చెల్లెమ్మలకు జగనన్న సర్కార్‌ ఝలక్‌

ABN , First Publish Date - 2021-12-30T07:58:08+05:30 IST

రాష్ట్రంలో చెల్లెమ్మలకు జగనన్న ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది....

చెల్లెమ్మలకు జగనన్న సర్కార్‌ ఝలక్‌

  • పెళ్లికానుకకు పైసల్లేవ్‌
  • రెండేళ్లుగా వధువులకు అందని కానుక
  • టీడీపీ హయాంలో పథకం అమలు 
  • ఈ ప్రభుత్వంలో ‘వైఎస్ఆర్‌’గా మార్పు
  • సీఎం స్వయంగా ప్రకటించి మొండిచేయి


(అమరావతి-ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో చెల్లెమ్మలకు జగనన్న ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. చెల్లెమ్మలకు ఇస్తామన్న వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక ఊసే ఎత్తడం లేదు. రెండేళ్లుగా వధువులకు కానుక అందడం లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే గాక, సీఎం అయిన తర్వాత ఇచ్చిన హామీని కూడా తుంగలో తొక్కారన్న విమర్శలు వస్తున్నాయి. గతంలో టీడీపీ హయాంలో అమల్లో ఉన్న పెళ్లికానుక పేరును మార్చి.. వైసీపీ ప్రభుత్వం వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక పేరుతో ఆర్భాటంగా మళ్లీ పథకాన్ని ప్రారంభించింది. ఆయా కులాలకు చెందిన పెళ్లికూతుర్లకు ఇవ్వాల్సిన కానుక మొత్తాన్నీ పెంచింది. ఇది జరిగి రెండేళ్లకు పైగా అయినా ఈ పథకం అమలుకు మోక్షం కలగలేదు. దీంతో పాటు కులాంతర వివాహాలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్‌ కూడా ఇవ్వడం లేదు. టీడీపీ హయాంలో ఎన్నికల కోడ్‌ కారణంగా లబ్ధిదారులకు పంపిణీ చేయలేకపోయిన నిధుల సంగతీ మరచిపోయారు. ఆర్థిక ఇబ్బందుల నేపఽథ్యంలో ఇప్పుడు ఆ పథకానికి చరమగీతం పాడారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


టీడీపీ హయాంలో చంద్రన్న పెళ్లికానుక

నిరుపేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు భారం కారాదన్న ఉద్దేశంతో గత ప్రభుత్వంలో చంద్రన్న పెళ్లికానుక పేరుతో నాటి సీఎం చంద్రబాబు వినూత్న పథకాన్ని తీసుకొచ్చారు. నవ వధువు అత్తారింటికి వెళ్లినప్పుడు అభద్రతా భావంతో లేకుండా ఉండాలని ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, కాపు కులాలకు చెందిన పేదింటి ఆడపిల్లలకు ప్రభుత్వం అండగా నిలిచింది. బాల్యవివాహాలు నిర్మూలించేందుకు, రిజిస్ట్రేషన్‌ చేయడం ద్వారా వధువుకు రక్షణ కల్పించడం ప్రధాన ఉద్దేశంగా పథకం అమలు చేశారు. దీనికింద 10 రకాల వర్గాలకు సింగిల్‌ డెస్క్‌ విధానంలో లబ్ధి కలిగేలా అమల్లోకి తెచ్చారు. కులాంతర వివాహాలను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన పథకాలను ఈ విధానంలోకి తెచ్చారు. వధూవరులు 15రోజుల ముందు 1100కు ఫోన్‌ చేస్తే అన్ని వివరాలు అందించేవారు. కల్యాణమిత్ర ద్వారా ప్రక్రియను సులభతరంగా పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేశారు.


పేరు మార్చి వదిలేశారు..

వైసీపీ ప్రభుత్వం వచ్చాక చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని రద్దు చేస్తుందేమోననే ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి స్వస్తి పలుకుతూ పెళ్లికానుకను వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకగా మారుస్తూ సీఎం జగన్‌ ప్రకటించారు. 2019 అక్టోబరులో వైఎ్‌సఆర్‌ పెళ్లికానుకను పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. 2020 ఏప్రిల్‌ 2నుంచి పెంచిన కానుక మొత్తం అమల్లోకి వస్తుందన్నారు. అయితే ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అసలు పెళ్లికానుకే అమల్లోకి రాలేదు. ఆ తర్వాత 2020 నవంబరు 11న విజయవాడలో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా సీఎం జగన్‌ దీనిపై స్వయంగా హామీ ఇచ్చారు. గతంలో పెండింగ్‌లో ఉన్న పెళ్లి కానుక, వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైన పెళ్లికానుక లబ్ధిదారులకు ఈ ఏడాది మొదట్లో ఇస్తామని ప్రకటించారు. ఈ ఏడాది బడ్జెట్‌ తర్వాత అయినా ఈ పథకం అమల్లోకి వస్తుందని అంతా భావించారు. అయితే ఈ ఏడాది కూడా వాటి ఊసే లేకపోవడంతో నూతన దంపతులు నిరాశ చెందారు. 


ఇంకెప్పుడిస్తారో..? 

రాష్ట్రవ్యాప్తంగా 2018-19 సంవత్సరంలో 94,749 రిజిస్ట్రేషన్లు జరగగా అందులో 83,081 మందికి అర్హత కల్పించి, 79,709 మందికి రూ.307 కోట్లు విడుదల చేశారు. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం, దరఖాస్తులకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కాకపోవడం తదితర కారణాల వల్ల అప్పట్లో మంజూరైన వారిలో 2 వేలమందికి  రూ.27 కోట్లు పెళ్లికానుక ఇంకా అందలేదు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత 2019-20 సంవత్సరంలో 77,735 రిజిస్ట్రేషన్లు కాగా, అందులో 10,371 మంది వధువులకు రూ.42.96 కోట్లు కానుక మంజూరు చేశారు. ఈ పెళ్లి కానుక ఇస్తారని దంపతులు అప్పటి నుంచి ఎదురు చూస్తూనే ఉన్నారు. జగన్‌ స్వయంగా హామీ ఇచ్చిన వైఎ్‌సఆర్‌ పెళ్లికానుక అమలు గురించి మరచిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆడబిడ్డలకు పెళ్లికానుక ఇంకెప్పుడిస్తారంటూ నిలదీస్తున్నారు. 

Updated Date - 2021-12-30T07:58:08+05:30 IST