట్టడి చేయగా.. ఈసారి టాపార్డర్‌ తడబడింది. అయితే ఉత్కంఠను అధిగమిస్తూ ఆఖర్లో ఆసిఫ్‌ అలీ (12 బంతుల్లో 1 ఫోర్‌, 3 సిక్సర్లతో 27 నాటౌట్‌), షోయబ్‌ మాలిక్‌ (20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 26 నాటౌట్‌) జట్టును ఆదుకున్నారు. ఫలితంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో పాక్‌ 5 వికెట్ల తేడాతో నెగ్గింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 134 పరుగులు చేసింది. మిచెల్‌ (27), కాన్వే (27) టాప్‌ స్కోరర్లు. ఆ తర్వాత ఛేదనలో పాక్‌ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 135 పరుగులు చేసి గెలిచింది. రిజ్వాన్‌ (33) ఫర్వాలేదనిపించాడు. సోధికి రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా రౌఫ్‌ నిలిచాడు.


చివర్లో ఉత్కంఠ రేగినా..: స్వల్ప ఛేదనలో పాక్‌ ఇన్నింగ్స్‌ జోరుగా సాగుతుందనుకున్నా కివీస్‌ బౌలర్లు అంత సులువుగా లొంగలేదు. పవర్‌ప్లేలో 30 పరుగులే ఇచ్చి కెప్టెన్‌ బాబర్‌ (9) వికెట్‌ను పడగొట్టింది. ఇది సౌథీకి అంతర్జాతీయ టీ20ల్లో వందో వికెట్‌ కావడం విశేషం. ఆ తర్వాత కూడా పాక్‌ బ్యాటర్స్‌ స్వేచ్ఛగా ఆడలేకపోయారు. రిజ్వాన్‌ క్రీజులో ఉన్నా భారీ షాట్లకు వెళ్లలేదు. మరోవైపు స్పిన్నర్‌ సోధి తన వరుస ఓవర్లలో ఫఖర్‌ జమాన్‌ (11), రిజ్వాన్‌ను అవుట్‌ చేశాడు. అంతకుముందు 11వ ఓవర్‌లో హఫీజ్‌ (11) లాంగా్‌ఫలో ఆడిన బంతిని కాన్వే తక్కువ ఎత్తులో  ఎడమ వైపు డైవ్‌ చేస్తూ సూపర్‌ క్యాచ్‌ అందుకోవడం అబ్బురపరిచింది. ఇమాద్‌ (11) తక్కువ స్కోరుకే వెనుదిరగడంతో పాక్‌పై మరింత ఒత్తిడి పెరిగింది. ఈ దశలో వెటరన్‌ షోయబ్‌ ఆచితూచి ఆడాడు. అయితే 24 బంతుల్లో 37 పరుగులు కావాల్సిన దశలో ఆసిఫ్‌ అలీ రెండు వరుస సిక్సర్లు బాది మ్యాచ్‌ను మలుపు తిప్పాడు. అటు షోయబ్‌ కూడా 18వ ఓవర్‌లో 4,6 బాదడంతో పాక్‌ విజయానికి ఢోకా లేకుండా పోయింది.


రౌఫ్‌ జోరు.. కివీస్‌ తడబాటు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీ్‌సపై పాక్‌ బౌలర్లు ఆధిపత్యం చూపారు. ముఖ్యంగా పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ కెరీర్‌ బెస్ట్‌ బౌలింగ్‌తో చెలరేగాడు. అటు వేగంగా ఆడే క్రమంలో కివీస్‌ బ్యాటర్స్‌ దారుణంగా తడబడ్డారు. ఇక తొలి ఓవర్‌నే పేసర్‌ షహీన్‌ ఇన్‌స్వింగ్‌, యార్కర్లతో బెదరగొట్టి మెయిడెన్‌గా వేశాడు. అయితే ఐదో ఓవర్‌లో ఓపెనర్లు మిచెల్‌ (27) సిక్సర్‌, గప్టిల్‌ (17) ఫోర్‌తో 15 పరుగులు రాబట్టడంతో పవర్‌ప్లేలో 42 పరుగులతో ఫర్వాలేనిపించింది. కానీ ఆరో ఓవర్‌ రెండో బంతికే గప్టిల్‌ రూపంలో తొలి వికెట్‌ కోల్పోవాల్సి వచ్చింది. అలాగే భారీ సిక్సర్‌తో జోరు మీద కనిపించిన మిచెల్‌ను ఇమాద్‌.. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు వచ్చిన నీషమ్‌ (1)ను హఫీజ్‌ స్వల్ప వ్యవధిలోనే అవుట్‌ చేయడంతో కివీస్‌ 53/3 స్కోరుతో కష్టాల్లో పడింది. ఈ దశలో హిట్టర్‌ కాన్వే 13వ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లు సాధించడంతో ఇన్నింగ్స్‌ కుదురుకున్నట్టే కనిపించింది. అయితే తర్వాతి ఓవర్‌లో లేని రన్‌ కోసం వెళ్లిన కెప్టెన్‌ విలియమ్సన్‌ (25) రనౌట్‌ అయ్యాడు. అటు బౌలర్లు కూడా పట్టు బిగించడంతో మరో ఫోర్‌ కోసం మూడు ఓవర్లు ఆగాల్సి వచ్చింది. ఇక చివర్లోనైనా వేగం పెంచుతారనుకుంటే 18వ ఓవర్‌లో మూడు పరుగులే ఇచ్చి కాన్వే (27), ఫిలిప్స్‌ (13)లను రౌఫ్‌ పెవిలియన్‌కు చేర్చాడు. చివరి రెండు ఓవర్లలోనూ వికెట్లు కోల్పోయిన కివీస్‌ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది.


స్కోరుబోర్డు

న్యూజిలాండ్‌: గప్టిల్‌ (బి) రౌఫ్‌ 17; మిచెల్‌ (సి) ఫఖర్‌ (బి) ఇమాద్‌ 27; విలియమ్సన్‌ (రనౌట్‌) 25; నీషమ్‌ (సి) ఫఖర్‌ (బి) హఫీజ్‌ 1; కాన్వే (సి) బాబర్‌ (బి) రౌఫ్‌ 27; ఫిలిప్స్‌ (సి) హసన్‌ అలీ (బి) రౌఫ్‌ 13; సైఫర్ట్‌ (సి) హఫీజ్‌ (బి) షహీన్‌ 8; శాంట్నర్‌ (బి) రౌఫ్‌ 6; ఇష్‌ సోధి (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 20 ఓవర్లలో 134/8. వికెట్ల పతనం: 1-36, 2-54, 3-56, 4-90, 5-116, 6-116, 7-125, 8-134. బౌలింగ్‌: షహీన్‌ 4-1-21-1; ఇమాద్‌ 4-0-24-1; హసన్‌ అలీ 3-0-26-0; రౌఫ్‌ 4-0-22-4; షాదాబ్‌ 3-0-19-0; హఫీజ్‌ 2-0-16-1.


పాకిస్థాన్‌: రిజ్వాన్‌ (ఎల్బీ) (బి) సోధి 33; బాబర్‌ ఆజమ్‌ (బి) సౌథీ 9; ఫఖర్‌ జమాన్‌ (ఎల్బీ) (బి) సోధి 11; హఫీజ్‌ (సి) కాన్వే (బి) శాంట్నర్‌ 11; షోయబ్‌ మాలిక్‌ (నాటౌట్‌) 27; ఇమాద్‌ వసీం (ఎల్బీ) (బి) బౌల్ట్‌ 11; ఆసిఫ్‌ అలీ (నాటౌట్‌) 27; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం: 18.4 ఓవర్లలో 135/5. వికెట్ల పతనం: 1-28, 2-47, 3-63, 4-69, 5-87. బౌలింగ్‌: శాంట్నర్‌ 4-0-33-1, సౌథీ 4-0-25-1, బౌల్ట్‌ 3.4-0-29-1, నీషమ్‌ 3-0-18-0, సోధి 4-0-29-2.

Updated Date - 2021-10-27T07:23:42+05:30 IST