క్షణికావేశంలో భార్యను అంతం చేసి.. ఆపై..

ABN , First Publish Date - 2020-08-02T18:26:58+05:30 IST

పైడిభీమవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో..

క్షణికావేశంలో భార్యను అంతం చేసి.. ఆపై..

ఆవేశమే...యమపాశమై! 

భార్యను హత్య చేసి.. ఆపై రోడ్డు ప్రమాదంలో భర్త మృతి

వేల్పురాయిలో విషాదం

ఆస్తి వివాదాలే.. ఘర్షణకు కారణం


రణస్థలం(శ్రీకాకుళం): పైడిభీమవరం వద్ద జాతీయ రహదారిపై శనివారం ఉదయం రోడ్డు ప్రమాదంలో బాలి వెంకటరావు(55) మృతి చెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీకొనగా.. రోడ్డుపై విగతజీవిగా పడి ఉండడాన్ని స్థానికులు గుర్తించారు. ఈ విషయాన్ని వెంకటరావు కుటుంబ సభ్యులకు చెప్పేందుకు ఇంటికి వెళ్లారు. అక్కడ మరో ఘటన చూసి ఉలిక్కిపడ్డారు. 


వెంకటరావు ఇంట్లో ఆయన భార్య అక్కమ్మ రక్తపుమడుగులో విగతజీవిగా కనిపించింది. తలపై గాట్లు... తీవ్ర రక్తస్రావంతో మృతిచెందింది. ఈ దృశ్యాన్ని చూసి స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. రణస్థలం మండలం వేల్పురాయిలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. భార్యాభర్తలిద్దరూ ఒకేరోజు.. గంటల వ్యవధిలో మృతిచెందడం గ్రామస్థులను, బంధువులను విషాదంలో నింపింది. ఆస్తి వివాదాల్లో భాగంగా.. క్షణికావేశంలో భర్తే భార్యను హత్య చేసి.. ఆపై రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడని క్లూస్‌టీం నిర్ధారించింది. వివరాల్లోకి వెళితే.. 


రణస్థలం మండలం వేల్పురాయి గ్రామానికి చెందిన బాలి వెంకటరావు(55)కు.. విజయనగరం జిల్లా అయ్యన్నపేటకు చెందిన అక్కమ్మ(45)తో ఈ ఏడాది మే 13న రెండో వివాహమైంది. తొలి భార్య ఏడాది కింద అనారోగ్యంతో మృతి చెందింది. వారిద్దరికీ ఒక కొడుకు ఉండగా.. ప్రస్తుతం ఇంజినీరింగ్‌ చదువుతున్నాడు. మొదటి భార్య మృతిచెందడంతో అక్కమ్మను  వెంకటరావు రెండో వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో కొంత భూమిని అక్కమ్మ పేరుపై రిజిస్ర్టేషన్‌ చేస్తానని అంగీకరించాడు. కానీ, ఇంతవరకూ రిజిస్ర్టేషన్‌ చేయకపోవడంతో ఈ రెండు నెలల వ్యవధిలోనే ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి.


శుక్రవారం రాత్రి ఆ ఇంట్లో ఏమైందో.. ఏమో తెలియదు కానీ.. శనివారం తెల్లవారుజామున అక్కమ్మ రక్తపు మడుగులో విగతజీవిగా మారింది. ఈ విషయం ఇరుగుపొరుగువారికి కూడా తెలియదు. కొద్దిసేపటి తర్వాత ఆమె భర్త వెంకటరావు.. పైడిభీమవరం వద్ద జాతీయ రహదారిపై మృతిచెందాడు. గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెబుదామని స్థానికులు వెళ్లగా.. ఇంట్లో అక్కమ్మ విగతజీవిగా కనిపించడంతో ఉలిక్కిపడ్డారు. తలపై గాట్లు పడి తీవ్ర రక్తం కావడంతో అక్కమ్మ ఎవరో హత్య చేశారని భావించారు. ఆస్తి విషయమై వెంకటరావే అక్కమ్మను హత్యచేసి.. తర్వాత ఆందోళనకు గురై రోడ్డు ప్రమాదంలో మృతిచెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఏదిఏమైనా క్షణికావేశం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుందని వాపోతున్నారు.


ఒకే రోజు భార్యాభర్తలిద్దరూ మృతిచెందడంతో కుటుంబసభ్యులు, గ్రామస్థులు విషాదంలో మునిగిపోయారు. వెంకటరావు ఆధ్యాత్మిక వేత్త. నిత్యం యోగసాధనలో ఉండేవారు. చదువుకున్నా.. తన భూమిని సాగుచేస్తూ జీవనం సాగించేవారు. అందరితోనూ మంచి మెలిగేవారు. అటువంటి వ్యక్తి క్షణికావేశంతో ఇటువంటి ఘటనకు ఎందుకు పాల్పడ్డాడోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. అక్కమ్మ మృతి చెందిన విషయం తెలుసుకొని అయ్యన్నపేట నుంచి కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే వేల్పురాయి చేరుకున్నారు. పెళ్లయిన రెండు నెలలకే మృతి చెందిందంటూ.. సోదరుడు పైడిరాజు, బంధువులు దిగ్ర్భాంతికి గురయ్యారు. తలపై గాట్లు చూసి.. పారతో మోదినట్టు గుర్తించారు. ఇంత దారుణంగా చంపాల్సినంత తప్పు తన చెల్లి ఏమి చేసిందంటూ.. పైడిరాజు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ సంఘటనపై జేఆర్‌పురం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని క్లూస్‌టీం పరిశీలించింది.


వెంకటరావే పారతో.. అక్కమ్మ తలపై గట్టిగా మోదడంతో తీవ్ర రక్తస్రావమై మృతిచెందినట్టు గుర్తించింది. అక్కమ్మ సోదరుడు పైడిరాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జేఆర్‌పురం సర్కిల్‌ ఇన్‌చార్జి సీఐ ప్రసాదరావు కేసు నమోదు చేశారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వెంకటరావు కేసును జేఆర్‌ పురం ఎస్‌ఐ శ్రీనివాసరావు నమోదు చేశారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్‌కు తరలించారు. 


Updated Date - 2020-08-02T18:26:58+05:30 IST