Abn logo
Sep 6 2021 @ 00:22AM

‘పో’ కథలో ఒక వెంటాడే కన్ను!

వ్యక్తికి సమాజం చేతిలో ప్రతిరోజూ జడ్జిమెంట్‌ డే నే! వ్యక్తిని నిర్వచించి, విచారించి, తనకు తెలిసిన ఒక ‘రకం’గా నిర్ధారించి, వాడి మెడలో ఒక బిళ్ళ వేసి వదిలేయడం సంఘానికొక తప్పనిసరి పవిత్ర బాధ్యత. 


డిటెక్టివ్‌, హారర్‌, సైన్స్‌ఫిక్షన్‌ కథలకు అమెరికన్‌ రచయితలలో ఆద్యుడని చెప్పే ఎడ్గర్‌ ఆలన్‌ పో మొదటి ప్రచురణ, తన పద్దెనిమిదేళ్ల వయసులో 1827లో వచ్చిన కవితా సంకలనం "Tamerlane and Other Poems'. కానీ 1845లో ఇతడి "The Raven' కవితే అతనికి దేశంలోనేగాక యూరోప్‌ అంతా మారుమోగే పేరు తెచ్చిపెట్టింది. ఇతనికి ప్రపంచ ప్రఖ్యాత ఇమేజిస్ట్‌ కవి బోదలేర్‌ అతి పెద్ద అభిమాని. ఎంత అంటే పో కవితలు, కథలు తన భాషైన ఫ్రెంచిలోకి అనువదించేంత. యూరోపియన్‌ ఇమేజిస్ట్‌ కవులందరికీ ఇతనే ఆది ఆరాధ్యుడు. డిటెక్టివ్‌, గోథిక్‌ సాహిత్యంగా ప్రచారం పొందిన పో కథలను నిజానికి మానవ మనస్తత్వ పరిశోధనా శాస్త్ర గ్రంథాలని చెప్పవచ్చు. ఫ్రాయిడ్‌ కంటే యాభై సంవత్సరాల ముందు మనిషి స్వభావాన్ని, మానవ మనోసంక్లిష్టతలనూ, ఉన్మాద లక్షణాలను, కారణాలను తరచి చూపించిన రచయిత పో.


"The Tell-Tale Heart'' అనే పో హారర్‌ కథకు చాలా పేరుంది. ఉత్కంఠగా సాగే ఈ చిన్న కథ ఎన్నో సినిమాలకు ఇప్పటికీ వస్తువు అవుతోంది. ఈ వ్యాసం ఆ కథను సరికొత్తగా విశ్లేషించే ఒక ప్రయత్నం.


ఈ కథలో కథకుడు (నెరేటర్‌) తన శ్రోతలతో తనకు మనోవ్యాధి లేదని చాలా గట్టిగా వాదిస్తుంటాడు. (ఆ శ్రోతలు ఎవరు- పోలీసులా, న్యాయాధిపతులా, లేక మానసిక చికిత్సాలయంలో వైద్యులా, ఇరుగు పొరుగా, వారెవరూ కూడా కారా?)


తను ఒక ముసలివాడిని ఎందుకు చంపవలసిన అవసరం వచ్చిందో చెప్పడమే ఈ కథ. ఆ హత్య వెనక తనకు ధనాశో, ప్రత్యేకమైన ద్వేషమో, ప్రతీకార వాంఛో లేవు అని చెపుతాడు. ఆ ముసలివాడి ఒక కన్ను తనకు నచ్చదనీ, అది తనకు జంతువులను చావకముందే వాటిపైన పడి పీక్కుతినే రాబందు కన్నులా కనపడుతుందనీ అంటాడు. ఆ కఠినమైన కన్ను వాణ్ణి ఎంత అస్థిమితానికి, అసహనానికి, అశాంతికి గురి చేస్తుందంటే- ఆ కఠిన మైన కంటినీ, దాని స్వంతదారుని శాశ్వతంగా లేకుండా చేయాలని నిశ్చయించుకునేంతగా. పైగా మెలకువలో తెరుచుకుని చూస్తున్న కంటితోనే తనకు పేచీ కనుక- అది తనను చూస్తున్నప్పుడే హత్య చేయాలనుకుంటాడు. హత్య చేయటానికి వాడు పొంచివున్న మొదటి ఏడు రాత్రులూ ముసలాడు నిద్రలో ఉంటాడు. ఎనిమిదో రోజు ఆ కన్ను తెరుచుకుని వాడికి అదను దొరకగానే హత్య చేసి శవాన్ని రక్తం కూడా చిందకుండా జాగ్రత్తగా ఖండఖండాలుగా నరికి ఆ పడకగది గచ్చుపలకల కిందే పాతేస్తాడు. చావబోతూ ముసలాడు వేసిన కేకతో పొరుగువారు లేచి పోలీసులను హత్యాస్థలానికి రప్పిస్తారు. హంతకుడు పోలీసులను ధైర్యంగా లోపలకు పిలుస్తాడు. ఇల్లంతా చూపించి, శవాన్ని పూడ్చేసిన గదిలోనే కూచోబెట్టి మరీ ముచ్చట్లు పెడతాడు. హత్యకు సాక్ష్యాలన్నీ పకడ్బంధీగా దాచేసాననే ధీమా వాడిది. పోలీసులు కూడా సులభంగానే వాడి కథని నమ్ము తారు. ఆ ముసలివాడు అసలు ఇంట్లోనే లేడనీ, ఆ కేక తనే నిద్రలో అరిచిందనీ వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్ముతారు. కానీ ఇంతలో వాడికి నేల కింద నుంచి ముసలివాడి గుండె కొట్టుకుంటున్న శబ్దం వినిపిస్తుంది. చంపబోయేముందు ఆ ముసలి పిరికిగుండె భయపడి కొట్టుకున్నచప్పుడే మళ్ళీ మొదలయిందేమిటి అని వాడు కంగారు పడతాడు. అంతకంతకూ పెరుగుతున్న ఆ గుండె చప్పుడు వాడిని తీవ్రమైన అస్థిమితానికి నెడుతుంది. చివరకు వాడు తన నోటితోనే అసలు నిజాన్ని పోలీసుల ముందు ఒప్పుకునేలా చేస్తుంది.


కథ చదువుతుంటే ఈ నెరే టర్‌కు హత్యానేరాన్ని తప్పించు కోవడం కంటే తనకు పిచ్చి లేదని శ్రోతలను ఒప్పించడం ముఖ్యమేమో అనిపిస్తుంది. హత్య చేసినందుకు పడే శిక్ష కంటే, తన మీద మతిలేనివాడన్న ముద్ర పడటం వాడికి ఎక్కువ భయ కారణం అవడం ఇక్కడ విశేషం.


అసలు కథ మొదలవటమే, ‘‘నాకు పిచ్చని ఎందుకు, ఎలా అంటారు మీరు’’ అన్న కథకుడి వాదనతో మొదలవుతుంది. ఆ ప్రతిపాదనను ఎంతో ఓపిగ్గా, నేర్పుగా చేస్తూ వస్తాడు. నాకు మతి తప్పలేదు అంటూనే, తన సమస్య ముసలివాడు కాదనీ, వాడి రాబందు కన్ను అనీ, అది తన రక్తాన్ని గడ్డకట్టిస్తుందనీ, వెన్నెముకలో వణుకు పుట్టిస్తుందనీ, అది నేరుగా చూస్తూ నిలువునా చీల్చే డేగకన్ను అనీ అంటాడు. ‘‘నాకు పిచ్చి కుదిరింది, తలకు రోకలి చుట్టండి’’ అన్న సామెతను గుర్తు చేసేలా ఉంటుంది అతని వాదన. ఈ కథను- ఒక నియంత్రణలేని మనసుచేత ఉసిగొల్పబడి ఒక వృద్ధుణ్ణి అకారణంగా, దారుణంగా హత్యచేసి, శవాన్ని దాచి, నేరాన్ని కప్పె ట్టాలని చూసిన ఒక ఉన్మాది కథ అనవచ్చు. భయానకమైన హత్యా చిత్రణ అనవచ్చు. అపరాధభావం తట్టుకోలేక తనపైనే నేరారోపణ చేసుకునే ఒక నిస్సహాయ అంతరాత్మ కథ అనీ చెప్పవచ్చు. ఈ కథను విశ్లేషించిన వారు ఈ మూడు దారుల్లోనూ నడిచారు. దీన్ని కేవలం ఒక ఉన్మాద హంతకుడి కథగా చూడటం సులభమే.


కానీ, కథలోని మూల వస్తువులైన ఉన్మాదానికి, హత్యకు మూల భూతమైన ఆ ‘కన్ను’ ఎవరి గమనింపులోకి కూడా రావలసిన విధంగా రాలేదు. వాడి మాటల్లోనే, ‘‘ముసలాడు నాకు ఏ హానీ చేసుండలేదు. వాడి డబ్బు నాకు అస్సలు అవసరం లేదు. వాస్తవంగా నాకు వాడంటే ప్రేమే,’’ అంటాడు. సామాన్యంగా హత్యలకు కారణాలైన ధనం, ద్వేషం ఇక్కడ కారణాలు కాదు. అందుచేత కథకుడి సమస్య కన్ను. ఆ కన్ను చూసే చూపు కథకుడికి అభద్రత, భయం, అసహనం, అశాంతి కలిగిస్తోంది. అదీ ఎంత! దారుణహత్యకు తోసేంతగా.


‘‘వాడి కన్ను నా ఒంట్లో నెత్తురును గడ్డకట్టిస్తుంది. చావకముందే జంతువును ముక్కలు ముక్కలుగా పీక్కుతినే రాబందు కన్నులా ఉంటుంది వాడి కన్ను’’ అంటాడు. కానీ నిజానికి ముసలివాడిని చంపి ఏ భాగానికి ఆ భాగం ముక్కలుగా కోసి పారేసింది తనే కదా. 


ముసలివాడు సాంతం చచ్చాడు అని రూఢీ అయ్యాక ‘‘ఇంక వీడి కన్ను నన్ను వేధించదు, ఇక నిశ్చింత’’ అంటాడు. దీన్నిబట్టి ఇన్నాళ్లుగా వాడికి వెరపు కలిగించిన విషయం- ఆ కన్నుచేత ‘చూడబడటం’, ‘గమనించబడటం’. ఒక ‘చూపు’ ఇంతకు దారి తీయటమే ఈ కథావిషయం. మనిషికి అతిపెద్ద కష్టం:"being watched'' by the other. "The other is the problem''. అంటాడు Sartre. రెండో వాడితో భయం, అందులోంచి కోపం. గమనించే మూడో కన్ను లేక పోతే ఎవడికీ ఏ పని చెయ్యడానికైనా అభ్యంతరం ఉండదు, రోజూ హత్యలకు పాల్పడకపోయినా. మరి ఇంతకీ, ఇక్కడి ఈ కన్ను ఒక ఫలానా ముసలివాడి కన్ను మటుకేనా!


వజ్ర సమాన కఠినమై, నిరంతరం శల్యపరీక్ష చేస్తూ మనిషిని వెంటాడే సమాజానికి అది ప్రతీక. ఒక విడి వ్యక్తిగా ప్రతి ఒక్కరూ ఆ కంటి చేత అపరాధిగా చూడబడతారు, ఆ కంటితో విచారణకు గురవుతారు. గుంపులో కలిసినపుడు అదే వ్యక్తి విచారణ కమిటీలో కూర్చుంటాడు. ఈ trial ఏ ఒక్కరూ తప్పించుకోలేనిది. ‘‘వేట’’ ఇష్టమైన వ్యాపకం సమాజానికి.


పిరాండెలో కథ ‘‘కటట. "Mrs. Frola and Mr. Ponza, Her son-in-law''లో ఒక అత్తగారు, ఆమె అల్లుడు, ఒకరితో ఒకరు సర్దుకు పోతారు. కథలో కనిపించని ఆమె కూతురు విషయంలో కూడా వీరికి ఏ గొడవలు ఉండవు. కానీ వాళ్ళున్న ఊరు మొత్తం వీళ్ళ కుటుంబాన్ని వేయికళ్ళతో చూస్తుంటుంది, వింటుంటుంది. అత్తా, అల్లుళ్ళల్లో ఎవరి మెడలో ద్రోహి, ఉన్మాది అనే బిళ్ళ వేయాలా అని సతమతమవుతుంటారు ఊరి జనం. సమాజానిది రాబందు కన్ను! 


వ్యక్తికి ప్రతిరోజూ సమాజం చేతిలో జడ్జిమెంట్‌ డే నే! సంఘం ‘దృష్టి’ వ్యక్తిని ‘ఫలానా’ అని నిర్వచిస్తుంది. నిర్వచించి, విచారించి, తనకు తెలిసిన ఒక ‘రకం’గా నిర్ధారించి, వాడి మెడలో ఒక బిళ్ళ వేసి వదిలేయడం సంఘానికొక తప్పనిసరి పవిత్ర బాధ్యత. 


నిరంతరమైన ఈ చూపుల నిఘా వ్యక్తిని చిత్తభ్రమ అంచుల వరకూ నెడుతుంది. వాడిపై నేరస్థుడనో, పిచ్చివాడనో తన రాజముద్ర వేస్తుంది, వెలివేస్తుంది. వాడు కేకలు వేస్తే సంకెళ్ళు వేస్తుంది. ఫ్రెంచ్‌ సామెత ‘‘ఈ కుక్క పిచ్చిది, రాళ్ళతో కొడితే అరుస్తుంది..'' Man is eternally stalked, stared at, scrutinized, trialed and finally sentenced by the inescapable ""eye''.


ఇంతకీ, మనిషిని మానసికంగా దగ్ధం చేస్తున్న ఈ కన్ను నిజానికి ఇంకెవరిదోనేనా! కథకుడి మాటలు, ‘‘మెల్లటి, మెత్తటి, చటుక్కునయ్యే గోడవతలి గడియారం చప్పుడు, తనకు బాగా పరిచయమైన చప్పుడు’’, ఇంకేం చప్పుడు అది, తన గుండె చప్పుడు కాక! ఆ కఠినమైన మూడో కన్ను వీడిదే, his own unforgiving exacting conscience! 


‘‘నెత్తురు ఒక్క బొట్టు చిందకుండా జాగ్రత్త పడ్డాను’’ అంటాడు. రక్తం చిందని హత్య, అంతరాత్మ హత్య.

చేతులకు నెత్తురు అంటనీయలేదు వాడు, కానీ తన గుండె నోరు మూయలేకపోయాడు. 


There is a ""other'' man in every man! That is both the cause and the symptom of madness.


పద్మజ సూరపరాజు

99403 44406

ప్రత్యేకంమరిన్ని...