సిద్ధూ కోసం పాక్ లాబీలు: అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-01-24T23:58:53+05:30 IST

పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అమరీందర్ పోటీకి దిగుతున్నారు. సోమవారం ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అమరీందర్ మాట్లాడుతూ..

సిద్ధూ కోసం పాక్ లాబీలు: అమరీందర్ సంచలన వ్యాఖ్యలు

చండీగఢ్: పంజాబ్ కాంగ్రెస్ అధినేత నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం పాకిస్తాన్ ప్రధాని లాబీలకు పాల్పడ్డారని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిద్ధూని తన కేబినెట్ నుంచి తొలగించినప్పుడు పాక్ నుంచి అనేక విజ్ణప్తులు తనకు వచ్చాయని, సిద్ధూని మళ్లీ కేబినెట్‌లోకి తీసుకోవాలని స్వయంగా పాకిస్తాన్ ప్రధానే తనకు రిక్వెస్ట్ పంపారని ఆయన వెల్లడించారు. సిద్ధూ తనకు పాత మిత్రుడని ఇమ్రాన్ గుర్తు చేసినట్లు సిద్ధూ పేర్కొన్నారు.


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి అమరీందర్ పోటీకి దిగుతున్నారు. సోమవారం ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకాలు పూర్తయ్యాయి. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో అమరీందర్ మాట్లాడుతూ ‘‘సిద్ధూని తిరిగి కేబినెట్‌లోకి తీసుకుంటే బాగుటుంది. అతడు నాకు పాత మిత్రుడు. అయితే అతడు బాగా పని చేయడం లేదని మీరు అనుకుంటే మీరు అతడిని మళ్లీ తొలగించవచ్చు’’ అని పాకిస్తాన్ ప్రధానమంత్రి తనకు విజ్ణప్తి చేసినట్లు పేర్కొన్నారు.


కాగా, అమరీందర్ ఈ వ్యాఖ్యలు చేసిన కొద్ది సమయానికే సిద్ధూ మీడియాతో మాట్లాడారు. అమరీందర్ వ్యాఖ్యలపై ప్రశ్నించగా తానేం స్పందించబోనని సిద్ధూ పేర్కొన్నారు. ‘‘నేను దీనిపై ఏమీ స్పందించదల్చుకోలేదు. ఆయన ఇప్పుడు ఎవరి కోసం పని చేస్తున్నారో అందరికి బాగా తెలుసు’’ అని సిద్ధూ అన్నారు. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం పంజాబ్ ముఖ్యమంత్రిగా అమరీందర్ సింగ్ ఎన్నికయ్యారు. అనంతరం సిద్ధూని తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే కొన్ని కారణాల వల్ల జూలై 2019లో అమరీందర్ ప్రభుత్వం నుంచి సిద్ధూ బయటికి వచ్చారు.


ముందుగా భారతీయ జనతా పార్టీ నేత అయిన సిద్ధూ.. చాలా కాలం క్రితమే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారోత్సవానికి వెళ్లిన సిద్ధూ ఆ సమయంలో పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావెద్ బజ్వాను కౌగిలించుకున్నారు. ఇది దేశంలో రాజకీయంగా పెద్ద వివాదానికి దారి తీసింది. పాక్‌తో ఇండియాకు ఉన్న వివాదాల దృష్ట్యా పాక్ ఆర్మీ చీఫ్‌ను సిద్ధూ కౌగిలించుకోవడంపై ప్రధానంగా బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘‘పాకిస్తాన్ అనుకూలంగా ఉండే సిద్ధూ తీరుకు నేను వ్యతిరేకం. భారత సైనికుల్ని సరిహద్దులో పాకిస్తానీలు చంపుతున్నారు. కానీ సిద్ధూ పాక్ ఆర్మీ చీఫ్‌ను కౌగిలించుకున్నారు’’ అంటూ అప్పట్లో అమరీందర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Updated Date - 2022-01-24T23:58:53+05:30 IST