కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2021-01-21T18:53:31+05:30 IST

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్

కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్‌ సంచలన వ్యాఖ్యలు
file photo

హైదరాబాద్‌ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్‌కు శుభాకాంక్షలు’ అని పద్మారావు వ్యాఖ్యానించారు. కేటీఆర్‌ సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేయడంతో వేదికపై ఉన్న పెద్దలు.. కార్యక్రమానికి వచ్చిన జనాలు పద్మారావు వైపే చూడసాగారు. భాగ్యనగరంలోని సికింద్రాబాద్ రైల్వే ఎంప్లాయిస్‌ సంఘం ఆఫీస్‌ ప్రారంభోత్సవంలో పద్మారావు ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు.


స్పందిచలేదేం!?

అయితే పద్మారావు మాట్లాడుతున్నప్పుడు కానీ.. మంత్రి కేటీఆర్ ప్రసంగంలో గానీ దీనిపై ఎలాంటి రియాక్షన్ రాలేదు. రైల్వే ఎంప్లాయిస్ సంఘం ఆఫీస్‌ ప్రారంభోత్సవానికి రావడం సంతోషం అని.. ప్రపంచంలోనే గొప్ప స్థితిలో రైల్వేస్ ఉండడానికి కార్మికుల,ఉద్యోగుల కృషే అని మాట్లాడారే కానీ ‘సీఎం’ అన్న వ్యాఖ్యలపై మాత్రం స్పందించలేదు. ఇవాళ సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ డివిజనల్ ఆఫీస్‌ను కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు, మంత్రులు శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజయ్ పాల్గొన్నారు.


ఏబీఎన్‌లో పెద్ద ఎత్తున కథనాలు..

ఇదిలా ఉంటే.. గత కొన్ని రోజులుగా ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రిక, ‘ఏబీఎన్’ టీవీ చానెల్‌‌లో ‘కేటీఆరే సీఎం’, ‘కేటీఆర్‌కు పట్టాభిషేకం ఎప్పుడు..?’ ‘కేటీఆర్‌కు పట్టాభిషేకం’ అంటూ పెద్ద ఎత్తున కథనాలతో పాటు ప్రత్యేకంగా డిబెట్స్‌ కూడా జరిగాయి. ఈ సంచలన కథనాలపై పలువురు ప్రముఖులతో పాటు బీజేపీ నేతలు కూడా తమదైన శైలిలో స్పందించారు. కాగా.. కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావాలంటున్న నేతల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు పలుమార్లు ఈ ఆకాంక్షను వ్యక్తం చేయగా.. తాజాగా మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ బాట పట్టారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఇవాళ కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ ఇలా అనడం రూమర్లకు బలం చేకూరినట్లయ్యింది. మరోవైపు ఫిబ్రవరి-14న కేటీఆర్‌కు పట్టాభిషేకం అంటూ పుకార్లు వస్తున్నాయి. మరి అందరూ అనుకున్నట్లుగా ఆ రోజున పట్టాభిషేకం జరుగుతుందో..? లేదో..? వేచి చూడాలి.



Updated Date - 2021-01-21T18:53:31+05:30 IST