ఆఫ్ఘన్‌పై మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దు... ప్రపంచ దేశాలకు పాక్ హెచ్చరిక...

ABN , First Publish Date - 2021-11-11T22:40:05+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పొరపాట్లు పునరావృతం కానివ్వొద్దని

ఆఫ్ఘన్‌పై మళ్ళీ ఆ పొరపాటు చేయొద్దు... ప్రపంచ దేశాలకు పాక్ హెచ్చరిక...

ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్థాన్ విషయంలో పొరపాట్లు పునరావృతం కానివ్వొద్దని పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ హెచ్చరించారు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌ను ఏకాకిని చేసినపుడు అనేక సమస్యలు ఉత్పన్నమైన విషయాన్ని గుర్తు చేశారు. తాలిబన్లు ప్రపంచంతో సంప్రదింపుల కోసం ఆసక్తి చూపుతున్నారని, తమ ప్రభుత్వానికి గుర్తింపు సాధించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.  చైనా, రష్యా, అమెరికా దౌత్యవేత్తలు పాల్గొన్న ట్రోయికా ప్లస్ సమావేశంలో ఆయన ఈ హెచ్చరిక చేశారు. 


ఆఫ్ఘనిస్థాన్ పరిస్థితులపై చర్చించేందుకు ఇస్లామాబాద్‌లో ఈ సమావేశాన్ని పాకిస్థాన్ ఏర్పాటు చేసింది. ఆఫ్ఘనిస్థాన్‌లో ఆర్థిక వనరుల కొరత వల్ల ప్రజలు ఘోర విపత్తును ఎదుర్కొనబోతున్నారని, తక్షణమే సహాయపడాలని అంతర్జాతీయ సమాజాన్ని ఖురేషీ కోరారు. ప్రస్తుతం జీతాలు చెల్లించలేని స్థితి ఉందన్నారు. సామాన్యులు కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారని, దీనివల్ల ప్రభుత్వంపై దారుణమైన ప్రభావం పడుతోందని అన్నారు. ఆఫ్ఘన్ ఆస్తులపై విధించిన ఆంక్షలను తొలగించాలని కోరారు. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభమవుతాయని చెప్పారు. ఆఫ్ఘన్ సెంట్రల్ బ్యాంకుకు చెందిన దాదాపు 9 బిలియన్ డాలర్ల ఆస్తులను అమెరికా స్తంభింపజేసిన సంగతి తెలిసిందే.


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముట్టాకీ బుధవారం తొలిసారి పాకిస్థాన్‌ పర్యటనకు వచ్చారు. ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ సంబంధాలను యథాతథ స్థితికి తీసుకురావడానికి ఇరు దేశాలు ప్రయత్నిస్తున్న తరుణంలో ముట్టాకీ పర్యటనకు ప్రాధాన్యం ఉంది. ఆయన ట్రోయికా ప్లస్ సభ్యులను కలిసే అవకాశం ఉంది. 


Updated Date - 2021-11-11T22:40:05+05:30 IST