ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్థాన్ ఎంబసీ అధికారుల ఘాటు విమర్శలు

ABN , First Publish Date - 2021-12-03T21:51:43+05:30 IST

పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పట్ల ఆ దేశ అధికారులు

ఇమ్రాన్‌ ఖాన్‌పై పాకిస్థాన్ ఎంబసీ అధికారుల ఘాటు విమర్శలు

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‌ పట్ల ఆ దేశ అధికారులు సంయమనాన్ని విడనాడారు. జీతాలు రాకపోవడంతో, ‘‘ఇలా ఎంత కాలం?’’ అని నిలదీస్తున్నారు. మౌనంగా ఉంటూ ఎంత కాలం పని చేయగలమని ప్రశ్నిస్తున్నారు. ట్విటర్ వేదికగా ఈ ప్రశ్నలు సంధిస్తూ ఓ పేరడీ సాంగ్‌ను కూడా పోస్ట్ చేశారు. 


సెర్బియాలోని పాకిస్థాన్ ఎంబసీ అధికారిక ట్విటర్ ఖాతాలో దౌత్యాధికారులు ఈ పోస్ట్ చేశారు. ద్రవ్యోల్బణం గత రికార్డులన్నిటినీ బద్దలు కొడుతోందని, మూడు నెలల నుంచి జీతాలు లేవని వాపోయారు. తమ పిల్లలకు పాఠశాల ఫీజులు చెల్లించలేకపోతున్నట్లు తెలిపారు. ఫీజులు చెల్లించలేపోవడంతో తమ పిల్లలు పాఠశాలలకు వెళ్ళడం లేదని తెలిపారు. మౌనంగా ఉంటూ, ఇలా ఎంత కాలం పని చేయాలని కోరుకుంటున్నారు ఇమ్రాన్ ఖాన్ గారూ? అని నిలదీశారు. ఇదేనా నవ పాకిస్థాన్? అని ప్రశ్నించారు. తమకు మరో దారి లేక ఈ ట్వీట్ ఇచ్చినట్లు చెప్తూ, ‘సారీ, ఇమ్రాన్ ఖాన్’ అని పేర్కొన్నారు. 


 సెర్బియాలోని పాకిస్థాన్ ఎంబసీ ఈ ట్వీట్ ఇచ్చింది. ఇది బ్లూ టిక్ ఉన్న వెరిఫైడ్ హ్యాండిల్. ఈ సందేశంతోపాటు ఓ పేరడీ సాంగ్‌ను కూడా జత చేశారు. అయితే ఈ ట్వీట్‌ను కాసేపటి తర్వాత తొలగించారు. 


ఈ ట్వీట్‌కు కామెంట్స్ సెక్షన్‌లో ఈ హ్యాండిల్‌ను ఎవరు నిర్వహిస్తున్నారని కొందరు అడిగారు. ఈ అకౌంట్‌ను హ్యాక్ చేశారా? అని ప్రశ్నించారు. మరికొందరు ఈ ట్వీట్ చేసినవారిని సమర్థించారు. ఇదిలావుండగా, పాకిస్థానీ అధికారులు దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదు. 



Updated Date - 2021-12-03T21:51:43+05:30 IST