Abn logo
Mar 3 2021 @ 00:12AM

రసాయనాల నుంచి ప్రకృతి వైపు

  • తుంగభద్రానదీ తీరంలో ఆమె కథా‘మాధురి’. 
  • కృష్ణాతీరంలో  పారిశ్రామికవేత్త. 
  • నడిచి వచ్చిన దారుల్లో తారసపడిన ఎన్నో జీవితాలను కథలుగా మలిచారు.
  • ఇప్పుడు మూలికలు, తైలాలతో... పూర్వకాలం సౌందర్య సాధనాలను తయారుచేసి ఈ తరానికి అందిస్తున్నారు. 
  • కర్ణాటకలోని గంగావతి నుంచి కృష్ణాతీరానికి చేరుకున్న 
  • మన్నెం సింధుమాధురి ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడం వెనుక కథేమిటో ఆమె మాటల్లోనే...


తాను నడిచి వచ్చిన దారుల్లో తారసపడిన ఎన్నో జీవితాలను కథలుగా మలిచారు సింధుమాధురి. ప్రకృతి మనకు ఇచ్చిన మూలికలు, తైలాలతో తన అమ్మమ్మలు తయారు చేసిన సౌందర్యసాధనాలన్నింటినీ తిరిగి ఈ తరానికి అందిస్తున్నారు. కర్ణాటకలోని గంగావతి నుంచి కథలతో కాలక్షేపం చేస్తూ, కృష్ణాతీరానికి చేరుకున్న  ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారడం వెనుక ఒక కథే ఉంది. ఆ కథ ఏంటో ఆమె మాటల్లోనే విందాం.. 


‘‘మాది కర్నాటకలోని గంగావతిలో ఉళైనూర్‌ క్యాంప్‌. అమ్మమ్మవాళ్ల ఊరు గుంటూరుజిల్లా బొబ్బర్లంక. నేను ఇక్కడే పుట్టాను. మా మూలాలు ఇక్కడివే. మా ముత్తాతల కాలంలో ఇక్కడి నుంచి కర్నాటక వెళ్లి స్థిరపడ్డారు. కమ్యూనిస్టు నేపథ్యం ఉన్న కుటుంబం మాది. అమ్మ యలవర్తి జోయా, నాన్న సుబ్బారావు ఇద్దరూ వైద్యులే.


రచయిత్రి నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా..

‘మా స్నేహితురాలి వాళ్ల పాప తీవ్రమైన ఎలర్జీతో బాధపడుతుండేది. ఆహారంలో బోలెడు మార్పులు చేశారు. అయినా ఫలితం లేదు. ఎలర్జీ టెస్ట్‌ చేయిస్తే స్నానానికి వాడే సబ్బులు, డిటర్జెంట్స్‌ కారణమని తెలిసింది. నాకు అప్పుడు నా బాల్యంలో మా అమ్మమ్మవాళ్లు ఇంట్లోనే తయారు చేసిన సబ్బులు, సున్నిపిండి గుర్తుకొచ్చాయి. అప్పట్లో వంట నూనెలను ఏడాది మొత్తానికీ ఇంట్లోనే గానుగలో తయారు చేసుకునేవారు. ఏడాది చివరికి మిగిలిన నూనెతో దుస్తులు ఉతుక్కునే సబ్బులను, వెన్నతో స్నానం సబ్బులను, రకరకాల మూలికలతో సున్నిపిండిని, తేనె తుట్టె నుంచి వచ్చే మైనం నుంచి క్రీమ్‌లను తయారు చేసేవారు. అది గుర్తుకొచ్చి పాపను కొద్ది రోజులు నాకు అప్పజెప్పమని అడిగాను. వాళ్లు సరేనన్నారు. వెంటనే గుంటూరు మార్కెట్‌లో ఆయుర్వేద దినుసులు సేకరించి, స్నానంపొడి (సున్నిపిండి కాదు) చేసి ఇచ్చాను. పాపకు రోజూ దానితోనే స్నానం. దుస్తులను సబ్బు వినియోగించకుండా, వేడి నీటిలో జాడించమని సూచించాను. పది రోజుల్లో ఎలర్జీ తగ్గిపోయింది. ఆ తరువాత పాపకు ఆ పొడితోనే సబ్బు, తేనె మైనంతో క్రీము తయారు చేసి ఇచ్చాను. 


నేను హుబ్లీలో బ్యూటిక్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డిప్లమో ఇన్‌ కాస్మొటాలజీ చేశాను. అప్పట్లో హంపీలో ఫ్రెంచ్‌ సినిమా షూటింగ్స్‌ జరిగేవి. వారికి మేకప్‌ పర్సన్‌ను నేనే. మేకప్‌ తీసేసిన తరువాత ఎలర్జీతో ఇబ్బందిపడేవారి కోసం తేనె మైనంతో క్రీమ్‌ చేసి ఇచ్చేదాన్ని. ఆ క్రీమ్‌నే ఇప్పుడూ తయారు చేస్తున్నాను.


ఎన్నో పరిశోధనల తరువాత

ఈ సంఘటన జరిగి ఆరేళ్లవుతుంది. అప్పటికి నేచురల్‌ ప్రొడక్ట్స్‌ ఎక్కడా లేవు. వీటిపై దృష్టి సారించాను. రెండేళ్లు పరిశోధనలో మునిగి తేలాను. ఎంతలా అంటే నా ఇంటి నిండా సబ్బులే. ఎలా తెలిసిందో ఒకరోజు గుంటూరు జిల్లా పరిశ్రమల అధికారిణి వాణి మా ఇంటికి వచ్చారు. ‘ఇంత శ్రమిస్తున్నపుడు ఉద్యోగ్‌ ఆధార్‌ లేకుంటే ఎలా?’ అంటూ వెంటబెట్టుకెళ్లి ఇప్పించారు. ఇక నేను ఒక సబ్బుతో ఆగదలుచుకోలేదు. ఒక్కో శరీరతత్వానికి ఒక్కో రకం సబ్బు కావాలి. ప్రకృతిలో సహజంగా లభ్యమయ్యే పూల రెమ్మలు, చెట్ల కొమ్మలు, బెరళ్లు, మూలికలతో వాటిని తయారు చేయాలనుకున్నాను. ఆర్గానిక్‌ ఆయిల్స్‌ కావాలి. ఏడాదిన్నర అన్వేషణ తరువాత కర్నాటక- తమిళనాడు సరిహద్దు ప్రాంతంలోని ఉడుముల పేట, తమిళనాడులోని సేలం, కేరళలోని మున్నార్‌లలో నమ్మకమైన ఆర్గానిక్‌ పంటలను సాగుచేసే రైతులతో పరిచయం అయింది. 


సబ్బుల తయారీ ఇలా..

సబ్బుల తయారీకి వాగాయి చెక్క గానుగతో తీసిన నూనెను వినియోగిస్తాను. రంగు, పరిమళం కోసం ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ కావాలి. ఇందుకు కొన్ని క్వింటాళ్ల పూల రెమ్మలు, కాండాలు, పండ్ల తొక్కలు కావాలి. వాటిని మట్టి కుండల్లో కాస్తారు. హిమాచల్‌ప్రదేశ్‌ పర్వత ప్రాంతాల్లో వీటిని తయారు చేస్తారు. ఇవి చాలా ఖరీదుతో కూడుకున్నవి. ఒక్క జాస్మిన్‌ ఎసెన్షియల్‌ ఆయిల్‌ ఖరీదు లీటరు రూ.మూడు లక్షలు ఉంటుంది. వర్షం నీటిని సేకరించి, ఒక ట్యాంక్‌లో ఉంచి, డిస్టిలేషన్‌ చేయిస్తాం. ఆ నీటిని, పరిమితంగా సోడియం సాల్ట్స్‌ను వాడతాం. అలోవీరా, దానిమ్మ రసం, గులాబీ పూ రేకుల రసం వంటి వాటితో కోల్డ్‌ ప్రాసెస్డ్‌ ఆయిల్స్‌ను తయారుచేసి, తేనె మైనం కలిపి ప్రత్యేకమైన సబ్బులను తయారుచేస్తాం. కెమికల్స్‌ కలపం కాబట్టి మా సబ్బును తయారైన 18 నెలల్లోపు వాడాలి. ప్యాక్‌పై 12 నెలలే అని రాస్తాం.


డ్రగ్‌ లైసెన్స్‌ కోసం ఎన్ని తిప్పలో..

మా ఉత్పత్తులను అమెజాన్‌లో ఉంచాలన్నది నా కల. అందుకు ప్రభుత్వం ఇచ్చిన డ్రగ్‌ లైసెన్స్‌ ఉండాలని నిబంధన పెట్టారు. అధికారుల చుట్టూ తిరిగాను. పని కాలేదు. ఇదే సమయంలో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రంలోని 400 మంది ఎంటర్‌పెన్యూర్స్‌తో సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో నా సబ్బుల తయారీ గురించి, నాకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించి, ‘నాకు లోన్లు, సబ్సిడీలతో పని లేదు.. డ్రగ్‌ లైసెన్స్‌ ఇప్పిస్తే తల తాకట్టు పెట్టుకునైనా వ్యాపారం చేసుకుంటాను.’ అని చెప్పాను. ఆయన ఒక అధికారికి ఆ బాధ్యతలను అప్పజెప్పారు. కొద్ది రోజుల్లో డ్రగ్‌ లైసెన్స్‌ వచ్చింది. నా కల నెరవేరింది. ఇప్పుడు ఈ ప్రాంతం నుంచి అమెజాన్‌లో అత్యధిక అమ్మకాలు ‘కలాపి’వే.


సక్సెస్‌కు దగ్గర దారి లేదు

సక్సెస్‌కు దగ్గర దారి లేదు. శ్రమే విజయానికి చేరువ చేస్తుంది. ఏ కష్టమూ పడకపోతే దాని విలువ ఎవరికీ తెలియదు. ఎందుకంత కష్టపడతావంటారు అందరూ. నాకు అందులోనే ఆనందం ఉంది. ఆరోగ్య పరంగా, ఆర్థికంగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాను. అయినా నిలదొక్కుకున్నాను. 


విలువలతో కూడిన వ్యాపారం చేయాలి

వ్యాపారం అందరూ చేయాలి. లాభాలను ఆర్జించాలి. కానీ ఆ వ్యాపారం విలువలతో కూడినదై ఉండాలి. మనమూ, మనతో పాటు మన సమాజమూ ఆరోగ్యంగా ఉండాలి కదా. అటువంటి వ్యాపారం జరగాలన్నదే నా కోరిక. ఈ నేచురల్‌ ప్రొడక్ట్స్‌ తయారీ కోసం చాలా కృషి చేయాల్సి వచ్చింది. నేను నేర్చుకున్న విద్య నాతోనే ఆగిపోకూడదు. అందుకే ఆసక్తి ఉన్నవారందరికీ శిక్షణ ఇద్దామనుకుంటున్నా. త్వరలోనే నా మనసులోని ఆలోచనకు ఆచరణ రూపం ఇస్తా. పెద్ద పెద్ద బ్రాండ్‌నేమ్స్‌తో మార్కెట్లో హల్‌చల్‌ చేస్తున్న కెమికల్‌ ప్రొడక్ట్స్‌ స్థానంలో నేచురల్‌ ప్రొడక్ట్స్‌ విస్తృతంగా రావాలి. అదే నా లక్ష్యం.


ఒక్కొక్కరికీ ఒక్కో కాంబినేషన్‌ సబ్బు 

సాధారణంగా ఒక కుటుంబం మొత్తం ఒకే రకం సబ్బును ఉపయోగిస్తారు. కానీ మేము సబ్బులను శరీరతత్వాన్ని, సమస్యలను దృష్టిలో ఉంచుకుని తయారు చేస్తాం. ఉదాహరణకు కొందరి శరీరంపై మచ్చలుంటాయి. అవి ఎక్కువగా ఉంటే 100 శాతం నీమ్‌తో తయారు చేసిన సబ్బును ఉపయోగించాలి. ఒక మోస్తరు మచ్చలుంటే.. వయసు పైబడినవారికైతే వీట్‌గ్రాస్‌, తక్కువ వయసువారికి నీమ్‌ అండ్‌ అలోవెరా. అన్ని రకాల చర్మ సంబంధ ఎలర్జీలకు కోకోనట్‌, ఆల్‌మండ్‌ కాంబినేషన్‌ చక్కగా పనిచేస్తుంది. యువతకు గులాబీ, దానిమ్మ రసంతో తయారు చేసిన సబ్బును సూచిస్తాం. 


ఇవి కాకుండా 24 రకాల గింజలు, పువ్వులు, ఆకులు, దినుసులను, మట్టితో శుద్ధి చేసిన ఆయిల్‌ను వినియోగించి హెయిర్‌ ఆయిల్‌ తయారు చేస్తాం. ఆర్గానిక్‌ పెసలను ఆవునేతితో వేయించి, 32 రకాల దినుసులను, మాను పసుపును ఉపయోగించి సున్నిపిండి తయారు చేస్తాం. కొబ్బరిపాలు, కొబ్బరి నూనె, నీళ్లు, క్రీమ్‌, ఎసెన్షియల్‌ ఆయిల్స్‌తో షాంపూబార్‌ తయారు చేస్తాం. ఇవి అందరికీ ఉపయోగపడతాయి’’


వ్యాపారం అందరూ చేయాలి. లాభాలను ఆర్జించాలి. కానీ ఆ వ్యాపారం విలువలతో కూడినదై ఉండాలి. మనమూ, మనతో పాటు మన సమాజమూ ఆరోగ్యంగా ఉండాలి కదా. అటువంటి వ్యాపారం జరగాలన్నదే నా కోరిక.

పద్మావతి వడ్లమూడి

ప్రత్యేకం మరిన్ని...